Bommarillu Bhaskar : బొమ్మరిల్లు ద‌గ్గ‌రే ఆగిపోయిన భాస్క‌ర్‌

By G.R Maharshi Oct. 16, 2021, 03:32 pm IST
Bommarillu Bhaskar : బొమ్మరిల్లు ద‌గ్గ‌రే ఆగిపోయిన భాస్క‌ర్‌

బోధ‌, బాధ ఒక‌టే. బోధ‌న వ‌ల్ల స‌మాజం మారేదే వుంటే బుద్ధునితోనే మారేది. లేదంటే టీవీ ప్ర‌వ‌చ‌న‌కారుల‌తోనైనా మారేది. ఒక‌ప్పుడు టీచ‌ర్లు, పుస్త‌కాలు, సినిమాలు మాత్ర‌మే బోధించేవి. స్కూల్లో హింస త‌ప్ప‌దు. పుస్త‌కం, సినిమా మ‌న ఇష్టం.

పాత సినిమాల్లో శుభంకార్డుకి ముందు దాస‌రి నారాయ‌ణ‌రావు ప్రేక్ష‌కుల్ని నిల‌బెట్టి మ‌రీ ఉతికేవాడు. ఇపుడు మోస్ట్ ఎలిజబుల్ బాచిల‌ర్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అదే ప‌ని చేసాడు. బొమ్మ‌రిల్లు వ‌చ్చి 15 ఏళ్ల‌యింది. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌పంచం మారిపోయింది. ప్ర‌పంచ సినిమానే అర‌చేతిలోకి వ‌చ్చింది. ప్ర‌తి మ‌నిషికీ అభిప్రాయాన్ని ప్ర‌క‌టించే గోడ (ఫేస్‌బుక్ వాల్‌) వుంది. కానీ భాస్క‌ర్ బొమ్మ‌రిల్లు దాటి రాలేక‌పోయాడు. సినిమాలో చెప్పిన చెవిటి క‌ప్ప అత‌నే. అందుకే నాసిర‌కం భార్యాభ‌ర్త‌ల కార్డున్ జోక్‌ల‌తో సినిమా ప్రారంభించాడు.

ద‌స‌రా ఉద‌యాన్నే మా ఆవిడ పిండి వంట‌లు తిందామ‌ని చెప్పింది. తినాలంటే, వండాల్సిన ప‌నిలేని కాలం. శ్రీ‌జ హోంఫుడ్స్‌కి వెళ్లి పులిహోర‌, బూరెలు చ‌క్కెర పొంగ‌లి, పాయ‌సం, వ‌డ‌లు తెచ్చాను. ఇవ‌న్నీ చేయాలంటే హాఫ్ డే స్ట‌వ్ ముంద‌ర వుండాలి. కొంటే 5 వంద‌లు. విస్త‌రిలో వ‌డ్డించుకుని , క‌ష్ట‌ప‌డి తిన్నాం. తిన్న‌ది అర‌గాలంటే సినిమా చూడాలి. మ‌హాస‌ముద్రం వెళితే మునిగిపోతామ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక వుంది. ధైర్యం చాల‌క‌పోయినా, అంచ‌నాలు లేకుండా (రివ్యూలు చూడ‌కుండా) ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌కి వెళ్లాం. క్యాబ్ రానూపోనూ 500, టికెట్లు 500, ఇంట‌ర్వెల్‌లో ఫ్రెంచ్ ఫ్ర‌య్స్ అనే గ‌డ్డి న‌మ‌ల‌డానికి 500 మొత్తం 1500 వ‌దిలింది.

ఇల్లు చేరిన త‌ర్వాత అల‌స‌ట‌తో మా ఆవిడ ఎలాగూ వండ‌దు కాబ‌ట్టి స్విగ్గి వాడికి 500 ఇచ్చినా కంటినిండా నిద్ర‌రాలేదు. సినిమాలోని ఉప‌న్యాసాల‌తో క‌ల‌త చెంది వులిక్కి ప‌డి లేచాను.

Also Read : Most Eligible Bachelor Movie Review : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ

పెళ్లిలో రొమాన్స్ వుందా? రొమాన్స్‌లో ప్రేమ వుందా? పెళ్లి , రొమాన్స్‌, ప్రేమ అన్నీ చ‌ట్నీలో క‌లిసిపోయినా ప‌దార్థాల్లా ఒక‌టేనా? లేక ప‌ల్లీలు, కొబ్బెర‌, ఉప్పు, మిర్చీలా వేర్వేరా? ఈ క‌న్ఫ్యూజ‌న్ నాకేనా! అంద‌రికీనా? ఏం రాసారో చ‌దువుదామ‌ని రివ్యూలు Open చేసాను. అవింకా కంగాళీగా వున్నాయి. కొంద‌రైతే సినిమా చూడ‌కుండానే రాసేసారు. మ‌రికొంద‌రు స్ట‌డీ స‌ర్టిఫికెట్స్‌లా ఖాళీలు పూరించారు. పూజాహెగ్డే త‌న‌దైన శైలిలో న‌టించింది. భాస్క‌ర్ త‌న‌దైన శైలిలో డైరెక్ష‌న్ చేశాడు (ఎవ‌రైనా త‌న శైలిలోనే క‌దా ప‌ని చేస్తారు). ఎడిట‌ర్ క‌త్తెర‌కి ప‌ని చెప్పాల్సింది. గోపీసుంద‌ర్ రెండు పాట‌లు ఓకే. అఖిల్ మెరుగు ప‌డ్డాడు. (ఇప్ప‌టికి 3 సినిమాలు ఢ‌మాల్ . ఇంకా మెరుగుప‌డ‌క‌పోతే ఎట్లా?)

మొత్తానికి సినిమాలో క‌థ ఏంటో ఎవ‌రికీ అర్థ‌మైన‌ట్టు లేదు. ఎందుకంటే దాంట్లో క‌థ‌లేదు కాబ‌ట్టి.

హీరోకి న్యూయార్క్‌లో మంచి ఉద్యోగం. ఇల్లు కూడా కొనేస్తాడు. సాక్ష్యాత్తు CEO కూతురు. ఖ‌రీదైన ఫ్లాట్ ఆశ‌గా చూపి Living Relation అడిగితే నో అంటాడు. ఎందుకంటే కుటుంబానికి ఏం స‌మాధానం చెప్పాలి. ఇండియాలో టీవీ సీరియ‌ల్ అంత కుటుంబం. వాళ్లు 20 పెళ్లి చూపులు వ‌రుస‌గా ఏర్పాటు చేసి హీరోని ఇండియా ర‌ప్పిస్తారు.

హీరో వ‌స్తాడు. పెళ్లి చూపులు అనే ఎగ్జామ్‌లో వుండ‌గా జాత‌కం క‌ల‌వ‌ని ఒక అమ్మాయి ఫొటో క‌నిపిస్తుంది (హీరోయిన్‌). ఆ ఫొటోని తిరిగి ఇవ్వ‌డానికి ఆమె తండ్రి ద‌గ్గ‌రికి వెళ‌తాడు. దారిలో ఫొటో జారిపోతుంది. అస‌లు ఈ రోజుల్లో ఫొటో తిరిగి ఇవ్వ‌డం ఏంటో? ఫొటో ఇచ్చి తీరాల్సిందేన‌ని ఆ మెంటల్ తండ్రి మొండిత‌నం.

హీరోయిన్ ద‌గ్గ‌రికెళితే ఆమె ఓ స్టాండ‌ఫ్ క‌మెడియ‌న్. పెళ్లి మీద ఏవేవో అభిప్రాయాలు చెబుతూ వుంటుంది. అంద‌రూ న‌వ్వుతూ వుంటారు. ప్రేక్ష‌కుల‌కి మాత్రం న‌వ్వురాదు. హీరోని ఆమె ఏవో ప్ర‌శ్న‌లు అడుగుతుంది. అవే ప్ర‌శ్న‌లు హీరో పెళ్లి చూపుల్లో అడుగుతూ వుంటాడు. ఫ‌స్టాఫ్ అంతా ఇదే. హీరో ఎంత బుర్ర‌లేని వాడంటే వాళ్ల నాన్న నిశ్చితార్థం ఏర్పాటు చేస్తే వ‌ద్ద‌ని కూడా చెప్ప‌డు. దాని వ‌ల్ల అన‌వ‌స‌ర‌మైన కోర్ట్ సీన్‌. ఇంట‌ర్వెల్‌.

త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కి అర్థం కాని ఒక సీన్‌తో హీరో అమెరికాలో ఒక‌మ్మాయిని ఇంప్రెస్ చేస్తాడు. కొడుకు పెళ్లి చేయ‌డ‌మే జీవ‌న ల‌క్ష్యంగా పెట్టుకున్న హీరో తండ్రి వెంట‌నే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి వ‌ద్దు అని చెప్ప‌ని మ‌న హీరో ర‌హ‌స్యంగా ఇండియా వ‌చ్చి అతి ర‌హ‌స్యంగా హీరోయిన్‌ని ఇంప్రెస్ చేస్తూ వుంటాడు. హీరోయిన్ బ‌ల‌మైన వ్య‌క్తిత్వం వున్న అమ్మాయిగా (ఫ‌స్టాఫ్‌)క‌నిపిస్తూ, సెకెండాఫ్‌లో వాడెవ‌డో Misbehave చేస్తే లాగి త‌న్న‌కుండా పాత‌కాలం కృష్ణ‌కుమారిలా కుయ్యోమొర్రో అంటుంది.

నిజానికి అఖిల్‌, పూజా బాగా న‌టించారు. అక్క‌డ‌క్క‌డ మంచి కామెడీ కూడా వుంది. సినిమా మీద మ‌న‌కి ఆశ పెట్టేలోగా డైరెక్ట‌ర్ అడ్డు త‌గిలి అఖిల్‌తో ప్ర‌శ్నావ‌ళి లేదంటే ఉప‌న్యాసాలు.

ఈ 15 ఏళ్ల‌లో అమ్మాయిలు మారిపోయారు. స్త్రీపురుష సంబంధాలు మారిపోయాయి. పెళ్లికి అర్థాలు మారుతున్నాయి. మార‌నిది బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఒక‌డే. అప‌స్మార‌క స్థితిలో వున్నాడు. బొమ్మ‌రిల్లు ట్యాగ్‌లైన్ ఇక న‌డ‌వ‌దు. నీకు నువ్వే అర్థం కాలేదు అని సినిమాలో ఒక డైలాగుంది. రెండున్న‌ర గంట‌ల త‌ర్వాత కూడా హీరోహీరోయిన్ల స‌మ‌స్యేంటో మ‌న‌కి అర్థం కాదు.

Also Read : Pelli SandaD Report : పెళ్లి సందD రిపోర్ట్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp