పెళ్లి విషయంలో క్లారిటీతో ఉన్నాను

By iDream Post May. 26, 2020, 03:34 pm IST
పెళ్లి విషయంలో క్లారిటీతో ఉన్నాను

హీరోయిన్ గా ఏ భాషలో అయినా మహా అయితే ఓ పదేళ్లు కొనసాగడమే పెద్ద అచీవ్ మెంట్ గా భావిస్తున్న ఈ రోజుల్లో రెండు దశాబ్దాలు అంటే 20 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఆఫర్లు రాబట్టుకోవడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో త్రిషను మెచ్చుకోవలసిందే. 1999లో జోడి సినిమాలో సైడ్ రోల్ తో పరిచయమై ముందు తమిళ్ ఆపై తెలుగులో స్టార్లందరి సరసన నటించిన త్రిషకు ఇప్పుడు కూడా బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కృష్ణ లాంటి ఎన్నో టాలీవుడ్ బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో ఉన్నాయి.

సీనియర్ మోస్ట్ స్టార్ చిరంజీవితో మొదలుకుని డార్లింగ్ ప్రభాస్ దాకా అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న త్రిష గత ఏడాది కోలీవుడ్ లో 96 రూపంలో మరో క్లాసిక్ హిట్ దక్కించుకుని ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయింది. త్రిషది ముక్కుసూటి మనస్తత్వం. ఏది చేయాలనుకున్నా మొహమాటపడకుండా చేసేస్తుంది. తనది ఇంపల్సివ్ బిహేవియర్. అంటే ప్రతిదీ ప్లాన్ చేసుకోకుండా ఆ నిమిషంలో ఏం చేయాలి అనిపిస్తే దానికి రెడీ అయిపోవడం ఇలాంటి మనస్తత్వంలో ఎక్కువగా ఉంటుంది. త్రిష అదే టైపు. ఇప్పటిదాకా పెళ్లి ఆలోచన చేయలేదా అంటే సరైన జోడి దొరికినప్పుడు ఇతను మనకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతాడు అనిపించినప్పుడు ఆలస్యం చేయనని చెబుతోంది.

చుట్టుపక్కల బంధువులు, మిత్రులు ఎన్నో జంటలను చూశానని అధిక శాతం రాజీ పడుతూ బ్రతుకుతున్నారు తప్ప జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం లేదని గమనించింది. అందుకే బ్రేకప్ అయినా బాండింగ్ అయినా తాను అనుకున్నట్టు ఉంటేనే కొనసాగిస్తానని లేదంటే ఆలోచించే సమస్యే లేదని తేల్చి చెప్పింది. గతంలో తన ఎంగేజ్ మెంట్ ను సైతం ఇదే కారణాల వల్ల రద్దు చేసుకున్నానని చెబుతున్న త్రిష పెళ్లి చూడాలంటె ఇంకొంత కాలం ఆగాల్సి వచ్చేలా ఉంది. ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్న త్రిష ఇటీవలే ఆచార్య నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తెలుగు స్ట్రెయిట్ మూవీ చేస్తోందని మురిసిపోయిన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏది ఏమైనా మోస్ట్ ఎలిజిబుల్ విమెన్ బ్యాచిలర్ గా ఉన్న త్రిషకు మూడు ముళ్ళు వేసే వరుడు ఎక్కడ ఏ దేశంలో ఏం చేస్తున్నాడో మరి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp