ఆ సన్నివేశాలు తీసినందుకు బాగా చెడ్డపేరు వచ్చింది - బి. గోపాల్

By Kiran.G Feb. 15, 2020, 11:08 am IST
ఆ సన్నివేశాలు తీసినందుకు బాగా చెడ్డపేరు వచ్చింది - బి. గోపాల్

బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నాడంటే అభిమానులకు కన్నుల పండగే.. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో రూపొందిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

అందుకే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతుంది అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. కానీ ఒకే ఒక్క సినిమా ఆ అంచనాలన్నింటిని కూలదోసి ఆ కాంబినేషన్ ను నవ్వులపాలు చేసింది..ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఆ సినిమా ఆ అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికలపడింది.. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లో మొదటి పరాజయంగా నిలిచిపోయిన ఆ సినిమా పేరు పలనాటి బ్రహ్మనాయుడు.

తొడకొడితే కుర్చీ రావడం, ట్రైన్ వెనక్కి వెళ్లడం లాంటి సన్నివేశాలను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పికొట్టడంతో పలనాటి బ్రహ్మనాయుడు అనూహ్య పరాజయం పాలయ్యింది.. ఎంతో అనుభవం ఉన్న బి. గోపాల్ ఇలాంటి సన్నివేశాలు ఎలా తీయగలిగాడని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తాజాగా ఆ సన్నివేశాలను రూపొందించడం తన తప్పేనని బి. గోపాల్ అలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ప్రోగ్రాంలో తెలపడం సినీవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది..

బాలకృష్ణ పసిపిల్లోడని, బంగారమని వ్యాఖ్యానించిన బి. గోపాల్ ఆ సన్నివేశాలు రూపొందించినందుకు తనకు బాగా చెడ్డపేరు వచ్చిందని తెలిపారు. ఆ సన్నివేశాలను రాసిన రచయితల తప్పు ఎంతమాత్రమూ లేదని ఆ తప్పు మొత్తం నాదేనని తెలిపారు.ఇంటర్వ్యూ మొత్తం సరదాగా సాగిందని ప్రోమోలో తెలుస్తుంది. 17 తేదీన ప్రసారం కాబోయే పూర్తి ఇంటర్వ్యూలో బి. గోపాల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp