iDreamPost

ఆ ముగ్గురిపై టీడీపీ క్యాడర్ గుర్రు!

ఆ ముగ్గురిపై టీడీపీ క్యాడర్ గుర్రు!

ఒకప్పుడు రాయలసీమలో గట్టి పట్టున్న తెలుగుదేశం పార్టీకి వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దాంతో పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది. గత ఎన్నికల్లో అయితే మరీ దీన స్థితిలోకి దిగజారింది. 2019 ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం 53 సీట్లకు గానూ అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరులో ఒక సీటు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఒక్క చంద్రబాబు మాత్రమే కుప్పంలో నెగ్గారు.

ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ల అనంతరం ఇప్పటికీ ఆ పార్టీ పుంజుకోలేకపోతోంది. పార్టీ పటిష్టానికి పెద్దగా చర్యలు చేపట్టకపోవడం, నియోజకవర్గ ఇంఛార్జి లుగా ఉన్నవారు క్రియాశీలంగా లేకపోవడంతో టీడీపీపై ఎన్నికల ముందు ప్రజల్లో కనిపించిన అసంతృప్తి ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు దానికి టీడీపీ కార్యకర్తల అసంతృప్తి కూడా తోడైంది. ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జిలపై ఆ ప్రాంతాల పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

పేరుకే ఇంఛార్జీలు

గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క కుప్పం స్థానాన్ని మాత్రమే టీడీపీ నిలబెట్టుకోగలిగింది.మిగతా 13 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. తిరుపతిలో భూమన కారుణాకర రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు. అప్పటినుంచి తమ నియోజకవర్గాల్లో చాలా చురుగ్గా ఉంటూ మరింత పట్టు పెంచుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, కోవిడ్ సమయంలో ఎమ్మెల్యేలు చేసిన సేవలు ప్రజల్లో ఆదరణ పెంచాయి.

Also Read:ఏమిటీ అగ్రిగోల్డ్ స్కామ్..? ప్రభుత్వం ఎందుకు డిపాజిట్లు చెల్లిస్తుంది ..?

అదే సమయంలో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థులు పార్టీని ప్రజలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. తిరుపతి నుంచి పోటీచేసిన సుగుణమ్మ, చంద్రగిరిలో పోటీ పడిన పులవర్తి నానీ, శ్రీకాళహస్తిలో పోటీ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డిలు ఓటమిపాలైనప్పటి నుంచి కాడి దించేశారు. పార్టీ కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా అధిష్టానం పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగని దుస్థితి నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో ఇంఛార్జీలు లేక ఇబ్బంది పడుతున్న టీడీపీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఇంఛార్జీలు ఉన్నా అవే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో ఇంఛార్జీలు ఉన్నా లేనట్లేనని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోరు

తమంతట తాముగా ప్రజల్లోకి వెళ్లేందుకు చొరవ చూపని ఈ ముగ్గురు ఇంఛార్జీలు వచ్చిన అవకాశాలను కూడా నిర్లిప్తతతో వదిలేస్తున్నారని ఆయా నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు. దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ సుగుణమ్మ, నానీ, సుధీర్ లపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అనేక అంశాలపై ప్రజల తరపున పోరాటాలు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇటీవలి అమరరాజా వివాదాన్ని దీనికి ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు.

Also Read:ఉపాధి హామీ పనుల చెల్లింపులపై మరోసారి హైకోర్టు ఆదేశాలు

చిత్తూరు జిల్లా నుంచి ఆ సంస్థను తరలిస్తారన్న ప్రచారాన్ని టీడీపీ అగ్రనేతలు, పచ్చ మీడియా సృష్టించినప్పుడు ఈ ముగ్గురు ఏమాత్రం స్పందించలేదంటున్నారు. చంద్రగిరి ప్రాంతంలో ఫ్యాక్టరీ ఉండగా.. అందులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు చెందినవారే. తప్పుడు ప్రచారాలతో ఆందోళనకు గురవుతున్న వారికి భరోసా ఇచ్చేందుకు సైతం టీడీపీ ఇంఛార్జీలు ముందుకు రాకపోవడాన్ని కార్యకర్తలు తప్పుపడుతున్నారు. అదే సమయంలో అమరరాజా వివాదంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తక్షణం స్పందించి స్థానికులను ఉపశమింపజేసిన విషయాన్ని టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తూ.. తమ ఇంఛార్జీల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంఛార్జీల వైఖరి కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి పాలైందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ పుంజుకోవడం కష్టమేనని ఆందోళన చెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి