లీగల్ వివాదంలో బిగ్ బి సినిమా

By iDream Post Aug. 06, 2020, 11:36 am IST
లీగల్  వివాదంలో బిగ్ బి సినిమా

లాక్ డౌన్ మొదలై థియేటర్లు మూతబడి సినిమాల విడుదలలు ఆగిపోయాక వీటికి సంబంధించిన ఎలాంటి వివాదాలు బయటికి రాలేదు. ఓటిటిలో డైరెక్ట్ రిలీజవుతున్నవి కూడా కాంట్రావర్సి లేనివి కావడంతో ఎలాంటి ఇష్యూ లేకుండా గడిచిపోయింది. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొత్త సినిమా ఝూండ్ చట్టపరమైన చిక్కుల్లో పడింది. నాలుగేళ్ల క్రితం మరాఠిలో విడుదలై కోట్ల రూపాయల వసూళ్లతో సంచలనం రేపిన సైరాత్ దర్శకుడు నాగరాజ్ మంజులే దర్శకత్వంలో రూపొందిన ఝూండ్ కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడినట్టు అందుకే థియేట్రికల్ లేదా ఓటిటి ఏదైనా విడుదల ఆపాల్సిందిగా కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఝూండ్ చిత్రం విజయ్ బార్సే అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందింది.

ఈయన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్. స్లం సాకర్ అనే సంస్థను స్థాపించి మురికివాడల్లో ఉన్న టాలెంట్ తీసుకొచ్చి వాళ్లలో సాకర్ ఆడే ఆణిముత్యాలను బయటికి తీసే లక్ష్యంతో పనిచేసేవారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారిని చేరదీసి వాళ్ళను మాములు మనుషులుగా తీర్చిదిద్ది క్రీడల వైపు మళ్లించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈయన ప్రస్థానంలో కీలకమైన విద్యార్ధి అఖిలేష్ ప్రకాష్. విజయ్ శిక్షణలో గ్యాంగ్ స్టర్ అయిన అఖిలేష్ సాకర్ నేర్చుకుని 2009లో హోమ్ లెస్ వరల్డ్ కప్ టీమ్ కు కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఝూండ్ లో చాలా కీలకమని ఇప్పటికే టాక్ ఉంది. హైదరాబాద్ కు చెందిన ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ నంది చిన్ని కుమార్ మేలోనే దీని మీద కేసు ఫైల్ చేశారు. బయోపిక్ రూపొందించేందుకు అఖిలేష్ తో తాను ఒప్పందం చేసుకున్నానని, సదరు స్క్రిప్ట్ ని 2018లో జూన్ 11న తెలంగాణ ఫిలిం రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేసుకున్నానని చెబుతున్నారు.

ఆ సమయంలోనే నిర్మాణం చేయాలనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదని ఈలోగా ఝూండ్ దర్శక నిర్మాతలు తన కథలో కీలక భాగాన్ని కాపీ చేసి తీశారని ఆరోపిస్తున్నాడు. పిటీషన్ వేయడానికి ముందే చిన్ని కుమార్ ఆ టీమ్ కు నోటీసులు పంపినప్పటికీ వాళ్ళ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో లీగల్ చర్యలకు ముందుకెళ్లారు. దీనికి సంబంధించి తాను 2020 మే నుంచి పోరాటం చేస్తున్నానని చిన్ని కుమార్ చెబుతున్నారు. త్వరలోనే మరోసారి హియరింగ్ రాబోతోంది. ఈ వివాదం పట్ల ఝూండ్ నిర్మాతలు స్పందించడం లేదు. అఖిలేష్ ఎపిసోడ్ లేకుండా విజయ్ బార్సే కథను చూపడం అసాధ్యమంటున్న ఇతని వెర్షన్ లో లాజిక్ అయితే ఉంది. మరి బిగ్ బి సినిమాపై పోరాడుతున్న ఈ చిన్న ఫిలిం మేకర్ కు ఎలాంటి తీర్పు దక్కనుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp