3 భావోద్వేగాలకు దక్కిన గౌరవం

By iDream Post Aug. 02, 2020, 05:29 pm IST
3 భావోద్వేగాలకు దక్కిన గౌరవం

ఈ నెల 9 నుంచి 15 దాకా జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ టోరెంటోకు మూడు సౌత్ సినిమాలు ఎంపికవ్వడం మూవీ లవర్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. న్యాచురల్ స్టార్ జెర్సీ తెలుగు నుంచి సెలెక్ట్ కాగా తమిళ్ లో కార్తి ఖైదీ, మలయాళంలో ఫర్హాద్ ఫాసిల్ ట్రాన్స్ ఈ గౌరవాన్ని దక్కించుకుంది. నాని కెరీర్లోనే బెస్ట్ ఎమోషనల్ జర్నీగా పేరు తెచ్చుకున్న జెర్సీ ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన మెప్పు పొందింది. కమర్షియల్ గా రికార్డులు సృష్టించలేకపోయినా అందులో తండ్రి కొడుకుల భావోద్వేగం మంచి వసూళ్ళను కూడా తెచ్చింది. క్రికెటర్ బయోపిక్ గా రూపొందిన జెర్సి ఇప్పటికీ తన బెస్ట్ అని చెబుతాడు నాని.

గౌతం తిన్ననూరి దర్శకత్వానికి పేరు రావడమే కాదు హిందిలోనూ తనతోనే షాహిద్ కపూర్ తో రీమేక్ చేసే దాకా వెళ్ళింది. ఇక కార్తి ఖైది రేపిన సంచలనం గుర్తుందేగా. డబ్బింగ్ వెర్షన్ లోనూ రికార్డులు సృష్టించి కొన్ని చోట్ల యాభై రోజులు కూడా ఆడింది. ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని లోకేష్ కనగరాజ్ తీసిన అద్భుతానికి ఏకంగా విజయ్, రజనికాంత్ లాంటి స్టార్ల నుంచి ఆఫర్లు వచ్చేలా చేసింది. విలక్షణ నటుడిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంటున్న ఫర్హాద్ ఫాజిల్ ట్రాన్స్ కూడా ఈ చిత్రోత్సవంలో చోటు దక్కించుకుంది. మత ప్రచారం పేరుతో పాస్టర్లు చేసే మోసాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

క్రిస్టియన్ డామినేషన్ ఉండే కేరళలో ఈ సినిమా సూపర్ హిట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందులోనూ మనిషి బలహీనతలను వాడుకుని స్వార్థపరులు ఎలా సొమ్ము చేసుకుంటారో చక్కగా చూపించారు. దీని తెలుగు వెర్షన్ త్వరలో ఆహా ద్వారా విడుదల చేయబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటుంది. మూడు సినిమాల్లోనూ మంచి ఎమోషన్ ఉంటుంది. జెర్సిలో కొడుకు, ఖైదిలో కూతురు, ట్రాన్స్ లో తమ్ముడు ఇలా మూడు పాత్రలు హీరోతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాళ్ళ కోసమే కథ నడుస్తూ ఉంటుంది. మొత్తానికి భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని వచ్చిన మూడు విభిన్న సినిమాలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కించుకోవడం విశేషమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp