అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్న వైఎస్ జగన్ సర్కార్ మరో నూతన పథకానికి నేడు శ్రీకారం చుట్టుబోతోంది. ఆర్థికపరమైన సమస్యల వల్ల సరైన ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో తలెత్తే పౌష్టికాహర లోపానికి శాశ్వత పరిష్కారం చూపేలా నూతన పథకానికి సీఎం జగన్ రూపకల్పన చేశారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల చిన్నారులకు వివిధ ఆహార పదార్థాలు సరఫరా చేయనున్నారు.
పౌష్టికాహార నిపుణులు రూపొందించిన డైట్‌ను రాష్ట్రంలోని 55వేల అంగన్వాడీ కేంద్రాల ద్వారా 6.4 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల మధ్య ఉన్న 23.70 లక్షల మంది చిన్నారులకు ప్రతి నెలకు సరిపడా రాగిపిండి, కర్జూరం, బెల్లం, వేరుశెనగ–బెల్లంతో తయారు చేసిన చిక్కీలు, పాలు, గుడ్లు, బాలామృతం తదితర ఆహార పదార్ఢాలు అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది అందించనున్నారు.
గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులపై జగన్ సర్కార్ మరింత శ్రద్ధ పెట్టింది. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంటుంది. వారి కోసం మైదాన ప్రాంతాలలోని వారి కన్నా ఎక్కువ ఆహార పదార్థాలు పంపిణీ చే సే లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాన్ని సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ రెండు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 1,863 కోట్ల రూపాయలను వెచ్చించనుంది, ఆహార పంపిణీ, సేవల్లో ఏమైనా లోపాలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు 14408 అనే టోల్ ఫ్రి నంబర్‌ను జగన్‌సర్కార్ ఏర్పాటు చేసింది.