జయం రవి 'భూమి' రిపోర్ట్

By iDream Post Jan. 15, 2021, 01:58 pm IST
జయం రవి 'భూమి' రిపోర్ట్

మనం సంక్రాంతి పండగ హడావిడిలో పడిపోయి థియేటర్లలో కొత్త సినిమాలు చూసే పనిలో బిజీ కావడంతో ఓటిటి వైపు పెద్దగా దృష్టి సారించలేదు. అయితే జయం రవి నటించిన 'భూమి' గుట్టు చప్పుడు కాకుండా 14న డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా డిజిటల్ ప్రీమియర్ చేసుకుంది. తమిళ వెర్షన్ కు పబ్లిసిటీ బాగానే చేసినప్పటికీ తెలుగులోనూ డబ్బింగ్ చేసిన విషయం ప్రేక్షకులకు పెద్దగా అవగాహనా లేకుండా పోయింది. అందుకే భూమి ఎక్కువ హై లైట్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన భూమికి లక్ష్మణ్ రచయిత కం దర్శకుడు. ఓ మోస్తరు అంచనాలు నెలకొన్ని భూమి సింపుల్ రిపోర్ట్ చూద్దాం.

ఆస్ట్రోనాట్ అయిన భూమినాథన్(జయం రవి)మార్స్ గ్రహం మీద వ్యవసాయం చేసే దిశగా ప్రయోగాలు చేస్తుంటాడు. అది అమలు చేయడానికి ముందు తల్లి(శరణ్య)తో కలిసి స్వంత గ్రామానికి వెళ్తాడు. అక్కడే శక్తి(నిధి అగర్వాల్)తో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఊహించని విధంగా ఊళ్ళో రైతుల కష్టాలు కళ్లారా చూసి చలించిపోయిన భూమినాధన్ వాళ్ళ కోసం కార్పొరేట్ దిగ్గజం రిచర్డ్ కింగ్(రోనిత్ రాయ్)తో తలపడేందుకు సిద్ధ పడతాడు. ఆ తర్వాత రైతు రక్షకుడిగా మారిన భూమి వాళ్ళ కోసం ఏం చేశాడు. తన లక్ష్యాన్ని చివరిగా ఎటువైపు తీసుకెళ్లాడు అనేదే మిగిలిన స్టోరీ. అందరూ తమిళ నటీనటులే ఇందులో ఉన్నారు.

లైన్ కొంతమేర బాగానే అనిపించినప్పటికీ దాన్ని తెరమీద కథనం రూపంలో చెప్పే విషయంలో లక్ష్మణ్ చేసిన పొరపాట్ల వల్ల ఇదో సాధారణ రొటీన్ సినిమాగా మారిపోయింది. అవసరం లేని లవ్ ట్రాక్, పాటలు, ఓవర్ డ్రామా, అతిశయోక్తితో కూడిన డైలాగులు వెరసి ఓ మంచి ఉద్దేశాన్ని డ్రమాటిక్ గా చెబుదామని చేసిన ప్రయత్నం ప్రేక్షకుల ఆసక్తిని నీరుగార్చేసింది. జయం రవి పెర్ఫార్మన్స్ పరంగా చాలా బాగా నటించినప్పటికీ దాన్నిసరైన రీతిలో వాడుకునే సెటప్ లేకపోవడంతో అంతా వృథాగా పోయింది. చివరికి జయం రవి ఒక్కడి కోసమే రెండు గంటల నిడివిని భరించగలిగే ఓపిక ఉంటే భూమిని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp