యాంగ్రీ మ్యాన్ రిస్కీ రీమేక్

By iDream Post Aug. 15, 2020, 03:42 pm IST
యాంగ్రీ మ్యాన్ రిస్కీ రీమేక్

చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య గరుడవేగాతో డీసెంట్ హిట్ అందుకున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కు ఎంతో ముచ్చటపడి చేసిన కల్కి తీవ్ర నిరాశనే మిగిల్చింది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మీద ఉన్న ప్రేక్షకులకున్న అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది. దాని తర్వాత ఇప్పటిదాకా ఏ కొత్త చిత్రం మొదలుపెట్టని రాజశేఖర్ ఫైనల్ గా మలయాళం రీమేక్ కే ఓటు వేసినట్టు ఫిలిం నగర్ టాక్. రెండేళ్ల క్రితం వచ్చి మంచి విజయం అందుకున్న జోసెఫ్ ని తెలుగుకు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తీయబోతున్నట్టు సమాచారం. ఈ లీక్ మొన్న నెలే వచ్చింది కానీ ఇప్పుడు పనులు వేగవంతమాయ్యాయట.

దర్శకుడిగా నీలకంఠను ఫిక్స్ చేసినట్టు వినికిడి. ఈయన క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మిని చివరి దశలో డ్రాప్ అయ్యాక కొత్తగా ఏ కమిట్ మెంట్ తీసుకోలేదు. ఇప్పుడీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం దాదాపు ఖాయమేనని చెబుతున్నారు. జోసెఫ్ ఒకరకమైన టిపికల్ స్టోరీ. ఇందులో హీరోయిన్ ఉండదు. తన మాజీ భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న హీరో ప్రైవేటుగా కేసు విచారణ చేపట్టి దాని వెనుక విస్తుపోయే నిజాలను వెలికి తీస్తాడు. ఊహించని రీతిలో చాలా అనూహ్య పరిణామాలు తలెత్తుతాయి. క్లైమాక్స్ కూడా షాక్ ఇచ్చేలా ఉంటుంది. అక్కడి ఆడియన్స్ టేస్ట్ కొంత విభిన్నంగా ఉంటుంది కాబట్టి వర్కవుట్ అయ్యింది కానీ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అంటే చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది.

క్రైమ్ థ్రిల్లర్ అయిన జోసెఫ్ చాలా మటుకు స్లో స్క్రీన్ ప్లేతో సాగుతుంది. మనవాళ్ళు అంత ఓపిగ్గా చూడరు. అందుకే స్క్రిప్ట్ విషయం లో చాలా రిపేర్లు అవసరమవుతాయి. అధికారిక ప్రకటన వచ్చే దాకా దీన్ని ఖరారుగా చెప్పలేం కానీ మొత్తానికైతే కదలిక ఉన్న మాట వాస్తవం. ఈ మధ్య టాలీవుడ్ మేకర్స్ కేరళ రీమేకుల మీద విపరీతంగా మనసు పారేసుకుంటున్నారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే వెంటనే హక్కులు కొనేస్తున్నారు. ఇప్పటిదాకా దృశ్యం లాంటి ఒకటో రెండో తప్ప మరీ అద్భుతాలు చేసిన రీమేకులు అయితే పెద్దగా లేవు. అయినా సరే గత రెండు మూడేళ్ళలో వచ్చిన మల్లు వుడ్ బెస్ట్ మూవీస్ అన్నింటి మీద కన్నేసి రైట్స్ తీసుకుంటున్నారు. ఇది కథల కొరత అనాలో లేక రిస్కుకు భయపడి మన నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడుతున్న ఆలోచన అనాలో అర్థం కావడం లేదు కానీ మొత్తానికి టాలీవుడ్ లో క్రియేటివ్ కంటెంట్ కొరత ఉన్న మాట మాత్రం వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp