ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు, ప్లాంట్లు రావాలి. పరిశ్రమలు, ప్లాంట్లు పెట్టేందుకు భూమి అవసరం. అందుకు సరిపడినంత భూమి ప్రభుత్వం వద్ద ఉండదు. రైతుల భూములు సేకరించడమో లేదా సమీకరించడమో చేయాలి. ఇందుకు మెజారిటీ రైతులు సుముఖంగా ఉండరు. భూమిపై తమకు తరతరాలుగా ఉన్న హక్కును వారు వదులుకునేందుకు సిద్ధపడరు. అది కరువు ప్రాంతమై.. ఆ భూమిలో ఏమీ పడకపోయినా కూడా అమ్ముకునేందుకు ఆసక్తి చూపరు. భూమితో వారికి ఒక మానసిక బంధం పెనవేసుకుని ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం భూ సేకకరణ, సమీకరణకు సిద్ధమైనప్పుడు వ్యతిరేకిస్తారు. ఆందోళనలు చేస్తారు.
అయితే ఇలాంటి పరిస్థితి లేకుండా.. పరిశ్రమలు, ప్లాంట్లు పెట్టేందుకు, రైతులు సంతోషంగా ఉండేందుకు జగన్ సర్కార్ సరికొత్త ఆలోచన చేస్తోంది. పరిశ్రమలు, ప్లాంట్లు పెట్టేందుకు ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకోకుండా.. రైతులు విక్రయించకుండా.. వారే నేరుగా లీజుకిచ్చే విధానాన్ని తెరపైకి తెస్తోంది. ఈ విధానం ద్వారా రైతులు, పరిశ్రమల వారికి తమ భూమిని లీజుకు ఇవ్వొచ్చు. ప్రభుత్వం రైతులకు, పెట్టుబడిదారులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. తమ భూమిని లీజుకివ్వడం వల్ల రైతులకు నిరంతరం ఆదాయం వస్తుంది. ఆ భూమిపై యాజమాన్య హక్కులూ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఇతర ప్రాంతాల్లో కూడా విక్రయించుకునే వీలుండడంతో ప్లాంట్లు పెట్టేందుకు ముందుకువస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం కూడా పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రొత్సహిస్తోంది. పగటి పూట 9 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ జగన్ సర్కార్ అందిస్తోంది. భవిష్యత్‌లో కొరత ఇబ్బందులు తలెత్తకుండా.. విద్యుత్ రాయితీల భారం పెరగకుండా ఉండేందుకు పవన, సౌర విద్యుత్‌లను ప్రొత్సహించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.
బుధవారం విద్యుత్‌శాఖ అధికారులతో పవన, సౌర విద్యుత్‌పై జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం వద్ద ఉన్న భూమి కూడా లీజుకు ఇద్దామని, ఇంకా అవసరమైతే.. రైతుల నుంచి లీజుకు ఇప్పిద్దామని ఆయన అధికారులకు సూచించారు. లీజు విధానం వల్ల రైతులకు నిరంతరం ఆదాయం లభించడంతోపాటు.. యువతకు ఉద్యోగాలు లభిస్తాయని సీఎం వివరించారు. పెట్టుబడిదారులకు అవసరమైన సానుకూల వాతావరణం కల్పించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానంతో రైతులకు గరిష్టంగా మేలు జరగనుంది. అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినట్లువుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
5305