రంగ‌శంక‌ర‌! ఒక న‌టుడి క‌ల‌

By G.R Maharshi 18-11-2019 06:55 PM
రంగ‌శంక‌ర‌! ఒక న‌టుడి క‌ల‌

క‌న్న‌డిగుల ప్ర‌త్యేక‌త ఏంటంటే ఈ డిజిట‌ల్ యుగంలో కూడా వాళ్లు నాట‌కాన్ని కాపాడుకున్నారు. దీనికి నిద‌ర్శ‌నం రంగ‌శంక‌ర‌. బెంగ‌ళూరు జేపీ రోడ్డులో ఉన్న ఈ ఆడిటోరియంలో గ‌త 15 ఏళ్ల‌లో ఆరు వేల ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి.
చిన్న‌త‌నం నుంచి నాకు క‌న్న‌డ నాట‌కాల‌తో ప‌రిచ‌యం ఉంది. క‌ర్నాట‌క బార్డ‌ర్‌లో ఉన్న రాయ‌దుర్గంలో పెర‌గ‌డం వ‌ల్ల నాకు క‌న్న‌డ అర్థ‌మ‌య్యేది. ఏడేళ్ల వ‌య‌స్సులో బ‌య‌లు నాట‌కం చూశాను. దీన్ని బైలాట అంటారు. ఒక ర‌కంగా మ‌న వీధి నాట‌కం. ఆ నాట‌కం గ‌ట్టిగా అరుపులు, పెడ‌బొబ్బలు, పాట‌ల‌తో ఉండేది.

నా 12 ఏళ్ల వ‌య‌స్సులో సుర‌భిలాగా ఒక నాట‌క స‌మాజం మా ఊరు వ‌చ్చింది. సాంఘిక నాట‌కాలు డ‌బ్బులు పెట్టి చూడ‌టం అదే మొద‌లు. "సూళియ‌సంప‌త్తు " త‌న భ‌ర్త‌ని వ‌ల‌లో వేసుకున్న స్ర్తీకి బుద్ధి చెప్పి కాపురాన్ని స‌రిదిద్దుకునే మ‌హిళ క‌థ‌. దీంట్లో విప‌రీత‌మైన బూతు డైలాగ్‌లు ఉండేవి. జ‌నం వాటి కోసం వ‌చ్చి విర‌గ‌బ‌డి న‌వ్వే వారు.

1985లో బ‌ళ్లారి రాఘ‌వ క‌ళామందిర్‌లో ఒక క్రైం నాట‌కం చూశాను. తుంగ‌భ‌ద్ర డ్యాంలో ఒక‌ని తోసేసి హ‌త్య చేస్తారు. హంత‌కున్ని క‌నిపెట్ట‌డ‌మే ఇతివృత్తం. స్టేజ్‌పైన తెల్ల‌టి సిల్కు వ‌స్త్రంతో నీటి ప్ర‌వాహాన్ని సృష్టించ‌డం నాకు భ‌లే న‌చ్చింది.

త‌ర్వాత క‌న్న‌డ నాట‌కాలు చూడ‌టం కుద‌ర్లేదు. మా అబ్బాయి చ‌దువు కోసం 2009 నుంచి త‌ర‌చుగా బెంగ‌ళూరు వెళ్లేవాన్ని. మెజిస్టిక్‌లో గుచ్చివీర‌న్న థియేట‌ర్ క‌నిపించింది. ఈ వీరన్న మ‌న సుర‌భిలాగా క‌న్న‌డ నాట‌కానికి ఎంతో సేవ చేశారు. ఆయ‌న ట్రూప్ క‌ర్నాట‌క అంత‌టా నాట‌కాలు వేసేది. హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్ న‌డిచేవి.
గుచ్చివీర‌న్న థియేట‌ర్‌లో ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం నాట‌కం ఉంటుంది. టికెట్ రూ.50 (ఇప్పుడు పెంచి ఉంటారు). ఏసీ థియేట‌ర్‌. కుర్చీలు సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. ఆదివారం రెండు షోలు వేస్తారు.
నాలుగైదు నాట‌కాలు చూశాను. స్టేజీ మీద సెట్టింగ్స్ అదిరిపోయాయి. న‌టుల వాచ‌కం, టైమింగ్ అద్భుతం. కానీ క‌థా వ‌స్తువు మాత్రం చాలా పాత‌ది.

ప‌ల్లెటూరి గొడ‌వ‌లు, విల‌నిజం, ల‌వ్‌, మ‌సాలా క‌థ‌లు. నాకెందుకో ఇతివృత్తం విష‌యంలో వీళ్లు ఎద‌గ‌లేదేమో అనిపించింది. అయితే కొత్త‌కొత్త ప్ర‌యోగాల‌కు వేదిక "రంగ‌శంక‌ర" థియేట‌ర్ అని తెలిసింది. కానీ అక్క‌డ నాట‌కం చూడ‌టం నాకు కుద‌ర్లేదు. ఈ రంగ శంక‌ర ఒక న‌టుడి క‌ల‌. అత‌ని పేరు శంక‌ర‌నాగ్‌. ఉత్స‌వ్ సినిమా ఎవ‌రికైనా గుర్తుంటే అందులో దొంగ‌గా వేసింది ఇత‌నే. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు 1990లో శంక‌ర్‌నాగ్ రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు. ఆయ‌న జ్ఞాప‌కార్థం 2004లో నాగ్ భార్య అరుంధ‌తినాగ్ ఈ థియేట‌ర్‌ని స్థాపించారు. ఈ 15 ఏళ్ల‌లో ఎంద‌రో క‌ళాకారుల‌కి రంగ‌శంక‌ర పుట్టినిల్లైంది. అరుంధ‌తి సేవ‌ల‌కి 2010లో ప‌ద్మ‌శ్రీ వ‌చ్చింది. శ్రీ‌నివాస‌రామానుజ‌న్‌పై తీసిన The Man Who Knew Infinity సినిమాలో త‌ల్లిగా న‌టించారు.

క‌న్న‌డ‌లో, మ‌రాఠీలో నాట‌కం బాగానే బ‌తుకుతోంది. కానీ మ‌న తెలుగులోనే...లోపం మ‌న‌లోనే ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.