కొంచెం తమాషా కొంచెం శిక్ష

By iDream Post Sep. 19, 2020, 12:29 pm IST
కొంచెం తమాషా కొంచెం శిక్ష

మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీతో జబర్దస్త్ అవినాష్ ను హౌస్ లోకి తీసుకొచ్చాక బిగ్ బాస్ 4లో కొంత జోష్ మెరుగుపడింది. రేటింగ్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత గట్టిగా ఉండటంతో దానికి తగ్గట్టే నిన్నంతా వెరైటీ తమాషాలు, శిక్షలతో మేనేజ్ చేశారు. ఆటాపాటలు, గొడవలు అంతా ఓ మాదిరిగా సాగిపోతోంది. గందరగోళం, సినిమా షూటింగ్ పేరుతో చేయించిన రెండు స్కిట్లు పర్వాలేదు అనిపించాయి. సభ్యులను రెండు గ్రూపులుగా విభజించి నోయెల్, లాస్యలను జడ్జీలుగా పెట్టారు. అయితే వాళ్ళిచ్చిన తీర్పు పట్ల అమ్మ రాజశేఖర్ తీవ్ర నిరసన వ్యక్తం చేయగా దీని మీద చిన్నసైజు రచ్చే జరిగింది. ఫైనల్ గా ఇద్దరు విన్నర్లేనని బిగ్ బాస్ కానుకలు పంపడంతో కథ అక్కడితో ముగిసింది.

హౌస్ లో ఉన్నన్ని రోజులు తెలుగులోనే మాట్లాడాలన్న రూల్ ని అధిక శాతం పాటించడం లేదు. మోనాల్ కు సహజంగానే మన బాష రాదు. అయినా బాగానే ప్రయత్నిస్తోంది. కానీ అభిజీత్, హారిక లాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఇంగ్లీష్ ని మిక్స్ చేయడం బిగ్ బాస్ ఆగ్రహానికి కారణమయ్యింది. అందుకే వాళ్లకు కొన్ని సిల్లీ పనిషమెంట్లు కూడా ఇచ్చేశారు. అవి కూడా సరదాగానే ఉండటంతో పార్టిసిపెంట్స్ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఇక కొత్త కెప్టెన్ గా నోయల్ ఎంపికయ్యాడు. నామినేషన్లలో నలుగురు ఉన్నప్పటికీ కళ్యాణి, అభిజిత్, మెహబూబ్ తాము ఆ పదవికి ఎందుకు అర్హులో కన్విన్సింగ్ గా చెప్పుకోవడంలో ఫెయిలయ్యారు. దాంతో బాలన్స్ గా మాట్లాడిన నోయెల్ కే అందరూ ఓటు వేశారు. దీంతో లాస్య నుంచి కెప్టెన్ షిప్ అతనికి వచ్చింది.

ఇక అలకలు, అపార్థాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. టీవీ9 దేవి ఈ విషయంలో తానెందుకు వెనుకబడినట్టు భావిస్తూ\ తన ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెషన్ల రూపంలో బయట పెడుతోంది. మోనాల్ ను అవినాష్ కామెడీ కోసం టార్గెట్ చేయడం కూడా స్పష్టమయింది. రోజు ఏదో ఒక మసాలా ఉండేలా నిర్వాహకులు స్క్రిప్ట్ విషయంలో గట్టి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇవాళ నాగార్జున రాబోతున్నాడు కాబట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి సహజంగానే పెరుగుతోంది. అందులోనే రేపు ఎలిమినేషన్ కనక ఎవరు బయటికి వస్తారో అన్న సస్పెన్స్ మొదలైంది. ఆరోగ్యరిత్యా గంగవ్వ పేరు వినిపిస్తోంది కానీ సోషల్ మీడియాలో తనకు దక్కుతున్న మద్దతు చూస్తే బిగ్ బాస్ ఈ వారమే తనను బయటికి పంపిస్తాడా అనేది అనుమానంగానే ఉంది. నేనిక ఉండలేనని గంగవ్వ ఓపెన్ గానే చెబుతోంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో రేపు తెలిసిపోతుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp