iDreamPost

ఫిబ్రవరిలో మీడియం సినిమాల హంగామా

ఫిబ్రవరిలో మీడియం సినిమాల హంగామా

సంక్రాంతి హడావిడి దాదాపుగా ముగింపుకొచ్చినట్టే. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలవగా వీరసింహారెడ్డి టాక్ తేడాగా వచ్చినా సంక్రాంతి సీజన్ ని వాడేసుకుని బయ్యర్లకు లాభాలు ఇచ్చింది. వారసుడు గట్టెక్కిపోగా తెగింపు పర్వాలేదనిపించుకుంది. కళ్యాణం కమనీయం రెండో రోజుకే దుకాణం సర్దాల్సి వచ్చింది. ఇక మొన్న వచ్చిన సుధీర్ బాబు హంట్ కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కు తేలేకపోయింది. దారుణమైన ఆక్యుపెన్సీలతో అన్ని చోట్లా డెఫిషిట్లు నమోదు చేస్తోంది. మాలికాపురం ప్రమోషన్లు చేయకపోయినా అతి తక్కువ రేట్లకు అమ్మడం వల్ల ఏదో నెట్టుకొస్తోంది. ఇక ఇప్పుడు అందరి కన్ను ఫిబ్రవరి మీద పడుతోంది.

ఫిబ్రవరి 3న ‘రైటర్ పద్మభూషణ్’తో పాటు ‘మైఖేల్’ ఒకే రోజు తలపడనున్నాయి. సుహాస్ మూవీకి ఆల్రెడీ ప్రీ రిలీజ్ ప్రీమియర్లు పలు చోట్ల ప్రదర్శించగా మంచి స్పందనే వస్తోంది. సందీప్ కిషన్ తన సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా అయినప్పటికి కొత్త అనుభూతినిస్తుందని బలంగా చెబుతున్నాడు. 4న ‘బుట్టబొమ్మ’ మీద పెద్దగా అంచనాలేం లేవు కానీ సితార సంస్థ కంటెంట్ ని నమ్ముకుని రిలీజ్ చేస్తోంది. 10న కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసిన ‘అమిగోస్’ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నారు. బ్యానర్ వేల్యూతో పాటు కళ్యాణ్ రామ్ బింబిసార ఫలితం బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అవుతోంది

ఆపై వారం 17న సమంతా ‘శాకుంతలం’ని తీసుకొస్తారు. గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా రూపొందిన ఈ ఇతిహాస గాథని ప్యాన్ ఇండియా బడ్జెట్ తో తెరకెక్కించారు. అదే రోజు కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రానుంది. గత ఏడాది మూడు ఫ్లాపులు అందుకున్న కుర్రాడికి హిట్టు చాలా అవసరం. గీత ఆర్ట్స్ బ్యానర్ కావడంతో స్క్రీన్ల పరంగా ఇబ్బంది ఉండదు. ధనుష్ నటించిన ‘సర్’ అదే రోజు తలపడనుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార సంస్థే దీన్ని నిర్మించింది. విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ తప్పుకున్నట్టు టాక్ ఉంది కానీ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. చివరి వారంలో మాత్రం చెప్పుకోదగ్గ రిలీజులేమీ లేవు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి