స్కూళ్ల దెబ్బకు సినిమాల టెన్షన్

By iDream Post Mar. 24, 2021, 11:07 am IST
స్కూళ్ల దెబ్బకు సినిమాల టెన్షన్

నిన్న తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ళు కాలేజీలు మూసేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత సినిమా పరిశ్రమలో టెన్షన్ మొదలయ్యింది. ఎందుకంటే సర్కారు పరిశీలనలో ఇప్పుడు థియేటర్లు కూడా ఉన్నాయి. అయితే మెల్లగా తీవ్ర సంక్షోభం నుంచి బయట పడుతున్న ఇండస్ట్రీ ఇప్పుడేదైనా జరిగితే దగ్గరలో కోలుకోవడం అసాధ్యమన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. దానికి బదులు 50 శాతం ఆక్యుపెన్సీని మళ్ళీ తెరమీదకు తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అమలుచేసినా మల్టీ ప్లెక్సులు, పేరున్న సింగల్ స్క్రీన్లు తప్ప బిసి సెంటర్స్ లో దీన్ని పాటించిన దాఖలాలు చాలా తక్కువ. గ్రౌండ్ లెవెల్ దీన్ని కట్టడి చేయడం అంత సులభం కాదు.

ఎంత వద్దనుకున్నా సెకండ్ వేవ్ మెల్లగా చాప కింద నీరులా పాకుతోంది. అసలే ఏప్రిల్ నుంచి చాలా క్రేజీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని అందరి కళ్ళు టార్గెట్ చేశాయి. ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు ఖాయమని ట్రేడ్ నమ్ముతోంది. అసలు ఎక్స్ ట్రా షోల కైనా అనుమతులు దొరుకుతాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇది కాకుండా నాగార్జున వైల్డ్ డాగ్, గోపిచంద్ సీటిమార్, కార్తీ సుల్తాన్ లు రెండో తేదీనే రాబోతున్నాయి. ఇవయ్యాక 16న లవ్ స్టోరీ కూడా అంచనాలకు మించిన బిజినెస్ జరుపుకుని గ్రాండ్ రిలీజ్ కు వేచి చూస్తోంది.

ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ సీటింగ్ అంటే మాత్రం ఇందులో ఎన్ని వెనక్కు తగ్గుతాయో చెప్పలేం. జనవరిలో వచ్చిన రవితేజ క్రాక్ తక్కువ సీట్లతోనూ రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా మాస్టర్, రెడ్ లు కూడా లాభాలు ఇచ్చాయి. అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ వాయిదాలు వేసుకోకుండా ప్రొసీడ్ అవ్వడమే మంచిది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి సదరు శాఖలను ఏదో ఒక చర్య తీసుకోమని గట్టిగా చెబుతున్నాయట. మరి మన నిర్మాతలు దానికి తగ్గ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి మరి. వారంలోపే క్లారిటీ వచ్చేస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp