కోటప్పకొండ మహాశివరాత్రి.. ప్రభల సంస్కృతీ వైభవం

By Sanjeev Reddy Mar. 11, 2021, 10:45 am IST
కోటప్పకొండ మహాశివరాత్రి.. ప్రభల సంస్కృతీ వైభవం

కోటప్పకొండ, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, కావూరు అనే గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి . చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు.

ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది.

ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు.
పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్పగుడి అను పేరు.ఈ గుడి ఉన్న శిఖరానికి రుద్ర శిఖరం అని పేరు . ఇక్కడ విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని ప్రతీతి . ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైరుతి భాగానున్న శిఖరానికి బ్రహ్మశిఖరమని పేరు. రుద్ర విష్ణు శిఖరంలపై స్వయంభువులగు జ్యోతిర్లింగంలు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమియు లేకపోవుట గూర్చి చింతించిన బ్రహ్మ శివుని గూర్చి తపస్సు చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది .

ఇంకొక కథనం ప్రకారం కొండ కావూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులకు ఆనందవల్లి (గొల్లభామ) అనే కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. ఆమె పరమ శివుని భక్తురాలు . ఎదిగిన తర్వాత రుద్ర కొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రతిరోజూ ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. ఆమె ప్రతిరోజూ రుద్ర కొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది.

కాకులు వాలని కోటప్పకొండ

రోజూ కోటయ్యసామిని పూజించిన తర్వాత నైవేద్యం సమర్పించటానికి పలు రకాల ఆహార పదార్ధాలు తట్టలో పెట్టుకొని తీసుకెళ్లే ఆనందవల్లి ఒకరోజు అలాగే నైవేద్యాలు అన్నీ ఓ బుట్టలో సర్ది తల పై పెట్టుకొని కొండ ఎక్కుతూ మార్గాయాసం తీర్చుకోవడానికి తట్టని దించి ఓ రాయి పై కూర్చోగా కొండ పై ఆహారం కోసం సంచరిస్తున్న ఓ కాకి తట్టలో ఉన్న పుల్ల పెరుగు కుండని తన ముక్కుతో పగలగొట్టిందట . పరమ శివునికి సమర్పించవలసిన నైవేద్యం అలా నేలపాలు కావటంతో ఆవేదన చెందిన గొల్లభామ ఆ కొండ పై కాకులు వాలరాదని శపించిందట . నాటి నుండి కోటప్పకొండ పై కాకులు వాలవని ప్రతీతి . నేటివరకూ ఈ కొండ పై కాకి సంచారం అనేది చూసిన వారు లేరు .

వివాహిత అయ్యి గర్భందాల్చిన తరువాత కూడా ప్రార్థనలను ఎప్పటిలాగే రోజూ కొండెక్కి కొనసాగించింది ఆనందవల్లి . నిండు గర్భిణీగా ఉన్న సమయంలో రోజూ కొండ అధిరోహించటానికి ప్రయాస పడలేక కోటయ్య సామిని తన ఇంటికి రమ్మని కోరుతోంది . ఆమె భక్తికి మెచ్చిన సామి ఆమె ఇంటికి తాను వస్తానని వాగ్దానం చేసి వెనుతిరుగి చూడకుండా ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. రుద్ర కొండ నుండి, ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తరువాత వెనక నుండి పెద్ద కొండ రాళ్లు పడుతున్న శబ్దాలకు ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం, ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి, జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగ రూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తీవ్రంగా చింతించిన ఆనందవల్లి ప్రాణత్యాగం చేసి ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని యల్లమంద గ్రామానికి సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది .

ప్రభల చరిత్ర ..

లింగ రూపుడైన కోటయ్య సామిని భక్తుడైన సాలంకయ్య తమ గ్రామానికి రమ్మని కోరగా మహాశివరాత్రి పర్వదినాన తన కొండకి భక్తులు కట్టుకొని వచ్చే ప్రభలు కోటి అవుతాయో అప్పుడు తాను కొండ దిగి కిందకి వస్తానని వరమిచ్చాడు . అంతట కొండ దిగి తన గ్రామానికి వెళ్లిన సాలంకయ్య ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపి ప్రతి మహా శివరాత్రి పర్వదినాన ప్రభ నిర్మించి కోటప్పకొండకి తరలించి పరమశివుణ్ణి దర్శించుకొని పూజించసాగారని మరో కథనం . తర్వాత్తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇదే రీతిన శివరాత్రి నాడు ప్రభలు నిర్మించి కొండకి చేరి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోసాగారు .

దాదాపు మూడు శతాబ్దాల నుండి విస్తృతంగా ప్రచారం పొందిన కోటప్పకొండ ప్రభల సంస్కృతి రాష్ట్రంలో మరెక్కడా కానరాదు . కొన్ని దశాబ్దాలుగా సత్రశాల క్వారీ తిరునాళ్ళలో కనపడుతున్ననూ కోటప్పకొండ ప్రభల సంస్కృతిని అనుసరించే అని అనుభవుఁజ్ఞులు చెబుతారు .

మొదట చిన్న లాగుడు బండ్లతో ప్రారంభమైన ప్రభల నిర్మాణం , తర్వాత ఎద్దుల బల్ల పై భారీ సైజులో వస్తున్న వందల ప్రభలతో శివరాత్రి ఉత్సవాలు కోలాహలంగా పెద్ద తిరునాళ్లగా ప్రసిద్ధి చెందింది . కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా దూర ప్రాంతాల ప్రజలు కూడా ప్రభలతో వచ్చి కోటయ్య సామిని దర్శించుకోసాగారు . స్వాతంత్ర్య సమరయోధులు సైరా చిన్నపరెడ్డి , కన్నెగంటి హనుమంతు వంటి వీరులు సైతం ప్రతియేటా ప్రభలతో కొండకి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకొనే వారు .

చేబ్రోలు మండల కొత్త రెడ్డి పాలెం వాసి గాదె చిన్నపరెడ్డి బాల గంగాధర తిలక్ ప్రసంగాలకు ప్రభావితుడై స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా చుట్టుపక్కల గ్రామస్తులను కూడగట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పన్నులు చెల్లించకుండా సహాయ నిరాకరణతో పాటు పలు పోరాటాలు చేశారు .

శివ భక్తుడైన చిన్నపరెడ్డి ప్రతి ఏడు లాగానే 1909 లో కూడా ప్రభ నిర్మించుకొని తన ఎద్దుల బండి పై కోటప్పకొండ రాగా భారీ జనసందోహానికి బెదిరిన ఎద్దులను అదుపు చేసే ప్రయత్నంలో ఉండగా బ్రిటిష్ వారు ఆ ఎద్దులను కాల్చి చంపడంతో ఆగ్రహించిన చిన్నపరెడ్డి బ్రిటిష్ వారి పై తిరగబడ్డాడు . చిన్నపరెడ్డి తో పాటు పలువురు అనుచరులు ప్రజలు బ్రిటిష్ వారి పై దాడికి దిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడగా ఇద్దరు బ్రిటిష్ వారు చనిపోయారు . తర్వాత చిన్నపరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా చిన్నపరెడ్డికి ఉరి , 21 మంది అనుచరులకు యావజ్జీవ శిక్షలు విధించింది కోర్టు . చిరునవ్వుతో ఉరి కంభం ఎక్కిన చిన్నపరెడ్డి గురించి ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు పలు జానపదాలు పాడుకొంటారు.  సైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగరు కడ్డీ అనేది వాటిలో ప్రధానమైనది .

పల్నాటి ప్రాంతంలో అడవుల్లో పశువులు , ఇతర జీవాల్ని మేపుకోవటానికి , స్థానికులు పుల్లలు ఏరుకోవటానికి బ్రిటిష్ వారు విధించిన పుల్లరి పన్నుకి వ్యతిరేకంగా ఉద్యమించిన దుర్గి మండలం మంచాలపాడు గ్రామవాసి అయిన కన్నెగంటి హనుమంతు ఆధ్వర్యంలో పలు గ్రామాల ప్రజలు పుల్లరి కట్టకుండా నిరాకరించడమే కాకుండా హనుమంతు ఆధ్వర్యంలో పల్నాటి యువత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పలు పోరాటాలు చేశారు .

కన్నెగంటి ఆచూకీ ఆనవాళ్లు పసిగట్టలేని బ్రిటిష్ వారు కొందరు ద్రోహుల సాయంతో కన్నెగంటి హనుమంతు కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభతో వెళ్తున్నాడని తెలిసి ప్రభ ఊరి వెలుపలికి రాగానే ఊరిని చుట్టుముట్టగా , విషయం తెలుసుకున్న హనుమంతు వెనుతిరిగి ఊళ్ళోకి రాగానే చుట్టుముట్టి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 26 తూటాలు దిగి నేలకొరిగాడు .

గత కొన్ని దశాబ్దాల నుండి ట్రాక్టర్ల పై భారీ విద్యుత్ ప్రభల సంస్కృతి మొదలుకావడంతో పాటు ఆయా ప్రభల వద్ద రికార్డు డాన్సుల సంస్కృతి కూడా ప్రవేశించింది . రాన్రానూ గ్రామాల్లో రాజకీయ పార్టీల ప్రమేయం పెరగడంతో ప్రభల నిర్మాణంలోనూ అది ప్రతిబింబించసాగింది . ఈ క్రమంలో ఆయా ప్రభలకు తమ రాజకీయ పార్టీల రంగులు , చిహ్నాలు ఏర్పాటు చేయడంతో పాటు జనాల్ని ఆకర్షించే క్రమంలో ఏర్పాటు చేసే రికార్డు డాన్సులు హద్దు మీరి అసభ్య , నగ్న ప్రదర్శనలకు వేదికలు కావడంతో కొంతకాలం పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేసినా కొనసాగుతుండడంతో ప్రభుత్వం రికార్డు డాన్సుల్ని నిషేధించింది .

గుంటూరు , ప్రకాశం , కృష్ణా జిల్లాలతో పాటు సరిహద్దు రాయలసీమ ప్రాంత వాసులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఒకప్పుడు పెద్దఎత్తున వ్యాపారం కొనసాగేది . ఏడాది పొడవునా అవసరమయ్యే వ్యవసాయ , గృహోపకరణాలతో పాటు బట్టలు , అలంకరణ సామాగ్రీ , బీదసాదలకు అందుబాటు ధరల్లో పలురకాల తినుబండారాలు కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తిరునాళ్ల రోజు పేట నుండి కోటప్పకొండ వరకూ అన్ని దారుల్లో వరసగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో చేసే కొనుగోళ్ల సందడి అంతా ఇంతా కాదు . అన్ని కుల వృత్తుల వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాల్లో ఆ మూడు రోజులు జరిగే వ్యాపారం దాదాపు ఆరునెలల అమ్మకాలతో సమానం అని ప్రతీతి .

ఇంతటి విశిష్టత కలిగిన కోటప్పకొండ అభివృద్ధిలో ఎందరో రాజులు , జమీందార్లు , రాజకీయ నాయకుల కృషి ఉంది . ఈ ప్రాంతాన్ని పాలించిన కృష్ణదేవరాయలు వంటి రాజులతో పాటు 1761 లో గుడి జీర్ణోద్ధరణ గావించి నూతనంగా నిర్మించిన జమీందారులు రాజా మలరాజ్ వంశీయులతో పాటు దివంగత నేత కోడెల శివప్రసాద్ వరకూ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసారు . ఆలయ అభివృద్ధితో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దటంలో కోడెల పాత్ర మరువలేనిది . కొండ పైకి ఘాట్ రోడ్డు నిర్మాణం , త్రాగునీటి పైప్ లైన్ , వన్య ప్రాణుల పార్క్ , టాయ్ ట్రైన్ , చైల్డ్రన్ పార్క్ , భారీ ఈక్వేరియం , చిల్డ్రన్ పార్క్ , బోటింగ్ వంటి ఏర్పాట్లతో కోటప్ప కొండని తీర్చిదిద్ది కొండతో పాటు తన పేరు చిరస్మరణీయం చేసుకొన్నారు కోడెల .

తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించి మరింత ప్రశస్తి పొందటానికి దోహదం చేయగా ప్రస్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి హయాంలో భారీ ఎత్తున ఏర్పాట్లు , సౌకర్యాల కల్పనతో గత ఏడాది రికార్డు స్థాయిలో తొమ్మిది నుండి పది లక్షల మంది తిరునాళ్ల నాడు కోటయ్య సామిని దర్శించుకున్నారు . ఈ సంవత్సరం కూడా భక్తుల తాకిడికి అనుగుణంగా రెండు నెలల ముందు నుండే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభించిన అధికారులు పేట నుండి కోటప్పకొండకి ప్రభలు తరలి వెళ్లే రోడ్లు విస్తరించి డివైడర్స్ ఏర్పాటు చేయడంతో పాటు , పూజారులు , సిబ్బంది త్వరితగతిన కొండ పైకి చేరుకోవటానికి ప్రత్యేకంగా లిఫ్ట్ నిర్మించారు . అంతేగాక అన్ని దారులు ప్రభల ప్రయాణానికి అనుగుణంగా సిద్ధం చేసి , త్రాగునీరు , పార్కింగ్ , శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభలు , భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకలం సిద్ధం చేసి ఉంచారు .

సర్వ హంగులతో శివరాత్రికి ముస్తాబైన కోటప్పకొండ పరిసరాలు ఈ మూడు రోజులూ చేదుకో కోటయ్యా చేదుకో , హరహర మహాదేవ అనే నినాదాలతో మార్మోగనున్నాయి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp