'బంగారు' తాకట్టు పెట్టే 'బుల్లోడు'

By iDream Post Jun. 30, 2020, 04:24 pm IST
'బంగారు' తాకట్టు పెట్టే 'బుల్లోడు'

ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు కావడంతో కొత్త సినిమాల టీజర్లతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఉదయం నాంది లాంటి కాన్సెప్ట్ బేస్డ్ వీడియోతో అలరించిన నరేష్ ఇందాకా బంగారు బుల్లోడుతో వచ్చాడు. గిరి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా ఝవేరి హీరొయిన్ గా నటిస్తోంది. ఇందులోనూ కథ ఏంటో రివీల్ చేసేశారు. బ్యాంకులో పని చేసే హీరో కస్టమర్లు తాకట్టు పెట్టుకున్న బంగారు నగలను వేరే వాళ్ళకు బయటికి ఇస్తూ ఉంటాడు. ఇదంతా స్టాఫ్ సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా నడిచిపోతూ ఉంటుంది. తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా ఏదో కారణం వల్ల మేనేజ్ చేస్తాడు.

ఇలా గడిచిపోతున్న జీవితంలో ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ వస్తాడు. అక్కడినుంచి స్టొరీ కొత్త మలుపులు తిరుగుతుంది. దొంగను పట్టుకునే శపథం మీద అతను ఊళ్లోనే తిష్ట వేస్తాడు. అసలు ఇంతకీ మన హీరో బ్యాంకులో దొంగతనం ఎలా జరిగింది ఎవరు చేశారు, మరోపక్క తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి దాకా తీసుకెళ్ళాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. చాలా కాలం తర్వాత అల్లరోడి మార్కు వినోదం ఇందులో కనిపించింది. ఆ మధ్య ఒకరకమైన మూసలో పడిపోయి రెగ్యులర్ ఫార్ములా చట్రంలో కామెడీని కూడా బోర్ కొట్టించేలా తీసిన దర్శకుల నుంచి బ్రేక్ తీసుకున్న నరేష్ మొత్తానికి తనకు తగ్గ కథనే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంది.

తనికెళ్ళ భరణి, పోసాని, పృథ్వి, ప్రవీణ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శీను, రంగస్థలం మహేష్, అనంత్, భద్రం తదితరులతో పాటు ఖాకీ విలన్ గా అజయ్ ఘోష్ ఆకర్షణగా నిలుస్తున్నాడు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. బంగారు బుల్లోడు టైటిల్ అంటే నందమూరి అభిమానులకు మహా ఇష్టం. ఇరవై ఏడేళ్ళ క్రితం బాలకృష్ణ ఇదే పేరుతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అందులోని పాటలు కూడా మ్యూజికల్ హిట్సే. మళ్ళీ ఈ టైటిల్ ని ఎవరూ రిపీట్ చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అల్లరి నరేష్ వాడుకుంటున్నాడు. పేరుకు బంగారు బుల్లోడే అయినా అల్లరి మాత్రం ఓ రేంజ్ లో చేసేలా ఉన్నాడు. అదే కనక జరిగితే తనకు వర్కవుట్ అయిన జానర్ లో నరేష్ కు మరోసారి హిట్ పడుతుంది.

Link Here @ https://bit.ly/2VyUiZH

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp