సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సీఎం జగన్ కార్యక్రమాలు, ప్రజాదరణను గమనిస్తున్న కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఏపీ పథకాలను అమలు చేస్తున్నారు. ఇటీవల ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మేనిఫెస్టోలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి చోట్ల ఏపీ పథకాలను పోలినవి కూడా ఉండడం గమనార్హం. ఏపీని మిగతా రాష్ట్రాలు కూడా అనుసరిస్తే మంచిదని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే పలు మార్లు సూచించారు. ఇప్పుడు ఓ విషయాన్ని పరిశీలిస్తే ప్రజల సంక్షేమం కోసం ఎన్ని సమస్యలనైనా తట్టుకుంటూ అమలులో మాత్రం వెనుకడుగు వేసేది లేదని చాటి చెప్పడంలో జగన్ ఆ మోదీని కూడా మించిపోయారు.
ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులలో ఉంది. అప్పుల బూచిని చూపుతూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని నమ్ముతున్న వ్యక్తి జగన్. అది ఆయన అనుసరిస్తున్న మార్గాలను బట్టి అర్థమవుతోంది. ఎవరి ఆరోపణలు ఎలాగున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెప్పిన ప్రతిమాటా నెరవేరుస్తున్నారు. ఆ మాటకొస్తే చెప్పనవి కూడా చేసుకుంటూ పోతున్నారు. సంక్షేమాన్ని మాత్రం విస్మరించడం లేదు. తాజాగా మరో ఉదంతం దాన్ని నిరూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ జీవన్ బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీ మా యోజన (పీఎంఎస్బీవై)లకు కేంద్ర ప్రభుత్వం 50% వాటా ఇస్తుండగా, రాష్ట్రాలు 50 % భరించాలి. లబ్ది దారులు అకాల మరణం చెందినా.. సాధారణ మరణం చెందినా.. ప్రమాదవశాత్తు గాయపడి నా.. వారికి బీమా ప్రయోజనం అందుతుంది.
కానీ, గతేడాది కరోనా సృష్టించిన లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయ గణనీయంగా తగ్గింది. దీంతో ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవడం, మరి కొన్నింటిని వాయిదా వేస్తుండడం చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి 31 నుంచి పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలకు నిధులు ఇవ్వడం మానేసినట్లు తెలిసింది. కరోనా కారణంగా నిధులు ఇవ్వలేక పోతున్నామని, రాష్ట్రాలు కావాలంటే ఈ పథకాన్ని కొనసాగించుకోవచ్చునని సలహా ఇచ్చింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో సుమారు 1.45 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీటికి అయ్యే ప్రీమియం రూ.510 కోట్ల వరకూ ఉంటుంది. కేంద్రం చేతులెత్తేసినా, కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏపీలోనూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని సీఎం జగన్ చెప్పారు. కేంద్రం వదిలేసిన భారాన్ని కూడా జగన్ తన భుజాలపైకి ఎత్తుకోవడం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుందనడంలో సందేహం లేదు.
అంతేకాకుండా, అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. 2020 అక్టోబర్ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 254 కోట్లు చెల్లించారు. ఇందులోనూ జగన్ ఉదారతను చాటుకున్నారు. ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారి కుటుంబాలకు కూడా బీమా సొమ్మును చెల్లించడానికి ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకుని 45 రోజుల నిబంధనను సైతం పక్కనబెట్టి జగన్ మానవతాదృక్పథంతో నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాద మరణం, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు (18-50 వయస్సు), రూ.3లక్షలు (51-70 వయస్సు) బీమా, అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ.1.5 లక్షల బీమా అందించనున్నారు.