టికెట్ల అమ్మకాలకు ఆచార్య ప్లాన్

By iDream Post Mar. 06, 2021, 02:29 pm IST
టికెట్ల అమ్మకాలకు ఆచార్య ప్లాన్

ఈ ఏడాది రాబోతున్న అత్యంత భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో ఆచార్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ మొదటిసారి ఫుల్ లెన్త్ రోల్స్ చేస్తున్న మూవీ కావడంతో అంచనాలకు హద్దులు లేకుండా పోయాయి. దీంతో బయ్యర్లు కనివిని ఎరుగని ఆఫర్లతో హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే నైజామ్ రైట్స్ చిరు ఆల్ టైం బెస్ట్ ప్రైస్ కి వరంగల్ శీను సొంతం కాగా మిగిలిన ఏరియాలు కూడా అంతే స్థాయిలో డిమాండ్ పలుకుతున్నాయి. మెగా బ్రాండ్ తో పాటు దర్శకుడు కొరటాల శివ ఇమేజ్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. అందులోనూ టీజర్ చూశాక హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీని మీద పెడుతున్న భారీ పెట్టుబడులు వెనక్కు రావాలంటే మొదటి వారం టికెట్ ధరలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారట. దానికి అనుగుణంగానే ఏపిలో మొదటి నాలుగు రోజులు టికెట్ ధర సుమారు 300 రూపాయల దాకా ఉండొచ్చని సమాచారం. తెలంగాణలోనూ ఇంత భారీగా కాకపోయినా పెంచుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది కాబట్టి అక్కడా పెద్ద నెంబరే ఉంటుంది. ఇదే నిజమైతే అభిమానులకు షాక్ తప్పదు. ముఖ్యంగా రిపీట్ లో మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే ఫ్యాన్స్ ఆ అవకాశాన్ని కోల్పోతారు. రెండో వారం దాకా వేచి చూడాల్సి ఉంటుంది.

ఇదెంతవరకు నిజమో కానీ మొత్తానికి ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అమలు జరిపితే ఆ తర్వాత వచ్చే నారప్ప, కెజిఎఫ్ 2, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, మేజర్ లాంటి పాన్ ఇండియా మూవీస్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయిపోతాయి. ఎప్పుడో బాహుబలి తీసుకొచ్చిన ఈ ట్రెండ్ ని ఇప్పుడు ఆచార్య ఇంకో లెవెల్ కు తీసుకెళ్తుందన్న మాట. అయితే ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టే ఇలాంటి ఆలోచన సమర్ధనీయం కాదు కానీ ఆచార్య లాంటి కమర్షియల్ సినిమాకు ఆ స్థాయిలో టికెట్ ధర అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఈ నెల చివరి వారంలో రామ్ చరణ్ ఇంట్రో టీజర్ ని విడుదల చేయబోతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp