iDreamPost

రామన్న యూత్ మూవీ రివ్యూ!

రామన్న యూత్ మూవీ రివ్యూ!

ఇండస్ట్రీలో కొత్త టాలెంట్స్ మెల్లగా బయటికి వస్తోంది. కొత్త రకం సినిమాలతో పాటు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నటుడు అభయ్ నవీన్ హీరోగా ‘రామన్న యూత్’ అనే మూవీ తెరపైకి వచ్చింది. అమూల్య రెడ్డి కథానాయికగా నటించిన ఈ సినిమాని.. హీరో అభయ్ నవీన్ స్వయంగా తెరకెక్కించడం విశేషం. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ నిర్మాణంలో పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. మరి యూత్ ఫుల్ అంశాలతో ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి అభయ్ నవీన్ హీరోగా, దర్శకుడిగా ఎలాంటి ఫలితం అందుకున్నాడో రివ్యూలో చూద్దాం!

కథ:

ఈ సినిమా కథ.. సిద్దిపేటలోని అంక్సాపూర్ అనే గ్రామానికి చెందిన నలుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. రాజు (అభయ్ నవీన్) స్థానిక ఎమ్మెల్యే రామన్న(శ్రీకాంత్ అయ్యంగర్)ని తెగ అభిమానిస్తుంటాడు. ఎమ్మెల్యేతో తిరిగి ఎలాగైనా తాను కూడా పాలిటిక్స్ లో సెటిల్ అవ్వాలని చూస్తుంటాడు. రాజుకు ముగ్గురు ఫ్రెండ్స్ చందు(జగన్‌ యోగిబాబు), రమేశ్‌(బన్నీ అభిరామ్‌), బాలు(అనిల్‌ గీలా). వీళ్ళతో కలిసి రామన్న యూత్ అసోసియేషన్ పెడతాడు రాజు. కట్ చేస్తే.. ఒకానొక సందర్బంలో రాజు, బాలు తమ్ముడు మహిపాల్(విష్ణు)ల మధ్య వైరం మొదలవుతుంది. అనుకోని పరిస్థితుల వలన రాజు సిద్దిపేటలో ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తాడు. మరి రాజు ఎమ్మెల్యేని కలిశాడా లేదా? రాజు, మహిపాల్ మధ్య వైరం ఎందుకు మొదలైంది? రాజు లవ్(అమూల్య రెడ్డి) స్టోరీ ఏమైంది? చివరికి అనుకున్నట్లుగా పాలిటిక్స్ లో అడుగుపెట్టాడా లేదా? తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

రామన్న యూత్.. సమాజంలో రెగ్యులర్ గా కనిపించే అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేసిందని చెప్పాలి. యూత్ తమ లైఫ్ ని పక్కన పెట్టేసి.. పొలిటికల్ లీడర్స్ వెనుక జెండాలు మోసుకుంటూ తిరిగే పాయింట్ క్లియర్ గా చూపించడానికి ట్రై చేశారు. అలాగే రాజకీయ నాయకులు అవసరాల నిమిత్తం యువకులను ఎలా వాడుకుంటున్నారు? అనేది కూడా అంతర్లీనంగా ప్రస్తావనకు తీసుకొచ్చిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించారు. సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్ లైఫ్ పాలిటిక్స్ లో తిరిగే లీడర్స్ కాకుండా.. వాళ్ళ వెనుక తిరిగే యువకుల కథను చెప్పాలనుకున్నారు మేకర్స్. ఈ సందేశం అయితే చూపించాడు హీరో, దర్శకుడు అభయ్ నవీన్.

ఈ రోజుల్లో యూత్ తెలుసుకోవాల్సిన అంశాలలో పాలిటిక్స్ ఒకటి. కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. అయితే.. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికి.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో కొంత వరకే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. మొదట స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కాస్త టైమ్ తీసుకున్నప్పటికి.. ఒక్కో క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నకొద్దీ కథలో అసలు విషయం అర్ధమవుతుంది. అలా రాజు, ఎమ్మెల్యే రామన్న.. క్యారెక్టర్స్ మధ్య లింక్ తో పాటు మెల్లగా ఫ్రెండ్స్ ని ఇన్వాల్వ్ చేసిన విధానం పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు సరైన గోల్ సెట్ కాలేదు. ఉన్న గోల్ ని బలంగా చెప్పలేకపోవడం మైనస్.

ఒక గ్రామంలో నలుగురు యువకుల కథను దూరంగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే.. సినిమాలో ఎక్కడ కూడా ఎమోషనల్ టచ్ పెద్దగా లేదు. పైగా ఎమోషనల్ గా కనెక్ట్ అయి.. అందులో సినిమాలో ఎక్కువ సేపు ట్రావెల్ చేసే అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదు. అయితే.. డెబ్యూ డైరెక్టర్ అయినా.. కొన్ని ఎపిసోడ్స్ బాగా తీశాడని చెప్పాలి. సినిమాలో నటించిన వారితో మంచి నటన రాబట్టుకున్నాడు. బలమైన కథ లేక.. కథనం ఎలాంటి ఊపు లేకుండా ఎంటర్టైన్మెంట్ తో సాగిపోవడమే కనిపిస్తుంది. కొన్ని గ్రామాలలో జరిగే దావత్, ముచ్చట్లు, అక్కడి ఆలోచనలు కాస్త వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.

ఎందుకంటే ఫస్టాఫ్ సరదాగా సాగినా.. సెకండాఫ్ లో హీరో లక్ష్యం మారిపోతుంది. సో.. లవ్ ట్రాక్ తో కాకుండా పొలిటికల్ అంశాలకు స్టోరీ ముడిపడుతుంది. ఇక సినిమాలో అభయ్ నవీన్ హీరోగా.. ఫ్రెండ్స్ గా అనిల్, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, విష్ణు క్యారెక్టర్స్ లో బాగా చేశారు. మిగతా నటులంతా తమ పరిధిమేర మెప్పించే ప్రయత్నం చేశారు. టెక్నికల్ గా సినిమాకు కమ్రాన్ మ్యూజిక్, ఫాహద్ అబ్దుల్ మజీద్ కెమెరా వర్క్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక హీరో, దర్శకుడు, ఎడిటర్ గా అభయ్ నవీన్ ఇంకా స్క్రిప్ట్ లో కేర్ తీసుకుంటే బాగుండేది. కొన్ని సీన్స్ బాగా తీసినా.. కథకు కీలకమైన సీన్స్ వద్ద.. లింక్ మిస్ అవుతున్న ఫీల్ కలుగుతుంది. సో.. రామన్న యూత్ ఓ యూత్ ఎంటర్టైనర్.

ప్లస్ లు:

  • కాన్సెప్ట్
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ
  • సందేశం

మైనస్ లు:

  • హై లేని స్క్రీన్ ప్లే
  • బలమైన సీన్స్ లేకపోవడం
  • ఎమోషనల్ కనెక్షన్ మిస్సింగ్

చివరిమాట: అసంపూర్ణ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

రేటింగ్: 2/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)