Idream media
ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాట్లాడినా.. వివాదాలు జరిగినా.. మళ్లీ సమసిపోతాయంటూ చెప్పినా.. గ్రామీణ ప్రజలు తాము ఎంచుకున్న దారిలోనే నడుస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల జోరు కొనసాగింది. సోమవారం రెండో దశ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. 13 జిల్లాల్లో 3,327 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 537 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం పంచాయతీల్లో 16.14 శాతం ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలలో వైసీపీ హవానే కొనసాగింది. 537 పంచాయతీలకు గాను వైసీపీ మద్ధతుదారులు 502 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. టీడీపీ మద్ధతుదారులు 23 పంచాయతీలు, బీజేపీ ఒక పంచాయతీ, స్వతంత్రులు 12 పంచాయతీల్లో పాగా వేశారు.
రెండో విడతలో ఏకగ్రీవమైన పంచాయతీలు గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. గుంటూరులో 70, శ్రీకాకుళంలో 41, విజయనగరం 60, విశాఖ 22, తూర్పుగోదావరి జిల్లాలో 17, పశ్చిమ గోదావరిలో 15, కృష్ణాలో 35, ప్రకాశంలో 69, నెల్లూరులో 35, చిత్తూరులో 61, వైఎస్సార్‌కడప జిల్లాలో 40, కర్నూలులో 57, అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
తొలి విడతలో విజయనగరం మినహా మిగతా 12 జిల్లాలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 525 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 39, విశాఖలో 44, తూర్పుగోదావరిలో 32, పశ్చిమ గోదావరిలో 41, కృష్ణాలో 23, గుంటూరులో 67, ప్రకాశంలో 35, నెల్లూరులో 25, చిత్తూరులో 110, కడపలో 51, కర్నూలులో 52, అనంతపురం జిల్లాలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
రెండు దశల్లో మొత్తం 6,576 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 1,062 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 16.14 శాతం పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి. మిగతా 5,514 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు మంగళవారం తొలి దశలో 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. రెండో దశ పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరగబోతోంది. మూడు, నాలుగు విడతల పోలింగ్ ఈ నెల 17, 21 తేదీల్లో జరుగుతుంది.