చిత్ర విచిత్రాల శునక 'డానీ'

By iDream Post Aug. 01, 2020, 12:26 pm IST
చిత్ర విచిత్రాల శునక 'డానీ'

దర్శకుల అతి తెలివి అనుకోవాలో లేక ప్రేక్షకులను తక్కువ అంచనా వేయడమని చెప్పాలో అర్థం కావడం లేదు కానీ కొన్ని సినిమాలు చూస్తే మాత్రం ఈ సందేహం తప్పకుండా వస్తుంది. ఇవాళ విడుదలైన వరలక్ష్మి శరత్ కుమార్ 'డానీ' ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మన మెదడులో తలెత్తేలా చేస్తుంది. ప్రస్తుతానికి తమిళ వర్షన్ మాత్రమే రిలీజయింది. ముందు ఈ మహత్తర చిత్రంలో కథేంటో చూద్దాం. అనగనగా ఒక పట్టణం. ఓ పంట పొలంలో తగలబెట్టబడిన శవం కనిపించిందని పోలీసులకు సమాచారం అందుతుంది. విచారణ జరుపుతున్న లేడీ పోలీస్ ఆఫీసర్(వరలక్ష్మి) చెల్లెలు కూడా ఇదే తరహాలో కిడ్నాప్ కు గురై చనిపోతుంది. డిపార్ట్మెంట్ మొత్తం చేతులెత్తేసిన తరుణంలో డానీ అనే ట్రైన్డ్ శునకం రంగంలోకి దిగి హంతకుడిని పట్టుకునేందుకు సహాయపడుతుంది.

దీంతో ప్రజలే కాదు ఈ కళాఖండాన్ని చూస్తున్న ప్రేక్షకులు సైతం టైడ్ పౌడర్ తో ఉతికిన మొహాలతో అవాక్కయిపోవాల్సిందే. ఇంతటి అద్భుత దృశ్యకావ్యాన్ని తీర్చిదిద్దిన దర్శకుడు సంతానమూర్తిని ముందుగా అభినందించాలి. జంతు ప్రేమికుడు కాబోలు కుక్కల మీద తన ప్రేమను చూపించడానికి హీరోయిన్ తో సహా ఇతర పాత్రలు అన్నింటినీ డమ్మీలుగా చేసి తలాతోకా లేని ఇంతోటి గొప్ప క్రైమ్ థ్రిల్లర్ ని రూపొందించినందుకు. విచిత్రమేమిటంటే ఎస్ఐతో సహా పోలీసులందరూ నేరం జరిగిన ప్రతిసారి డానీ అని కలవరిస్తారు తప్ప క్రైమ్ ఎలా జరిగిందనే కోణంలో ఎవరూ ఇన్వెస్టిగేషన్ ని సీరియస్ గా తీసుకోరు. పైగా నెలనెలా దానికి శాలరీ ఉంటుందట, దాని ట్రైనర్ చనిపోతే ఆ ఉద్యోగం కుక్కలంటే పడని అతని కొడుక్కి కళ్ళు మూసుకుని ఇవ్వడం లాంటి విచిత్రాలు చాలానే ఉన్నాయి.

ఇంట్రో దగ్గరి నుంచి మహా బిల్డప్ ఇచ్చే హీరోయిన్ చివర్లో మాత్రం పట్టుమని పాతికేళ్ళు లేని సైకో కిల్లర్ చేతిలో చావు దెబ్బలు తింటుంది. అక్కడికి మళ్ళీ కుక్కే వచ్చి సహాయం చేయాలి. తర్వాత మన లేడీ ఆఫీసర్ మేల్కొని సదరు హంతకుడిని ఇంజెక్షన్లతో చంపేసి అతని స్టైల్ లోనే తగలబెట్టేసి ఎండ్ క్రెడిట్స్ ముందు గొప్ప సందేశం ఇచ్చేస్తుంది. స్వంత చెల్లెలు చనిపోతే రోజుల తరబడి ఏడుస్తూ ఉంటుందే తప్ప వెంటనే రంగంలోకి దిగుదు. ఈ మహత్తర చిత్రరాజంలో ఇలాంటి మచ్చుతునకలు చాలా ఉన్నాయి. క్రైమ్ మూవీ చూస్తూ నవ్వుకుంటూ దర్శకుడి మేధస్సుకు సెల్యూట్ కొట్టాలంటే డానీ మీద ఓ లుక్ వేయండి. పాపం వరలక్ష్మి ఎంత కష్టపడ్డా లాభం లేకపోయింది. ఎన్నికోతలు వేశారో కానీ షియాజీ షిండే పాత్రను లేపేసి మరీ కేవలం 1 గంటా 35 నిమిషాలకు కుదించారు. అయినా కూడా మూడు గంటల ఫీలింగ్ ఇస్తుందంటే ఆ క్రెడిట్ పూర్తిగా డైరెక్టర్ కే చెందుతుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp