iDreamPost

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ రిపోర్ట్

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ రిపోర్ట్

ఇవాళ ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు థియేటర్లలో అడుగు పెట్టాయి కానీ దేనికీ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. కొన్ని మరీ అన్యాయంగా మార్నింగ్ షోలకే సింగల్ డిజిట్ జనాలు రాక క్యాన్సిల్ చేసిన దాఖలాలున్నాయి. అంతో ఇంతో ప్రమోషన్లతో హడావిడి చేసిన వాటిలో సిల్లీ ఫెలో మొదటిది కాగా రెండోది బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. ఎప్పుడో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రిలీజ్ డేట్ దొరక్క ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ బిఎఫ్ హెచ్ లో విశ్వంత్ హీరో కాగా మాళవిక హీరోయిన్ గా నటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకూర్చడం విశేషం.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అర్జున్(విశ్వంత్)కు తన జీవిత భాగస్వామి గురించి ఏవేవో కలలు కంటూ ఉంటాడు. అయితే సరైన క్లారిటీ లేక ఒక రకమైన కన్ఫ్యూజన్ కు గురై తాత్కాలికంగా అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ గా వెళ్లే అద్దె జాబ్ మొదలుపెడతాడు. రెంటుకు తీసుకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పరిష్కరిస్తూనే తన లైఫ్ పార్ట్ నర్ వాళ్లలో ఉందేమోనని అన్వేషిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే దివ్య(మాళవిక) పరిచయమవుతుంది. తనలో అన్ని లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తాడు. ఇక్కడే అసలు ట్విస్టు వచ్చి పడుతుంది. ఇంతకీ అర్జున్ టార్గెట్ రీచ్ అయ్యాడా, దివ్య ఇతన్ని అద్దెకు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

వినడానికి లైన్ ఇంటరెస్టింగ్ గా ఉన్నప్పటికీ దాన్ని సరైన రీతిలో ఎంగేజింగ్ గా మార్చడంలో సంతోష్ కంభంపాటి తడబడ్డాడు. అర్జున్ దివ్య క్యారెక్టరైజేషన్ లోనే బోలెడు లోపాలున్నాయి. అసలు అతను అద్దెకు వెళ్లాలనుకునే కారణమే కన్విన్సింగ్ గా అనిపించదు. పైగా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ తాలూకు ట్రాక్ పూర్తిగా బ్యాలన్స్ తప్పడంతో ఓపికకు పరీక్ష పెడుతూ చూడటమే తప్ప ఏదీ ఆసక్తికరంగా అనిపించదు. అమ్మాయిలతో అర్జున్ వ్యవహారాలు కూడా సిల్లీగా అనిపిస్తాయి. ఇరికించిన మలుపుతో పాటు క్లైమాక్స్ కు దారి తీసే ఎపిసోడ్లు చప్పగా సాగిపోవడంతో బాయ్ ఫ్రెండ్ చివరికి బేర్ మనిపిస్తాడు. క్యాస్టింగ్ లేనప్పుడు కంటెంట్ బలంగా లేకపోతే ఎలా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి