100 ఎకరాలు పోగొట్టిన డ్రైవర్

By iDream Post May. 31, 2020, 08:32 pm IST
100 ఎకరాలు పోగొట్టిన డ్రైవర్

నటుడిగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరున్న పృథ్విరాజ్ 1971లోనే బాలనటుడిగా తమిళ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతనికి తెలుగులో గుర్తింపు వచ్చింది మాత్రం 1997లో వచ్చిన పెళ్లితో. వడ్డే నవీన్, మహేశ్వరి జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్. పాటలు కూడా బాగా హిట్టయ్యాయి. ఇందులో హీరోయిన్ భర్తగా శాడిస్ట్ గా పృథ్విరాజ్ చేసిన విలనిజం ఇక్కడ మంచి కెరీర్ ని ఇచ్చింది. ఆ వెంటనే జగపతిబాబు ఫ్రెండ్ గా చేసిన పెళ్లి పందిరి కూడా సక్సెస్ కావడంతో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరసగా అవకాశాలు చుట్టుముట్టాయి.

కంటే కూతుర్నే కాను, ప్రేయసి రావే, సమ్మక్క సారక్క, పంచదార చిలక లాంటి ఎన్నో సినిమాలు చాలా పేరు తీసుకొచ్చాయి. ఒకదశలో ఆర్టిస్ట్ గా భారీ డిమాండ్ ఏర్పడింది పృథ్విరాజ్ కు. అప్పటికే పదేళ్లకు పైగా తమిళ పరిశ్రమలో ఉన్నా తెలుగులో మాత్రం కొంత ఆలస్యంగా బ్రేక్ దక్కింది. అదే సమయంలో ఆదాయమూ పెరిగింది. ఓ రోజు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు అన్ని పది లక్షల దాకా పోగేసి హైదరాబాద్ లో ఏదైనా ఆస్తి కొనాలనుకున్నారు పృథ్విరాజ్ . అప్పుడే అమీర్ పేట్ లోని శ్రీదివ్య అపార్ట్ మెంట్ లో టాప్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ తరహాలో ఉన్న ఒక ఫ్లాట్ చూశారు పృథ్విరాజ్. ధర 10 లక్షలు చెప్పారు. అదే సమయంలో వేరొక ఏజెంట్ ద్వారా శంషాబాద్ లో రెండు భాగాలుగా 100 ఎకరాల స్థలం చూసి వచ్చారు. దాని ధర కూడా అచ్చంగా పది లక్షలే.

ఇంత తక్కువ మొత్తానికి వంద ఎకరాలా అంటూ షాక్ అయ్యి కొనే ఆలోచనలో ఉన్నారు పృథ్విరాజ్. తనతో పాటు ఉన్న డ్రైవర్ ఇది కొని ప్రయోజనం లేదని, సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాగా కొని మళ్ళీ దానికి కాంపౌండ్ కోసం ఇంకో పది లక్షలు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుంది వద్దని చెప్పాడు. దాంతో పృథ్విరాజ్ నిజమే అనుకుని శ్రీదివ్య ఫ్లాట్ కొన్నారు. కట్ చేస్తే ఎయిర్ పోర్ట్ ప్రకటన వచ్చాక శంషాబాద్ భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఒకవేళ అప్పుడు పృథ్విరాజ్ కనక ఆ వంద ఎకరాలు కొని ఉంటే వందల కోట్లు వచ్చి పడేవి. కాని మోజు పడి కొన్న శ్రీదివ్య అపార్ట్ మెంట్ ఫ్లాట్ ని అసలు ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విధి విచిత్రమంటే. ప్రతి బియ్యపు గింజ మీద తినే వాడి పేరు ఉంటుందని మనకు ప్రాప్తం లేనప్పుడు ఇలాంటివి పోగొట్టుకోవడం సహజమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp