6 సినిమాలు - ఇంకా తీరని విడుదల సమస్య

By iDream Post Oct. 29, 2020, 09:11 pm IST
6 సినిమాలు - ఇంకా తీరని విడుదల సమస్య

థియేటర్లు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోకపోయినా వచ్చే నెల నుంచి ఆశావహ పరిస్థితులు ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల నిర్మాతలు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో పడ్డారు. 2021 సంక్రాంతి మీద అయిదారు సినిమాలు కర్చీఫ్ వేసేసి ముందు జాగ్రత్త పడ్డాయి. ఏ డేట్లకు వస్తాయో ఖచ్చితంగా చెప్పలేదు కానీ పండక్కు రావడం మాత్రం కన్ఫర్మ్. కానీ డిసెంబర్ మీద కన్నేసినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటి తాలూకు న్యూస్ మాత్రం ఇంకా బయటికి రావడం లేదు. క్రిస్మస్ లోపు పరిస్థితి సద్దుమణిగితే ఆ సీజన్ ని వాడుకునేందుకు రెడీ అవుతున్నాయి.

సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటరూ' సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి చేసుకుని రంగంలోకి దిగేందుకు ఉరకలు వేస్తోంది. ముందు ఓటిటి అన్నారు కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. శర్వానంద్ 'శ్రీకారం'కు గుమ్మడికాయ కొట్టేశారు. రైతులకు సంబంధించిన బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకో టీమ్ సైలెంట్ గా ఉంది. అల్లరి నరేష్ 'నాంది'కి ఈ రోజుతో ప్యాకప్ పూర్తయ్యింది. నాగ చైతన్య 'లవ్ స్టోరీ' అప్డేట్ ని దసరాకు ఏమైనా ఇస్తారనుకుంటే అదేమీ జరగలేదు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇవన్నీ చివరి దశలో ఉన్న మూవీసే. కాకపోతే ఎప్పుడు రావాలనే టైం విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాయి.

వీటిలో ఏవీ జనవరికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. అదే నెలలో విపరీతమైన పోటీ ఉంది కాబట్టి ఒకవేళ డిసెంబర్ వద్దు అనుకుంటే ఫిబ్రవరి లేదా అటుపై మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పెట్టుబడుల భారాన్ని మోస్తున్న వీటిలో కొందరు నిర్మాతలకు ఇంకా ఆలస్యం చేయడం అంత సులభం కాదు. మరోవైపు ఊరించేలా ఓటిటి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు వద్దని ఎదురు చూస్తూనే ఉన్నారు. మరోపక్క కేంద్రం అన్ లాక్ 5 మార్గదర్శకాలనే నవంబర్ చివరి దాకా పొడిగించింది. ఇప్పుడు థియేటర్లు తెరిచి ప్రేక్షకులకు మెల్లగా అలవాటు చేద్దాం అనుకున్న నిర్మాతలకు ఎగ్జిబిటర్ల నిస్సహాయత అవరోధంగా మారింది. అసలీ పరిణామాలు ఎటు వెళ్తాయో మాత్రం ఇప్పటికిప్పుడు విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp