రిలయన్స్ రియలైజేషన్ !

రిలయన్స్ రియలైజేషన్ !

  • Published - 05:35 AM, Tue - 5 January 21
రిలయన్స్ రియలైజేషన్ !

రైతు ఉద్యమం ప్రభావం కార్పోరేట్ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఏక కాలంలో అటు కేంద్రంతోనూ, ఇటు కార్పోరేట్ సంస్థలతోనూ తలపడుతున్నారు. నూతన చట్టాల వల్ల కార్పోరేట్ కంపెనీలే లాభపడతాయని ఆరోపిస్తున్న రైతులు అంబానీ, అదానీ కంపెనీల ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ సంస్థకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ మొదలైంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో రిలయన్స్ సంస్థ ఉత్పత్తులను ప్రజలు తిరస్కరిస్తున్నారు. దాదాపు 1500కు పైగా జియో టెలికాం టవర్లను స్థానికులు ధ్వంసం చేశారు. దీంతో రిలయన్స్ సంస్థ కొత్త తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే పనిలోపడింది.

రైతు ఉద్యమం దెబ్బకు విలవిల్లాడుతున్న రిలయన్స్ సంస్థ తమ కాంట్రాక్ట్ ఫార్మింగ్ పై క్లారిటీ ఇచ్చింది. తమకు కాంట్రాక్ట్ వ్యవసాయం పట్ల ఆసక్తి లేదని తేల్చిచెప్పింది. రైతుల సాధికారతే తమకు ముఖ్యమని ప్రకటించింది. తాము వ్యవసాయం కోసం ఎవరినుంచీ భూములు తీసుకోలేదని స్పష్టం చేసింది. మరోవైపు తమ వాదనకు మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. తాజాగా మహారాష్ట్రలోని పలు రైతు సంఘాలు రిలయన్స్ కి మద్దతు ప్రకటించాయి. కొత్త చట్టాలపై కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మహారాష్ట్ర శెత్కారి సంఘటన ప్రకటించింది. వ్యవసాయ చట్టాల వల్ల రైతుల భూములు కార్పోరేట్ కంపెనీల గుప్పిట్లోకి వెళ్తాయనేది అవాస్తమని సంఘటన అధ్యక్షుడు అని ఘన్బట్ తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల రైతులకే మేలు జరుగుతుందని అన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి ఇప్పటికే పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు కార్పోరేట్ కంపెనీల తరుపున కూడా గెంతెత్తుతుండడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు బీజేపీ నేతలు సైతం రిలయన్స్ పక్షాన వకాల్తా పుచ్చుకొని ప్రకటనలు చేస్తున్నారు. రిలయన్స్ దేశంలో ఎక్కడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయట్లేదని పంజాబ్ బీజేపీ నేత హర్జీత్ సింగ్ గ్రెవాల్ తాజాగా ప్రకటించారు. పంజాబ్ మాజీ మంత్రి సుర్జిత్ జేయాని సైతం రిలయన్స్ ఎవరితోనూ ఒప్పందాలు చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగా రిలయన్స్ సంస్థను, కేంద్రాన్ని కొందరు అప్రతిష్టపాలు చేస్రతున్నారని ఆరోపించారు.

రైతు ఆందోళన నేపథ్యంలో పంజాబ్ లో జియో టవర్స పై దాడులు చేయడాన్ని రిలయన్స్ సంస్థ సీరియస్ గా తీసుకుంది. రైతుల ఆరోపణలతో పోటీ టెలికాం సంస్థలు తమ వినియోగదారులను లాక్కోవాలని చూస్తున్నాయంటూ ఇప్పటికే ట్రాయ్ కి ఫిర్యాదు చేసింది. దీనికి తోడు జియో టవర్స్ పై దాడులను ఆపాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసింది. తమ సంస్థపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ దాడులకు ప్రేరేపిస్తున్నారని పిటిషన్ లో పేర్కొంది. అలాంటి వారిని గుర్తించి వారిని శిక్షించాలని కోర్టును కోరింది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొంది. మొత్తానికి రైతు ఉద్యమం సెగ రిలయన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చివరకు ఏ మలుపుతిరుగుతుందో చూడాలి మరి.

Show comments