హర్టయిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ – Nostalgia

హర్టయిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ – Nostalgia

మల్టీ స్టారర్ ని డీల్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్క హీరో అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నా వాటిని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు. 1993లో అలాంటిదే జరిగింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున-కృష్ణ కాంబినేషన్ లో మురళీమోహన్ గారు భారీ బడ్జెట్ తో వారసుడు తీశారు. ఇది మలయాళంలో వచ్చిన పరంపర(తెలుగులో అధిపతిగా డబ్ చేశారు), హిందిలో వచ్చిన ఫూల్ ఔర్ కాంటేలకు రీమేక్ గా రూపొందింది. వారసుడులో హీరొయిన్ నగ్మా, కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణలుగా దీనికి అప్పట్లో చాలా క్రేజ్ తెచ్చుకుంది.

డాన్ అయిన తండ్రికి అతని పొడ ఏ మాత్రం గిట్టని కొడుక్కి మధ్య జరిగే సంఘర్షణగా రూపొందిన వారసుడు అప్పట్లో పెద్ద హిట్. అయితే రిలీజైన టైంలో కృష్ణ పాత్రకు సంబంధించి డిజైన్ చేసిన ట్రీట్ మెంట్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఓ సన్నివేశంలో నాగార్జున కృష్ణ కాలర్ పట్టుకోవడం, క్లైమాక్స్ లో కృష్ణ పోషించిన ధర్మతేజ పాత్ర చనిపోవడం ఇవన్ని వాళ్ళ మనోభావాలను దెబ్బ తీశాయి. కొన్ని సెంటర్స్ లో అభిమానులు నిరసన రూపంలో గొడవ కూడా చేశారు. ఆఖరికి ఈవివి సత్యనారాయణ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేశారు. నిజానికి షూటింగ్ టైంలోనే రెండు క్లైమాక్స్ లను చిత్రీకరించారని అప్పట్లో మీడియాలో చెప్పుకునేవాళ్ళు. థియేటర్లో మాత్రం కృష్ణ పాత్రకు సాడ్ ఎండింగ్ ఉంటుంది.

మొదట్లో వ్యతిరేకత వచ్చినా కృష్ణ సైతం కథ ప్రకారమే తప్ప దీనికి మరో కారణం లేదని సర్దిచెప్పేసరికి ఫ్యాన్స్ శాంతించారు. వీటి సంగతి ఎలా ఉన్నా ఫైనల్ గా వారసుడు ఘన విజయం సొంతం చేసుకుంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్ని అంశాలు ఉన్న చిత్రం కావడంతో క్లాస్ మాస్ ఆదరణ దక్కింది. ఇందులో స్టూడెంట్ విలన్ గా శ్రీకాంత్ నటించారు. మూడేళ్ళ తర్వాత 1996లో నాగార్జున- కృష్ణ మళ్ళీ రాముడొచ్చాడు సినిమాలో నటించారు. అయితే కలిసే సీన్స్ ఉండవు. ఫ్లాష్ బ్యాక్ లోనే కృష్ణ పాత్ర చనిపోతుంది. అయితే అప్పుడు వారసుడు తరహాలో నిరసనలు ఎక్కువ రాలేదు కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. అందుకే తెలుగులో మల్టీ స్టారర్స్ కు మన తారలు వెంటనే సిద్ధపడరు ఇలాంటి రిస్కులు ఉంటాయి కాబట్టి.

Show comments