వివాదాస్పదం నెప్ట్యూన్ గ్రహ ఆవిష్కరణం

By Sannapareddy Krishna Reddy Sep. 24, 2021, 12:30 pm IST
వివాదాస్పదం నెప్ట్యూన్ గ్రహ ఆవిష్కరణం

సెప్టెంబర్ 23,1846 న జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఉన్న బెర్లిన్ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్త జొహాన్ గాట్ ఫ్రీడ్ గాలేకి అతని మిత్రుడు ఫ్రాన్స్ కి చెందిన మరో ఖగోళ శాస్త్రవేత్త అర్బన్ లె వెరియర్ పంపించిన ఒక పార్సిల్ అందింది. అందులో ఒక నోట్ బుక్ నిండుగా లెక్కలు, ఫార్ములాలు ఉన్నాయి. దానితో పాటు ఒక లెటర్ ఉంది.

తను గత కొంతకాలంగా యురేనస్ గ్రహగమనాన్ని పరిశీలించాననీ, అందులో తేడాలు ఉన్నాయని గమనించాననీ, అందుకు కారణం దాని మీద మరొక గ్రహం తాలూకు ఆకర్షణ శక్తి పనిచేయడం అని భావించి, న్యూటన్ గమన నియమాలను అనుసరించి లెక్కలు కట్టి ఆ గ్రహం ఎక్కడ ఉంటుందో ఉజ్జాయింపుగా లెక్కించాననీ, దానిని ధృవీకరించడానికి శక్తివంతమైన టెలిస్కోప్ అవసరం కావడంతో అది అందుబాటులో ఉన్న గాలేకి ఆ వివరాలు పంపుతున్నాననీ, వాటి ఆధారంగా ఆ గ్రహం కోసం అన్వేషించమనీ ఆ ఉత్తరం సారాంశం.

గాలే ఆ నోట్ బుక్ పరిశీలించి చూశాడు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఆధారంగా లెక్కలు కట్టి చివరిలో కొత్త గ్రహం ఎక్కడ ఉండవచ్చో లెక్క కట్టి యురేనస్ గ్రహం నుంచి ఎంత దూరంలో, ఎటువైపు ఉంటుందో మ్యాప్ కూడా గీసి పంపించాడు లే వెరియర్. ఆలస్యం చేయకుండా తన సహాయకుడు హెన్రీచ్ డి అరెస్ట్ సాయంతో బెర్లిన్ అబ్జర్వేటరీలోని టెలిస్కోప్ సాయంతో వెతకడం మొదలు పెట్టాడు గాలే. అర్ధరాత్రి దాటి, తేదీ సెప్టెంబర్ 24గా మారిన కొద్ది సేపటికి లె వెరియర్ చెప్పిన చోటికి ఒక డిగ్రీ తేడాలో ముదురు నీలం రంగులో ఉన్న కొత్త గ్రహం కనిపించింది.

Also Read : పలాయనమే వ్యూహంగా నెపోలియన్ మహాసేనను చిత్తు చేసిన రష్యా

ముందే చూసినా గుర్తించలేకపోయిన బ్రిటిష్ శాస్త్రవేత్తలు

ఫ్రాన్స్ లో లె వెరియర్ యురేనస్ గమనం మీద పరిశోధన చేస్తున్నప్పుడే ఆ విషయం తెలియకుండా ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం విద్యార్ధి జాన్ కౌచ్ ఆడమ్స్ కూడా అదే విషయం మీద పరిశోధన చేస్తున్నాడు. ఫ్రాన్స్ కి చెందిన అలెక్సి బూవార్డ్ అనే ఖగోళ శాస్త్రవేత్త పారిస్ అబ్జర్వేటరీలో పని చేస్తూ 1821లో యురేనస్ గ్రహం రాబోయే రోజుల్లో ఏ సమయంలో ఎక్కడ ఉండబోతోందో గ్రహ గమనం గురించి జొహానెస్ కెప్లర్ రూపొందించిన సూత్రాలు, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఆధారంగా లెక్కలు కట్టి ఒక పట్టిక రూపొందించాడు.

అయితే యురేనస్ గ్రహం గమనం తన లెక్కలకు విరుద్ధంగా ఉండటం గమనించిన బూవార్డ్ దానిమీద మరేదో ఖగోళ వస్తువు ఆకర్షణ శక్తి పని చేస్తుందని, అది ఒక కొత్త గ్రహం అయిఉండొచ్చని భావించి దాన్ని కనిపెట్టడానికి ప్రభుత్వం చేస్తుండగా మరణించాడు.
1843లో డిగ్రీ సంపాదించి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ కి ఎంపికైన జాన్ కౌచ్ ఆడమ్స్ అలెక్సి బూవార్డ్ చేసిన కృషిని కొనసాగించి తన పరిశోధన ఫలితాలు ఒక నోట్ బుక్ లో రాసి, నిర్ధారణ కోసం కేంబ్రిడ్జి అబ్జర్వేటరీ డైరెక్టర్ జేమ్స్ ఛాలిస్ కి 1845 సెప్టెంబరులో పంపించి, ఎటువంటి స్పందన రాకపోవడంతో, అక్టోబరు నెలలో గ్రీన్ విచ్ అబ్జర్వేటరీలోని జార్జ్ ఎయిరీకి చూపించాలని అతని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో నౌఖరు చేతికి ఇచ్చి వచ్చేశాడు ఆడమ్స్.

Also Read : హిట్లర్ జాత్యహంకారం మీద దెబ్బకొట్టిన ఒలింపిక్ స్ఫూర్తి

కొన్ని రోజుల తర్వాత ఎయిరీ ఆడమ్స్ పరిశోధనలు పరిశీలించి, ఒక విషయమ్మీద వివరణ కోరుతూ ఒక లేఖ రాశాడు. అది ఆడమ్స్ కి అందలేదో, లేక ప్రత్యుత్తరం రాయకుండా అతను నిర్లక్ష్యం చేశాడో అతని పరిశోధన మరుగున పడిపోయింది. తర్వాత కొన్నాళ్లకు పారిస్ లో జరిగిన ఒక కాన్ఫరెన్సులో లె వెరియర్ యురేనస్ గ్రహం మీద తను చేస్తున్న పరిశోధనల గురించి ఒక పేపర్ సమర్పించాడు. అప్పుడు ఎయిరీకి జాన్ ఆడమ్స్ చేసిన పరిశోధన గుర్తొచ్చి, అతని నోట్ బుక్ బయటకు తీశాడు.

కొత్త గ్రహాన్ని ఫ్రైంచ్ వారికన్నా ముందు తామే కనిపెట్టాలని 1846 జులై 29 నుంచి కేంబ్రిడ్జి అబ్జర్వేటరీలో జేమ్స్ ఛాలిస్ ఆధ్వర్యంలో, గ్రీన్ విచ్ అబ్జర్వేటరీలో జార్జ్ ఎయిరీ ఆధ్వర్యంలో ఏకధాటిగా అన్వేషణ సాగించారు. ఇంతలో సెప్టెంబర్ 24న కొత్త గ్రహం ఆవిష్కరణ గురించి బెర్లిన్ అబ్జర్వేటరీ నుంచి వార్త వెలువడింది. కొత్త గ్రహం తాలూకు కోఆర్డినేట్స్ తెలిశాక చూసుకుంటే జేమ్స్ ఛాలిస్ బృందం ఆగస్టులో 8న ఒకసారి, 12న మరొక సారి ఆ గ్రహాన్ని చూసి రికార్డు కూడా చేశారు. అయితే నక్షత్రాల తాలూకు మ్యాప్ తో పోల్చి చూడడానికి నక్షత్రాల మ్యాప్ తన దగ్గర లేకపోవడంతో అది కూడా ఒక నక్షత్రంగా భావించాడు ఛాలిస్.

గుర్తింపు కోసం బ్రిటిష్ వారి ఆరాటం

కొత్త గ్రహాన్ని ఆవిష్కరించిన గుర్తింపు తమకు దక్కకపోవడం మీద ఇంగ్లాండు శాస్త్ర సమాజం తీవ్రంగా తీసుకుంది. అన్ని రంగాల శాస్త్రవేత్తలు జాన్ ఆడమ్స్ కి గుర్తింపు రావాలని అతడికి గట్టిగా మద్దతు పలికారు. లె వెరియర్, జొహాన్ గాలే కన్నా ముందుగా జాన్ ఆడమ్స్ కొత్త గ్రహం ఉందని ప్రతిపాదిచడమే కాకుండా దాని స్థానాన్ని కూడా కచ్చితంగా లెక్క కట్టాడని జేమ్స్ ఛాలిస్, జార్జి ఎయిరీలు బహిరంగ వేదికల మీద వాదించారు. అయితే జాన్ ఆడమ్స్ మాత్రం తన అంచనా ఏడు డిగ్రీల తేడాలో తప్పితే, లె వెరియర్ లెక్కలో ఒక డిగ్రీ మాత్రమే వ్యత్యాసం ఉందని, ముందుగా టెలిస్కోపులో చూశారు కాబట్టి కొత్త గ్రహం కనిపెట్టిన ఘనత లె వెరియర్, గాలెలకే దక్కాలని వివాదానికి ముగింపు పలికాడు.

Also Read : శిఖరాన్ని లొంగదీసిన వీరులు

ప్రతి ఏటా ఉత్తమ వైఙానిక ఆవిష్కరణ చేసిన వారికి లండన్ లోని రాయల్ సొసైటీ ఇచ్చే కోప్లే పతకం 1846లో లె వెరియర్ కి, 1848లో జాన్ ఆడమ్స్ కి ప్రధానం చేసే ఇద్దరికీ తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చేశారు.

రెండు శతాబ్దాల క్రితమే పరిశీలనలు

1846లో జొహాన్ గాలే నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించడానికి 233 సంవత్సరాల క్రితమే 1613లో తాను రూపొందించిన టెలిస్కోప్ ఉపయోగించి ఇటలీకి చెందిన గొప్ప ఖగోళ శాస్త్రవేత్తగా చరిత్రకెక్కిన గెలీలియో నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించి, తాను రూపొందించిన అంతరిక్ష పటాలలో నీలం రంగుతో గుర్తించాడు. ఆ తరువాత 1795లో ఫ్రాన్సుకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జెరేమ్ లాలాండే, 1830లో యురేనస్ గ్రహాన్ని కనిపెట్టిన విలియం హెర్షెల్ కుమారుడు జాన్ హెర్షెల్ కూడా తమ అంతరిక్ష శోధనలో నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించి మ్యాప్స్ కూడా తయారు చేశారు. అయితే వీరెవరూ అది గ్రహం అని భావించకుండా నక్షత్రం అని పొరబడ్డారు.

నామకరణంలో వివాదం

కొత్త గ్రహాన్ని కనిపెట్టిన వెంటనే గాలె కానీ, లె వెరియర్ కానీ దానికి పేరేమీ పెట్టలేదు. ఖగోళ శాస్త్రవేత్తలు తమ మధ్య ఉత్తరాలు, మాటల్లో యురేనస్ ఆవతలి గ్రహం అనీ, లె వెరియర్ గ్రహం అని పిలిచేవారు. జేమ్స్ ఛాలిస్ ఆ గ్రహం ముదురు నీలం రంగులో ఉండటం వలన ఓషియానస్ అన్న పేరు బావుంటుందని ప్రతిపాదించాడు. అప్పుడు లె వెరియర్ తన పరిశోధన వల్ల కనిపించిన గ్రహం కాబట్టి తన పేరు పెట్టుకొంటున్నట్టుగా ప్రకటించాడు. దీనికి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు మద్దతు తెలిపినా బయట వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు.

Also Read : ఆ ఒలింపిక్ పతకాలు భారత దేశానివో బ్రిటన్ దేశానివో ఇప్పటికీ స్పష్టత లేదు

ఎవరు కనిపెట్టిన గ్రహానికి వారి పేరు పెట్టడం భావ్యం అని ఫ్రైంచ్ వారు యురేనస్ పేరు కూడా దాన్ని కనిపెట్టిన విలియం హెర్షెల్ పేరుమీద హెర్షెల్ గ్రహం అని వ్యవహరించడం మొదలు పెట్టారు. ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ఆ సంవత్సరమే డిసెంబర్ 29న రష్యాలోనీ సెయింట్ పీటర్స్ బెర్గ్ లో జరిగిన ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్రీడ్రిచ్ వాన్ స్టూర్వె రోమన్ సముద్ర దేవత నెప్ట్యూన్ పేరు ప్రతిపాదించాడు. అప్పటి వరకూ ఒక్క భూ గ్రహానికి తప్ప మిగిలిన అన్ని గ్రహాలకు రోమన్ దేవతల పేర్లు ఉన్నాయి కాబట్టి నెప్ట్యూన్ అన్న పేరు అందరి ఆమోదాన్ని పొందింది.

సౌరకుటుంబంలో చివరి గ్రహం

1930లో క్లైడ్ టోమ్ బాగ్ ప్లూటో గ్రహాన్ని కనిపెట్టేవరకూ నెప్ట్యూన్ సౌరకుటుంబంలో చిట్టచివరి గ్రహంగా ఉండేది. అయితే ప్లూటోకి ఒక గ్రహానికి ఉండవలసిన లక్షణాలు లేవని దాన్ని గ్రహాల జాబితా నుంచి 2006లో తొలగించాక ఇప్పుడు మళ్లీ నెప్ట్యూన్ సౌరకుటుంబపు చిట్టచివరి గ్రహం అయింది. నెప్ట్యూన్ గురించి చాలా రోజుల వరకూ మనకు తెలిసింది తక్కువే అయినా 1989లో నాసా వారి వాయేజర్ - 2 అనే అంతరిక్ష నౌక నెప్ట్యూన్, దాని ఉపగ్రహాలను అతి సమీపంలో నుంచి తీసిన ఫోటోల వల్ల చాలా వివరాలు తెలిశాయి.

సూర్యుడు చుట్టూ ఒక ప్రదక్షిణం చేయడానికి 165 సంవత్సరాలు తీసుకునే నెప్ట్యూన్ దాన్ని కనిపెట్టిన తర్వాత సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణాన్ని 2011లో పూర్తి చేసింది. నాసా సంస్థ సౌరకుటుంబం అంచుల వరకూ పరిశోధన చేయడానికి ఆర్గో అనే మరో అంతరిక్ష నౌకని సిద్ధం చేస్తోంది. అతి త్వరలో దాని ప్రయోగం ఉండబోతోంది అని నాసా వర్గాల సమాచారం. దాని ద్వారా సౌరకుటుంబం అంచుల్లో ఉన్న యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలతో పాటు ఆస్టిరాయిడ్స్ తో నిండిన క్యూపర్ బెల్ట్ గురించిన మరిన్ని రహస్యాలు మనకు తెలిసే అవకాశం ఉంది.

Also Read : మహమ్మారిని ఎదుర్కోవడానికి ముద్దుని నిషేధించిన ఇంగ్లాండు చక్రవర్తి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp