మొఘల్ -ఎ-ఆజమ్ కోసం బడే గులాంని ట్రాప్ చేసిన ఆసిఫ్

By Sannapareddy Krishna Reddy Aug. 05, 2020, 08:19 pm IST
మొఘల్ -ఎ-ఆజమ్ కోసం బడే గులాంని ట్రాప్ చేసిన ఆసిఫ్

భారత సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయే ఆణిముత్యం మొఘల్ - ఎ-ఆజమ్. దర్శకుడు కే. ఆసిఫ్ ఈ సినిమా చిత్రీకరణ 1948లో ప్రారంభించి పన్నెండు సంవత్సరాల తర్వాత 1960లో ముగించి, ఆగస్టు 5న విడుదల చేశాడు. పర్ఫెక్షనిస్టుగా పేరున్న ఆసిఫ్ సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకునేవాడు.

ఇరవై పాటలు

సంగీత దర్శకుడుగా నౌషద్ ని ఎంపిక చేసుకుని ఏకంగా ఇరవై పాటలు రికార్డ్ చేయించి, నిడివి ఎక్కువ కావడంతో పన్నెండు పాటలు మాత్రమే వాడుకున్నాడు దర్శకుడు.

ఒక సన్నివేశంలో నాయకుడు సలీమ్ తన ప్రియురాలు, నర్తకి అయిన అనార్కలికి తనను ఉద్యానవనంలో వేకువజామున తాన్ సేన్ సంగీతం ప్రాక్టీస్ చేసే సమయంలో కలుసుకొమ్మని సందేశం పంపుతాడు. తెర మీద సలీమ్, అనార్కలిల రొమాన్స్, తెర వెనుక తాన్ సేన్ పాట ఉంటుంది. నౌషద్ ఇచ్చిన ట్యున్ కి తగ్గట్టుగా పాట రాయించి రికార్డు చేశాక, "దీనికి రఫీ సరిపోడు. హిందూస్తానీ సంగీతంలో నిపుణుడు కావాలి" అన్నాడు ఆసిఫ్. "వీళ్ళు బడే గులాం ఆలీ ఖాన్ కన్నా బాగా పాడుతారా?" అనడిగాడు ఆసిఫ్.

"లేదండీ. ఆయన నంబర్ వన్. వీళ్లు ఆయన తరువాతే" అన్నాడు నౌషద్. "అయితే ఆయనతోనే పాడిద్దాం" అన్నాడు ఆసిఫ్. గతంలో బైజు బావ్రా అనే చిత్రానికి నౌషద్ సంగీతం సమకూర్చి ఉన్నాడు. ఆ సినిమాలో తాన్ సేన్ పాత్ర ఉంటుంది. తాన్ సేన్ మీద చిత్రీకరించిన పాటలకు నేపధ్యగానం చేయమని బడే గులాం ఆలీఖాన్ ని అడిగితే ఒప్పుకోలేదు. సినిమాల్లో పాడనని ఖరాఖండిగా చెప్పేశాడు. ఆ విషయం నౌషద్ చెప్తే, "సరే అదేదో ఆయన నోటి వెంటే విందాం" అన్నాడు ఆసిఫ్.

బడే గులాం ఆలీ ఖాన్

ఆసిఫ్, నౌషద్ కలిసి రెండు రోజుల తర్వాత బడే గులాం ఇంటికి వెళ్లారు. పరిచయాలు అయ్యాక తను తీయబోయే సినిమా గురించి చెప్పాడు ఆసిఫ్. "మంచిది. నా ఆశీస్సులు మీకు ఉంటాయి" అన్నాడు ఖాన్. "ఆశీస్సులు కాదు. మీరో పాట పాడాలి" అన్నాడు ఆసిఫ్." క్షమించండి. నేను సినిమా పాటలు పాడను" అన్నాడు బడే గులాం. "నో.. నో. మీరో పాట పాడాలి. మీరు పాడుతారు" అని ఆసిఫ్ అనగానే బడే గులాంకి చిర్రుత్తుకొచ్చింది.

నౌషద్ వైపు తిరిగి," ఏరా వీడికేమైనా పిచ్చా!?" అనడిగాడు. "పిచ్చే. తను ఏం అనుకుంటే అది జరిగి తీరాలనే పిచ్చి" అన్నాడు వౌషద్." అయితే ఈ పిచ్చికి మందు నా దగ్గర ఉంది అని ఆసిఫ్ వైపు తిరిగి, "ఒక పాటకు నా పారితోషికం పాతిక వేలు"అన్నాడు. హిందీ సినిమా రంగంలో అగ్రశ్రేణి గాయకులు మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ సినిమా బడ్జెట్ బట్టి పాటకు మూడు నాలుగు వందలు తీసుకునే రోజులు అవి.

ఆసిఫ్ ఏమీ మాట్లాడకుండా పైకి లేచి, తన దగ్గర ఉన్న బ్యాగులో నుంచి వంద రూపాయల నోట్ల కట్ట తీసి బడే గులాం చేతిలో పెట్టి, "ఇది పదివేలు. పాట రికార్డింగ్ ఫూర్తవగనే మిగిలిన మొత్తం ఇచ్చేస్తాను" అన్నాడు. ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో తలూపాడు బడే గులాం. ముందు అనుకున్నట్టు ఒకటి కాకుండా రెండు పాటలు పాడింది, పాటకు పాతిక చొప్పున యాభైవేలు ఇచ్చాడు కే. ఆసిఫ్. ఆ తరువాత మరెప్పుడూ సినిమా పాట పాడలేదు బడే గులాం ఆలీఖాన్.

నేటికి మొఘల్ - ఎ-ఆజమ్ విడుదల అయ్యి అరవై సంవత్సరాలు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp