రౌడీ హీరోకు క్రేజీ బాలీవుడ్ ఆఫర్

By iDream Post Sep. 24, 2020, 03:44 pm IST
రౌడీ హీరోకు క్రేజీ బాలీవుడ్ ఆఫర్

తెలుగు స్టార్ హీరోలు హిందీలో స్ట్రెయిట్ సినిమాలు చేయడం కొత్తేమి కాదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు ట్రై చేశారు. కాకపోతే వాళ్లు చేసినవన్నీ రీమేకులే. ప్రభాస్ కూడా ఆది పురుష్ తో ఎంట్రీ ఇస్తున్నాడు కానీ సాహోని డైరెక్ట్ గా పరిగణించలేం. టాలీవుడ్ మార్కెట్ పెరిగి బిజినెస్ పరంగా బాలీవుడ్ తో పోటీపడే స్థాయిలో చేరుకోవడంతో మనవాళ్ళు మెల్లగా అక్కడ జెండా పాతేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు వచ్చింది. సుప్రసిద్ధ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ప్రొడక్షన్ లో అభిషేక్ కపూర్ దర్శకుడిగా తెరకెక్కబోయే ప్రాజెక్ట్ లో రౌడీ బాయ్ ని హీరోగా తీసుకోవడం దాదాపుగా ఓకే అయినట్టు ముంబై టాక్.

కరోనా టైం కాబట్టి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ముందస్తు ఒప్పందాలు జరిగిపోయినట్టుగా తెలుస్తోంది. సబ్జెక్టు కూడా బయోపిక్ నే ఎంచుకోవడం విశేషం. 2019లో పుల్వామా దాడుల్లో దొరికి అక్కడి చెరను ధీటుగా ఎదురుకుని నిలబడిన కమాండర్ అభినందన్ కథనే చూపించబోతున్నట్టు సమాచారం. మెలితిరిగిన బుర్రమీసాలతో వీరత్వానికి ప్రతీకగా నిలిచే అతని పాత్ర అంటే విజయ్ దేవరకొండకు ఒకరకంగా ఛాలెంజ్ లాంటిదే. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేదాకా ఖచ్చితంగా చెప్పలేం కానీ మొత్తానికి విజయ్ దేవరకొండ ముంబై మీద గట్టి కన్నే వేశాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న ఫైటర్/లైగర్(టైటిల్ డిసైడ్ కాలేదు)కూడా పాన్ ఇండియా మూవీనే. హిందీ వెర్షన్ కు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే తెలుగులో రాసుకుని బై లింగ్వల్ గా హిందీలో తెరకెక్కిస్తున్నారు కాబట్టి అభినందన్ సినిమానే ఎంట్రీ పరంగా స్పెషల్ గా నిలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వినికిడి. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయానికి వస్తే నవంబర్ నుంచి షూటింగ్ కంటిన్యూ చేసేలా విజయ్ పూరిలు రెడీ అవుతున్నారు. విడుదల ఈ ఏడాదికి ఎలాగూ లేదు కాబట్టి వచ్చే వేసవిని టార్గెట్ పెట్టుకుంటున్నారు. ముంబైలో కీలకమైన షెడ్యూల్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి తర్వాత ఎమోషనల్ డ్రామాలకు దూరంగా ఉన్న పూరి ఇందులో దాన్ని కూడా మిస్ కాకుండా చూస్తున్నారట. మొత్తానికి ఇక్కడ మంచి మార్కెట్ పట్టేశాక ఏకంగా బాలీవుడ్ మీద స్కెచ్ వేసి తన ప్లానింగ్ ఎలా ఉంటుందో విజయ్ దేవరకొండ చూపిస్తున్నాడుగా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp