షాకింగ్ రోల్ లో రంగమ్మత్త ?

By Ravindra Siraj Feb. 25, 2020, 10:38 pm IST
షాకింగ్ రోల్ లో రంగమ్మత్త ?
యాంకర్ గా సెలబ్రిటీ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అనసూయ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తెచ్చిన పేరు ఏకంగా తనను సోలో హీరోయిన్ మూవీస్ చేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ క్రమంలో కథనం లాంటివి వచ్చాయి కానీ అవేవి ప్రేక్షకుల మెప్పు పొందలేదు. మరో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అనసూయకు అలాంటి ఓ ఆఫర్ లైన్ లో ఉన్నట్టు సమాచారం. గత ఏడాది బాలీవుడ్ టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన అందాదున్ తెలుగు రీమేక్ నితిన్ హీరోగా నిన్న షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ కళ్లులేని వాడిగా కనిపించబోతున్నాడు. హిందీలో హీరో తర్వాత అంత ప్రాధాన్యమున్న పాత్ర టబు చేసింది. సినిమా మొదలుకుని చివరి దాకా తన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తను లేకపోతే ఈ కథే లేదన్న టైపులో. అయితే అది నెగటివ్ షేడ్స్ తో కూడుకున్నది. ఇప్పుడీ రోల్ కోసం అనసూయను అడుగుతున్నారట.

కథ ప్రకారం భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం నెరుపుతూ తనతో పాటు హీరోని క్రైమ్ లో ఇరికించే చాలా ముఖ్యమైన పాత్ర ఇది. మరి అనసూయ దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ చేస్తే మాత్రం నిజంగానే మంచి ఛాన్స్ అవుతుంది. టబుకు హిందీలో దీని వల్లే పేరు ప్రశంసలతో పాటు బోలెడు అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో అదే ఎఫెక్ట్ తో ఒరిజినాలిటీ తగ్గకుండా తీస్తే ఇక్కడా అదే స్పందన రాబట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన క్లారిటీ మరికొద్ది రోజుల్లో రావొచ్చు. భీష్మ సక్సెస్ తో జోష్ లో ఉన్న నితిన్
వరసగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. వెంకీ అట్లూరితో రంగ్ దే ఇప్పటికే కీలక పార్ట్ షూటింగ్ జరుపుకుంది. ఈ అందాదున్ రీమేక్ కు టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. కళ్ళు లేని పాత్రలో నితిన్ ఎలా ఉంటాడా అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. 
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp