Bollywood : ఈ విషయంలో బాలీవుడ్డే ముందుంది

By iDream Post Jan. 13, 2022, 10:41 am IST
Bollywood : ఈ విషయంలో బాలీవుడ్డే ముందుంది

తమిళం మళయాలంలో సినిమా హిట్టవ్వడం ఆలస్యం మన నిర్మాతలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రీమేక్ హక్కులు కొనడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ రెండు, చిరంజీవి రెండు వేరే బాషల కథలు తీసుకోవడం చూస్తేనే ఈ ట్రెండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని బ్లాక్ బస్టర్స్ ని మనవాళ్ళు వదిలేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందులో మొదటిది విక్రమ్ వేద. మాధవన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా తమిళనాడులో ఏకంగా బాహుబలి రికార్డులను టచ్ చేసింది. ఇద్దరికీ గొప్ప కెరీర్ బ్రేక్ గా నిలిచి కమర్షియల్ కల్ట్ స్టేటస్ ని తెచ్చుకుంది.

కట్ చేస్తే మనకంటే ముందు హిందీలో వాళ్ళు తీసేస్తున్నారు. హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ కాంబో ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. ఇంతా చేసి ఆ తమిళ విక్రమ్ వేద నిన్నా మొన్నా వచ్చిన మూవీ కాదు. 2017లో రిలీజ్ అయ్యింది. వెంకటేష్ రానా రవితేజ ఇలా ఏవేవో కాంబినేషన్లో తీయాలనే ప్రణాళికలు జరిగాయి కానీ ఫైనల్ గా ఏదీ కార్యరూపం దాల్చలేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇక మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా అంతే. ఒక వెహికల్ ఇన్స్ పెక్టర్ కి సినిమా హీరోకి మధ్య ఈగో క్లాష్ పాయింట్ తో రూపొందిన ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ కొన్నాడు కానీ ఇది కూడా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.

సబ్ టైటిల్స్ సహాయంతో అన్ని బాషల సినిమాలు చూసే తెలుగు మూవీ లవర్స్ ఈ రెండు ఎప్పుడో చూసేశారు కానీ ఆ సౌలభ్యం లేని కోట్లాది ఆడియన్స్ కి ఇంకా ఇవి రీచ్ కాలేదు. ఆ ఆలోచనతో అయినా ఎవరైనా తీస్తే బాగుండేది కానీ దగ్గరలో ఆ సూచనలేమి కనిపించడం లేదు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ నే హిందీలో సెల్ఫీ టైటిల్ తో అక్షయ్ కుమార్ ఇమ్రాన్ హష్మీ జంటతో షూటింగ్ మొదలుపెట్టారు. నిన్నో చిన్న టీజర్ కూడా వచ్చింది. ఈ లెక్కన సరైన కథలను పట్టేసుకుని రీమేక్ చేయడంలో మనకంటే బాలీవుడ్ ఒక అడుగు ముందుగా ఉన్నట్టు కనిపిస్తోంది. సో తమిళం మలయాళం వద్దనుకుంటే ఈ హిందీ వెర్షన్లు వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే

Also Read : Akhanda : బ్లాక్ బస్టర్ సీక్వెల్ గురించి బోయపాటి క్లారిటీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp