నాన్నగారితో ఉన్న సమస్య అదొక్కటే

By iDream Post Jul. 07, 2020, 06:58 pm IST
నాన్నగారితో ఉన్న సమస్య అదొక్కటే

150కి పైగా సినిమాలతో ఎనలేని ఖ్యాతి సంపాదించిన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి గురించి ప్రస్తావించకుండా టాలీవుడ్ చరిత్రను లిఖించడం అసాధ్యం . ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, ఆణిముత్యాలతో పాటు లెక్కలేనన్ని ప్రతిభావంతులను తన శిష్యులుగా అందించిన ఘనత కూడా దాసరి గారిదే. అయితే ఇంత పేరు హోదా సంపాదించినా వారసుడిగా పరిశ్రమలో నిలపాలని చూసిన అరుణ్ కుమార్ సెటిల్ కాకపోవడం ఒక్కటే ఆయనకు వెలితిగా మిగిలిపోయింది. నిజానికి అరుణ్ డెబ్యు చాలా గ్రాండ్ గా జరిగింది.

దాసరి గారి స్వీయ దర్శకత్వంలో గ్రీకువీరుడుని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాని అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత చిన్నా, పెళ్ళివారమండి, ఆదివిష్ణు, ఒరేయ్ తమ్ముడు లాంటి ఎన్నో సినిమాలు చేశారు కాని అరుణ్ కు సక్సెస్ మాత్రం కలిసి రాలేదు. అంతపురంలో పాట రూపంలో చేసిన క్యామియో, సామాన్యుడులో చేసిన కీలక పాత్ర పేరు తీసుకొచ్చాయి కాని ఆశించినంత బ్రేక్ గా నిలవలేదు. ఆ తర్వాత చాలా కాలానికి ఒక్క క్షణంతో విలన్ గా కొత్త కెరీర్ మొదలుపెట్టి శైలజారెడ్డి అల్లుడు లాంటి చిత్రాల్లో మెరిసినా ఫలితం దక్కలేదు. అయితే అరుణ్ కుమార్ కు నాన్నతో కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలు మిగిలిపోయాయి

తండ్రితో మాట్లాడేతప్పుడు అరుణ్ కు గౌరవంతో కూడిన భయం ఎప్పుడూ ఉండేది. నాన్న కన్నా ఎక్కువగా గురువుగా భావించి అదే భక్తితో ఉండేవారు. అందుకే తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం జరిగేది. హీరోగా తనను సెటిల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు క్యామియోలు ఒప్పుకోవడం చూసి కొన్నిసార్లు కోప్పడ్డారు కూడా. అయితే ఓసారి మలయాళంలో హిట్ అయిన నేరం అనే సినిమాను అరుణ్ తో రీమేక్ చేయించాలని హక్కులు కొన్నారు దాసరి.

కాని దాని మీద అరుణ్ కు అంతగా నమ్మకం లేదు. నాన్నకు ఎంత చెప్పి చూసినా లాభం లేకపోవడంతో ఆరుణే కొంచెం ఆలోచిద్దాం అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో దాసరి గారు ఆ రీమేక్ సంగతి అక్కడితో వదిలేశారు. అప్పుడే ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు అయ్యింది. ఇదే నేరంని కొంత కాలం తర్వాత సందీప్ కిషన్ హీరోగా రన్ పేరుతో రీమేక్ చేస్తే అరుణ్ జడ్జ్ మెంట్ నిజమని రుజువయ్యింది. ఏది ఎలా ఉన్న అరుణ్ ని హీరోగా సెటిల్ చేయాలన్న కాంక్ష తీరకుండానే దాసరి గారు వెళ్ళిపోయారు. ఆలోటు తీరి ఉంటే అభిమానులకు కూడా సంతోషంగా ఉండేది. కాని విధి తలపు మరోలా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp