అసిస్టెంట్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ ట్విస్ట్

By iDream Post May. 23, 2020, 05:50 pm IST
అసిస్టెంట్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ ట్విస్ట్

సినిమా పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు కొందరి కెరీర్లను అమాంతం మార్చేస్తాయి. అలాంటిదే ఇది కూడా. నటిగా సుధ గురించి కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. తల్లిగా, వదినగా, అత్తగా ఈవిడ పోషించిన ఎన్నో పాత్రలు ఫ్యామిలీ ఆడియన్స్ లో గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. 1991లో చిరంజీవి హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్టో అందరికి తెలిసిందే. ఆప్పటి రికార్డులను బ్రేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో మురళీమోహన్ భార్యగా చిరు పెద్ద వదినగా సుధ ముప్పాతిక సినిమా విధవగా నటించారు.

రెండో వదినగా పోష్ గా స్టైలిష్ గా సుమలత కనిపిస్తారు. నిజానికి ముందు అనుకున్న వేషం అది కాదట. సుధ గారితోనే రెండో వదిన వేషం వేయించి మొదటి వదిన కోసం ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ ని సెట్ చేద్దామనే ఆలోచనతో దర్శకుడు విజయ బాపినీడు గారు దానికి తగ్గట్టే కథను చెప్పి రమ్మని తన అసిస్టెంట్ ని చెన్నైకి పంపించారు. అక్కడికి వెళ్ళే సమయానికి సుధ తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. అందులో విధవ వేషం. సెట్ కొచ్చి చూసిన బాపినీడు అసిస్టెంట్ వెంటనే ఏదో ఫ్లాష్ అయ్యి అక్కడి నుంచే ల్యాండ్ లైన్ ఫోన్ లో దర్శకుడికి సుధ గారు బొట్టు లేకుండా తెల్లచీరలో బాగా సరిపోయారని చెప్పేశాడు.

అంతేకాదు అక్కడే ఉన్న స్టిల్ ఫోటో గ్రాఫర్ తో ఆదే గెటప్ లో ఫోటో తీయించి సుధకు తెలియకుండా హైదరాబాద్ కు వాటిని పట్టుకెళ్ళాడు. బాపినీడు గారు చూసి ఔను కదా నిజమే అనుకుని శరత్ కుమార్ కు భార్యగా బదులు మురళీమోహన్ అర్ధాంగిగా సుధాగారిని ఫిక్స్ చేశారు. ముందు అనుకున్న పాత్ర కాస్తా సుమలతకు వెళ్లిపోయింది. ఒకవేళ ఆ అసిస్టెంట్ సెట్ కు వెళ్ళకుండా సుధ గారిని ఇంట్లోనే కలిసి ఉంటే గ్యాంగ్ లీడర్ ఇంకోలా ఉండేదేమో. అయినా ఇది తన మంచికే జరిగిందని ఆ బ్లాక్ బస్టర్ తర్వాత అవకాశాలు పెరిగి ఇక్కడే సెటిలైపోయాయని చెప్పారు సుధ. ఈ విషయం చాలా రోజుల తర్వాత వాళ్ళుగా చెబితేనే తెలిసిందని అప్పుడు ఆశ్చర్యపోయానని ఆవిడే స్వయంగా షేర్ చేసుకున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp