వెండితెరపై ఎంట్రీ ఇచ్చిననాటినుంచి విభిన్నమైన కథాంశాలనే ఎంచుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు నారా రోహిత్. తొలి సినిమా ‘బాణం’ నుంచీ అతడు అనుసరిస్తున్న శైలి అదే..! బహుశా ఈ అంశమే అతడికి తక్కువ సినిమాలే చేసినా ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చి పెట్టిందని చెప్పాలి. కాగా ఇప్పటిదాకా తాను చేస్తూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈసారి ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని ఎంచుకున్నాడు రోహిత్. అదే ‘బాలకృష్ణుడు’. ఈ చిత్రంతో పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. సాధారణంగా తొలి చిత్రమంటే తనదైన ముద్ర చూపించేందుకు దర్శకుడు తీవ్రంగా శ్రమించడం సహజం. టాలీవుడ్‌కు ఇటీవల పరిచయమవుతున్న దర్శకులంతా తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో ఈ దర్శకుడి తొలి ప్రయత్నం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. తన సహజశైలికి భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిన పాత్రలో నారా రోహిత్ మెప్పించగలిగాడా..? సమీక్షలోకి వెళ్లి చూద్దాం..!
కథాంశం ఏమిటి-
ఇది రాయలసీమ ప్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ. భానుమతిదేవి(రమ్యకృష్ణ), ప్రతాప్‌రెడ్డి (అజయ్) మధ్య శత్రుత్వం నడుస్తుంటుంది. భానుమతిదేవి మీద కక్ష తీర్చుకునేందుకు ఆమె మేనకోడలు ఆద్య(రెజీనా)ను చంపాలనుకుంటాడు ప్రతాప్‌రెడ్డి. ఇది ముందే తెలుసుకున్న భానుమతి.. ఆద్యకు తెలియకుండానే ఆమెకు రక్షణగా బాలు(నారా రోహిత్)నుని నియమిస్తుంది. జైలు నుంచి తప్పించుకుని ఆద్యను అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు ప్రతాప్. ఇదిలా ఉండగా బాలు- రోహిత్ ప్రేమలో పడతారు. ఫాక్ష్యనిస్ట్ ప్రతాప్ నుంచి ఆద్యను బాలు రక్షించగలిగాడా..? ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన వారి ప్రేమ కథ సుఖాంతమైందా అన్నదే ‘బాలకృష్ణుడు’ మూవీ..!.
విశ్లేషణ-
ముందే చెప్పుకున్నట్టు ఇది ఓ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వినోదంతో పాటు, కథనంలో కొత్తదనం ఉంటేనే ఇలాంటి సినిమాలు విజయతీరాలకు చేరగలుగుతాయి. ఇదే సూత్రాన్ని దర్శకుడు పవన్ కూడా నమ్ముకున్నాడు.
రొటీన్ కథే అయినా కాసింత వినోదాన్ని, వాణిజ్యాంశాలను మేళవించి సినిమాను నడిపించడంలో విజయం సాధించాడు. సినిమాలో హాస్యం సన్నివేశాలు బాగా పండాయి. మొదట్లో హీరో- హీరోయిన్ల పరిచయం వంటి సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపించినా కథలోకి పృథ్వీ ప్రవేశించాక వినోదాల జల్లు ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. నారా రోహిత్, పృథ్వీల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథలో మలుపులున్నా ప్రేక్షకుడి ఊహకందనంత ట్విస్టులేవీ ఉండవు. నాయకానాయికల మధ్య ప్రేమ చిగురించే అంశంలో, రెజీనా కుటుంబం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కాస్తంత సెంటిమెంట్ పండేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమాకు మరింత బలం చేకూరేది.
నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు-
అతడి గత చిత్రాలకు భిన్నంగా ఈ సారి కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్‌ను ఎంచుకున్న నారారోహిత్ ఈ సినిమా కోసం స్లిమ్‌గా మారడం విశేషం. పాత్రకు అనుగుణంగా రోహిత్ బాగా నటించాడు. ఈ పాత్రలో కొత్తగా కనిపించాడు. రోహిత్‌తో జతకట్టిన రెజీనా అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక భానుమతి దేవిగా రమ్యకృష్ణ పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇలాంటి పాత్రలు తనకు కొట్టిన పిండి అన్నట్టు రమ్య చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. కాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీ నటన, ఆయన పంచిన వినోదం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చెప్పాలి.. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
ఇక దర్శకుడు పవన్ తన తొలి సినిమాకు రిస్క్తీసుకోకుండా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలిచేందుకే ప్రాధాన్యమిచ్చాడు. వినోదాన్ని నమ్ముకుని , కమర్షియల్ ఎలిమెంట్స్నే కాస్తంత భిన్నంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించాడు. కథ, కథనం విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా మరింత మంచి ఫలితం సాధించి ఉండేది. సాంకేతికంగా.. సినిమాకి మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ సి.కుమార్ కెమెరా, మణిశర్మ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సినిమాకు అదనపు బలాలు
చివరిగా
ఈ ‘బాలకృష్ణుడు’ వినోదం పంచుతాడు