స్టార్ డమ్ అంటూ వచ్చాక కమర్షియల్ ఎలిమెంట్స్ కాలిక్యులేషన్లు పక్కాగా ఉండే సినిమాలు మాత్రమే చేస్తానని గిరిగీసుకుని ఉండే టైపు కాదు కోలీవుడ్ హీరో కార్తి. నిజానికి స్టార్ హీరో సూర్య సోదరుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చినా.. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు అతడు చేసే ప్రయత్నాలే అతడికి అటు తమిళ ప్రేక్షకులతోపాటుగా ఇటు తెలుగుప్రేక్షకుల్లోను అభిమానుల సంపాదించి తెచ్చిపెట్టాయి. గతంలో ‘యుగానికొక్కడు’తో మంచి గుర్తింపు పొందిన కార్తి … గతేడాది ‘ఊపిరి’, ‘కాష్మోరా’ చిత్రాలతో అలరించి తెలుగులోను మంచి మార్కెట్‌నే సంపాదించుకున్న విషయం తెలిసిందే..! ఇప్పుడు కార్తి తాజాగా మరో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు దశాబ్దాల క్రింత జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘తీరన్ అధిగారమ్ ఒండ్రు’. తెలుగులో ‘ఖాకి’ పేరుతో శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. పాత్ర ఏదైనా తనదైన శైలిలో అందులో ఇమిడిపోయే కార్తి పోలీసు అధికారిగా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించగలిగాడు..? రొటీన్ పోలీస్ కథలకు భిన్నంగా ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకోగలుతుంది. సమీక్షలోకి వెళ్లి చూద్దాం..!
కథాంశం ఏమిటి-
ధీరజ్ కుమార్(కార్తి) ఓ సిన్సియర్ పోలీస్ అధికారి. డీఎస్పీగా పనిచేస్తుంటాడు. నేరస్తులకు అతడంటే సింహస్వప్నం. నేరస్తుల విషయంలో ఎవరినీ లెక్కచేయకుండా వారి ఆట కట్టిస్తూ మట్టుపెడుతూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. అయితే అతడి నిజాయతీ, ముక్కుసూటితనం కారణంగా ఎక్కడా ఎక్కువకాలం పనిచేయకుండా బదిలీ అవుతుంటాడు. ఇదిలా ఉండగా.. చాకచక్యంగా ఎన్నో కేసులను ఛేదించిన ధీరజ్‌కు ఓ దోపిడి కేసు మాత్రం ఏమాత్రం కొరుకుడుపడకుండా సవాల్‌గా మారుతుంది. హైవేల పక్కనున్న ఇళ్లలోకి చొరబడి దోపిడీలకు పాల్పడుతూ, దారుణంగా హత్యలకు పాల్పడుతుంటుంది ఓ గ్యాంగ్. వాళ్లను పట్టుకునే బాధ్యతను భుజాలపై వేసుకుంటాడు. ధీరజ్. రాజస్థాన్ కేంద్రంగా దేశమంతా తిరుగుతూ.. దోపిడీలు చేస్తున్న ఆ హంతక ముఠా ఆటను ధీరజ్ ఎలాకట్టించగలిగాడు.. ప్రియ(రకుల్)ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ధీరజ్.. కుటుంబం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే అంశాలే ఈ సినిమా కథ..!
విశ్లేషణ-
ఇది ఓ క్రైమ్ థ్లిల్లర్ మూవీ. ఓ హంతక ముఠాను మట్టుపెట్టేందుకు పోలీసు బృందం పడే కష్టాలు, చేసే పోరాటాలు ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్ ప్రధానమైన సినిమానే అయినా..రొటీన్ పోలీస్ కథల్లా కేవలం హీరో మాస్ ఇమేజ్ను ఎలివేట్ చేయడమే ప్రధానంగా కాకుండా.. పోలీసులు, హంతక ముఠా మధ్య జరిగే సన్నివేశాలను వాస్తవానికి దగ్గరగా సహజంగా చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. ఈ అంశమే.. ఈ చిత్రాన్ని మిగిలిన వాటికి భిన్నంగా నిలుపుతుంది. ఎక్కడా హీరో నేలవిడిచి సాము చేసే విన్యాసాలు కనిపించవు. తెరపై నిజ జీవితాలను, నిజమైన పోలీసులను చూస్తున్నట్లే ప్రేక్షకులు ఫీలయ్యేలా తెరకెక్కించిన విధానాన్ని చూశాక దర్శకుడిని అభినందించకుండా ఉండలేం..!. రెండు దశాబ్దాల క్రితం దాదాపు 45కు పైగా దోపిడీలకు పాల్పడి, 18 హత్యలు చేసి, ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన ఓ నిజమైన నరహంతక ముఠా చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ యధార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని మలిచేందుకు దర్శకుడు చాలానే పరిశోధన చేశాడన్నది ఇందులోని ప్రతీ సన్నివేశం చెప్పకనే చెపుతుంది. ఆ ముఠా నేపథ్యం గురించి తెరపై చూపించిన వైనం కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించి సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. అయితే హంతకులను పోలీసులు పట్టుకోవడమే సినిమా ఇతివృత్తం కాబట్టి కథలో పెద్దగా ట్విస్టులేవీ ఉండవు. కొన్ని సన్నివేశాలు లెంగ్తీగా అనిపిస్తాయి.
నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు-
ముందే చెప్పుకున్నట్టు ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఉండేందుకు తపించే కార్తి ధీరజ్ కుమార్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. మేకప్ లేకుండా ప్రతి సన్నివేశంలోనూ సహజంగా కనిపిస్తూ ప్రేక్షకులను కొత్తదనం ఫీలయ్యేలా చేశాడు. ఇక యాక్షన్ సన్నివేశాలకు సన్నివేశాలకు అవకాశమున్న కథాంశం కాబట్టి.. దర్శకుడు వాటి ఆకట్టుకునేలా తెరకెక్కించిన విధానం ఈ తరహా చిత్రాలను ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది.ది. ప్రియగా గృహిణి పాత్రలో రకుల్ ప్రీత్‌సింగ్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అభిమన్యు సింగ్ నటన బాగుంది. ఇక సాంకేతిక పరమైన అంశాలు చిత్రం స్థాయిని మరింత పెంచాయని చెప్పాలి. సత్యన్ సూరన్ కెమేరా పనితనం , జిబ్రాన్ నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. పాటలు పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేవు.
చివరిగా-
కొత్తదనం నింపుకున్న పోలీస్ కథ ఈ ‘ఖాకి’