బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఫిక్స్

By iDream Post Apr. 23, 2020, 06:43 pm IST
బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఫిక్స్

ఎవరైనా స్టార్ కు ఒక దర్శకుడితో సింక్ కుదిరితే ఆ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్లు రావడం, ఆ తర్వాత ఆ క్రేజ్ మీద భారీ బిజినెస్ జరగడం ఇదంతా మాములుగా జరిగేదే. కానీ కొందరికి మాత్రం ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అదే నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బి గోపాల్ కలయిక. ఇప్పటిదాకా వీళ్ళ కాంబినేషన్ లో 5 సినిమాలు వచ్చాయి. 1990లో వచ్చిన లారీ డ్రైవర్ అందులో మొదటిది. మాస్ పాత్రలో బాలయ్యను చూపించిన తీరుకు సూపర్ హిట్ సక్సెస్ దక్కింది. 1992లో చేసిన రౌడీ ఇన్స్ పెక్టర్ అప్పటి దాకా ఉన్న రికార్డుల దుమ్ము దులిపేసింది.

ఇక 1999లో వచ్చిన సమరసింహారెడ్డి గురించి చెప్పేదేముంది. ఏకంగా చరిత్రను సృష్టించి తెలుగు సినిమా చరిత్రలో కొత్త పేజీ లిఖించింది. 2001లో వచ్చిన నరసింహనాయుడుతో ఈ కాంబో తమ రికార్డులు తామే చెరిపేశారు. అయితే ఇలాంటి అద్భుతమైన కలయికకు 2003లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు బ్రేక్ వేసింది. దాని దారుణమైన పరాజయం తర్వాత ఇంకోసారి వీళ్ళు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. దానికి తోడు బి గోపాల్ చాలా కాలం నుంచి ఫాం లో లేరు. ఇప్పుడు విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలయ్య గోపాల్ లు మరోసారి సినిమా చేయబోతున్నారు. బోయపాటి శీనుతో చేస్తున్న సినిమా అవ్వగానే ఇది మొదలవుతుందట.

కరోనా సద్దుమణిగితే ఓపెనింగ్ లేదా ప్రకటన ఏదో ఒకటి జూన్ 10న చేయాలనీ మాత్రం ఫిక్స్ అయ్యారట. అప్పుడంటే ఈ ఇద్దరూ మేజిక్ చేశారు కాని ఇప్పుడు అదే స్థాయిలో రిపీట్ చేయగలరా అనే సందేహం అభిమానుల్లో వస్తోంది. ఎన్టీఆర్ తర్వాత మార్కెట్ బాగా డ్యామేజ్ అయిన బాలయ్య అది బోయపాటి సినిమాతో తిరిగి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. బి గోపాల్ కాబట్టి సబ్జెక్టు ఎలాగూ మంచి మసాలా ఫార్ములాతో ఉంటుంది. సరిగ్గా కుదరాలే కాని మాస్ అండతో రికార్డులు సృష్టించే సత్తా బాలకృష్ణకు ఉంది. ఇక దీనికి నిర్మాతలు ఎవరన్న విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp