ఓటిటి బాటలో రౌడీ తమ్ముడు ?

By iDream Post Jul. 12, 2020, 11:57 am IST
ఓటిటి బాటలో రౌడీ తమ్ముడు ?

గత ఏడాది దొరసానితో తెరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఓ ఇమేజ్ తో ఎంటరైన ఆనంద్ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టలేదు కానీ అందరి దృష్టిలో అయితే పడ్డాడు. ఇప్పుడీ మిడిల్ క్లాస్ మెలోడీస్ రూపంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయబోతున్నాడు. వినోద్ అనంతోజు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గుంటూర్ బ్యాక్ డ్రాప్ లో అక్కడి స్లాంగ్ లోనే రూపొందుతున్న ఈ మూవీలో వర్ష బోల్లమ హీరొయిన్. చూసి చూడంగానే, జానులతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష ఈ మధ్య తరగతి పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిందని ఇప్పటికే టాక్ ఉంది.

దీన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద ప్రసాద్ నిర్మించారు. తాజా అప్ డేట్ ప్రకారం మిడిల్ క్లాస్ మెలోడీస్ నేరుగా ఓటిటిలో వచ్చే అవకాశం ఉందని వినికిడి. గతంలో ఇదే సంస్థ ప్రొడ్యూస్ చేసిన ఓ పిట్ట కథ ప్రైమ్ లోనే బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. నాలుగింతలు లాభం కూడా వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. అందుకే దీన్ని కూడా అదే దారిలో తీసుకెళ్లే ఆలోచన చేశారట. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఓపెన్ చేసినా మీడియం రేంజ్ సినిమాలకు ఇంతకు ముందు మార్కెట్ రావడం కష్టం. బయ్యర్లు రేట్లకు కోత పెట్టేస్తారు. పైగా భారీ చిత్రాలు చాలా క్యులో ఉన్నాయి .

అలా చూస్తే దీనికి టైం ఎక్కువ పడుతుంది. అందులోనూ ఇలాంటి వాటికి పబ్లిక్ హాళ్ళ దాకా వస్తారా రారా అనే అనుమానాలు బలంగానే ఉన్నాయి. ఏతావాతా వచ్చే జనవరి దాకా జనం మైండ్ సెట్ ఇలాగే ఉండేలా కనిపిస్తుండటంతో అన్ని కోణాల్లోనూ విశ్లేషించి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలిసింది. సింపుల్ ఎమోషన్స్ తో ఫీల్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ తో రూపొందిన మిడిల్ క్లాస్ మెలోడీస్ కు సంబంధించి ఓటిటి ప్రకటన వచ్చే దాకా అధికారికంగా ధృవీకరించలేం కానీ న్యూస్ అయితే ప్రచారంలోకి వచ్చేసింది. మొత్తానికి రెండో సినిమానే ఇలా ఓటిటికి రావడం ఆనంద్ దేవరకొండకు కొంత ఇబ్బంది కలిగించేదే అయినా ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే బెటర్ ఆప్షన్ అనుకోవాలి. ప్రస్తుతం ఇదంతా చర్చల దశలోనే ఉన్నట్టు తెలిసింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp