సినిమా బండి రివ్యూ

By iDream Post May. 14, 2021, 01:50 pm IST
సినిమా బండి రివ్యూ

గత ఏడాది నుంచి లాక్ డౌన్ పుణ్యమాని ఓటిటి డైరెక్ట్ రిలీజులకు ,మంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే వచ్చిన సినిమా బండి ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఏదో విషయం ఉందనే నమ్మకాన్ని కలిగించింది. ఒక్కరు కూడా తెలిసిన ఆర్టిస్టులు లేకుండా కేవలం కంటెంట్ ను నమ్ముకుని వచ్చిన ఇలాంటి ఇండిపెండెంట్ మూవీస్ కి ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. అందులోనూ ఇది నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కావడంతో అంచనాలు మెల్లగా ఎగబాకాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డికె నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ

తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉండే ఓ చిన్న కర్ణాటక గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు వీరబాబు(వికాస్ వశిష్ఠ). ఓసారి ఎవరో ఖరీదైన సోనీ కెమెరా మర్చిపోతే దానితో ఊళ్ళో వాళ్ళతోనే సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. దీని కోసం పెళ్లిళ్లకు వీడియోలు తీసే స్నేహితుడు గణపతి(సందీప్ వారణాసి)సహాయం తీసుకుంటాడు. హీరోగా మంగలి షాపు నడిపే మరిడయ్య(రాగ్ మయూర్)ని ఎంచుకుంటారు. ఇతని లవర్ మంగ(ఉమా వైజి)హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకుంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు నాటకం. ఇంతకీ సినిమా తీశారా లేదా అనేది నేరుగా చూస్తేనే కిక్కు

నటీనటులు

అసలు ఏ ఒక్కరూ పరిచయమే లేని క్యాస్టింగ్ తో గంటా నలభై నిమిషాలు మెప్పించడం అంటే మాటలు కాదు. దీనికి కారణం ప్రతి ఒక్కరి సహజమైన నటన. ఇందులో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేరు. అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. వీరబాబుగా వికాస్ వశిష్ట చాలా సులువుగా అందులో ఒదిగిపోయాడు. ఎక్స్ ప్రెషన్లలో కూడా మెచ్యూరిటీ ఉంది. ఇతనితో సమానంగా ప్రయాణం చేసిన సందీప్, రాగ్ మయూర్ లు కూడా పోటీ పడి మరీ తమ ఉనికిని చాటుకున్నారు. కమర్షియల్ ఫార్మట్ లో లేని ఇలాంటి కథల్లో నటించడం పైకి తేలికగా కనిపిస్తుంది కానీ నిజానికి ఇదే అసలైన ఛాలెంజ్.

మంగగా నటించిన ఉమా వైజి, కెమెరా ఓనర్ సింధుగా సింధు శ్రీనివాస మూర్తి, ఆమె స్నేహితుడిగా సాయి కిషోర్, రైటర్ తాతగా ముని వెంకటప్ప, ఇతర క్యారెక్టర్లలో సిరివెన్నెల యనమండ్ల, త్రిశార, దావని, పూజారి రామ్ చరణ్, రాహుల్, అంజి, విశ్వనాధ్, అంజి, నాగరాజ్, వీర రాఘవ, వంశీధర్ గౌడ్, సిద్దార్థ్ వర్మ, దీపక్ రాజు, ఉషామూర్తి, ఉదయ్, మాలా, శివప్రసాద్ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళను గుర్తుపట్టడం కష్టం కానీ సినిమా చూశాక మాత్రం ఎవరినీ మర్చిపోలేం. అంత న్యాచురల్ గా వాటిలో ఒదిగిపోయారు. సినిమా బండికి బలంగా నిల్చిన వాటిలో దర్శకత్వం కన్నా ముందు చెప్పుకోవాల్సింది ఈ తారాగణం గురించే

డైరెక్టర్ అండ్ టీమ్

ప్రేక్షకుల అభిరుచుల్లో ఎంత మేరకు మార్పు వస్తోందనేది పక్కనపెడితే కొత్త తరం దర్శకులు మాత్రం నవ్యత వైపు పరుగులు పెడుతున్నారు. ప్రతిదీ బాక్సాఫీస్ లెక్కల్లో చూసుకుంటే కొన్నిసార్లు బాగున్నది కూడా ఫెయిల్యూర్ గానే కనిపించవచ్చు. అందుకే ఇప్పుడు థియేటర్ కు ఓటిటికి మధ్య కంటెంట్ విషయంలో స్పష్టమైన విభజన ఏర్పడుతోంది. సినిమా బండి ఆ ఉద్దేశంతోనే అరచేతిలో లేదా ఇంట్లో కూర్చుని వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకుల కోసమే రూపొందించబడింది. ఇది హాల్ లో ఆడేదా అనే ప్రశ్నలో అర్ధం లేదు. ఇవి పెద్ద తెర కోసం తీసినవి కావు. ఫీల్ గుడ్ కంటెంట్ ప్రతిసారి బిగ్ స్క్రీన్ అనుభూతిని డిమాండ్ చేయదు. ఇది ఈ కోవలోకే వస్తుంది

దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల చాలా స్పష్టంగా తాను చెప్పాలనుకున్న కథను నిజాయితీగా చూపించాడు. ఇందులో మతులు పోగొట్టే మలుపులు ఉండవు. ఫైట్ల ఊసే లేదు. పాటల సంగతి సరేసరి. పోనీ గట్టిగా నవ్వేసుకునే కామెడీ ఉందా అంటే నో అనే చెప్పాలి. కానీ పల్లెటూరి మట్టి వాసన తాలూకు సహజత్వం ఉంది. ఆ మట్టిని తడిపే వానలో నిలుచున్నప్పుడు కలిగే ఒకరకమైన చిరుపాటి ఆనందం ఉంది. సినిమా బండి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతా చుట్టుపక్కల ఎప్పుడో మన చిన్నపుడు చూసిన సంఘటనలు మరోసారి చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప సినిమాటిక్ ఫీలింగ్ కలగదు.

సహజత్వానికి పెద్ద పీఠ వేసే ఇలాంటి న్యాచురల్ డ్రామాల్లో ఉండే ఇబ్బంది దీనికీ ఉంది. లైన్ మరీ చిన్నది కావడంతో అసలు ట్విస్టులేవి లేకుండా సింపుల్ గా కథనాన్ని నడిపించడంతో రెగ్యులర్ మూవీ గోయర్ కు ఇందులో ఎక్కువ ప్రత్యేకత కనిపించదు. కెమెరా దొరికాక చాలా సేపు షూటింగుకు సంబంధించిన సీన్స్ తో నడిపిస్తారు కానీ వాటిని ఇంకా బలంగా మార్చే ఫన్ ని సరైన రీతిలో జోడించలేదు. కాకపోతే ఎమోషన్స్ హెవీగా లేకుండా అక్కడక్కడా టచ్ చేసిన తీరు బాగుంది. ఎక్కడా ఇక ఆపేద్దాం అనిపించేలా ప్రవీణ్ చేయకపోవడం సినిమా బండికున్న పెద్ద ప్లస్ పాయింట్.

అయితే ఇందులో అసలు మైనస్సులే లేవని కాదు. ఉన్నాయి. కెమెరా దొరికిన వీరబాబు అంత మంచోడు అయినప్పుడు పోలీసులకు ఎందుకు అప్పగించలేదనే అనుమానం వస్తుంది. దాంతో పాటు వీళ్ళు సినిమా తీసే ప్రహసనం, వాటి తాలూకు ఎపిసోడ్ల మీద మీద ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసి ఉంటే ఆసక్తి పెరిగేది. కానీ ఆ సీన్లన్నీ ఫ్లాట్ గా వెళ్లిపోవడం కొందరికి నచ్చకపోవచ్చు. అయినప్పటికీ చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన ప్రయత్నం కనక కొన్ని విషయాల్లో రాజీ కనిపిస్తుంది. అయినప్పటికీ న్యూ జెనరేషన్ మూవీస్ గా వస్తున్న ఇలాంటి సినిమాలు అర్బన్ లైఫ్ చుట్టూ తిరక్కుండా పల్లెల వైపు మళ్లడం మెచ్చుకోవాల్సిన విషయం

శిరీష్ సత్యవోలు సంగీతం సబ్జెక్టుకు తగ్గట్టు సాగింది. ఉన్న రెండు పాటల బిట్లు మరీ గుర్తుంచుకునేలా లేవు కానీ ఆ ఫ్లోకు సరిపడేలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ధర్మేంద్ర-రవితేజల ఎడిటింగ్ నీట్ గానే ఉంది కానీ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. అపూర్వ-సాగర్ ల ఛాయాగ్రహణం మాత్రం మంచి స్టాండర్డ్ లో ఉంది. దర్శకుడి ఆలోచనను అంతకన్నా సహజత్వంతో తమ కెమెరా కన్నుతో చూపించిన తీరుకి మంచి మార్కులు పడతాయి. వసంత్ సంభాషణలు బాగున్నాయి. బోర్డర్ లో మాట్లాడే స్లాంగ్ ని చాలా సహజంగా ఒడిసిపట్టి పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. నిర్మాణ విలువల గురించి చెప్పేందుకు ఏమి లేదు. సింపుల్ అంతే

ప్లస్ గా అనిపించేవి

సహజత్వం
ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్
స్క్రీన్ ప్లే
కెమెరా వర్క్

మైనస్ గా తోచేవి

కొంత ల్యాగ్
డ్రామా మోతాదు తగ్గడం
సింగల్ పాయింట్ స్టోరీ
రెండు మూడు చిన్న లాజిక్స్

కంక్లూజన్

థియేటర్-ఓటిటి రెండు ఒకే గాటన ఎలాగైతే కట్టలేమో కమర్షియల్ సినిమాను న్యాచురల్ మూవీతో పోల్చలేం. సినిమా బండి కేవలం డిజిటల్ ప్రేక్షకులను ఉద్దేశించి ఒక మంచి కాన్సెప్ట్ తో వాళ్ళను మెప్పించే ప్రయత్నం. ఆ కోణంలో చూస్తే దర్శక నిర్మాతల లక్ష్యం నెరవేరినట్టే. కానీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఎక్కువగా ఆశించి చూస్తే మాత్రం కొంత సంతృప్తి కొంత నిరాశ తప్పదు. తమిళ మలయాళంలో వచ్చే థీమ్ బేస్డ్ మూవీస్ చూసి భుజాలు ఎగరేసి భజనలు పాడే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను చూడాలి. వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. అప్పుడే కొత్త తరం దర్శకత్వం మరింత ప్రోత్సాహం లభిస్తుంది.

ఒక్క మాటలో - సహజత్వపు బండి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp