గుజరాత్ లో హెరాయిన్ పట్టుబడింది. ఆప్ఘనిస్తాన్ నుంచి అది వచ్చినట్టు అధికారులు ధృవీకరించారు. దానిని ఢిల్లీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. చెన్నై కేంద్రంగా ఉన్న ముఠా దానిని నిర్వహిస్తున్నట్టు తేలింది. అయినప్పటికీ ఓ వర్గం మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ముడిపెట్టి నానా రచ్చ చేస్తోంది. తమకు గిట్టని ప్రభుత్వం అధికారంలో ఉందన్న దుగ్ధతో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తోంది. సంబంధం లేని విషయం పట్టుకొచ్చి ఏపీలో ఏదో జరిగిపోతోందనే రచ్చతో గబ్బు లేపుతోంది.
గుజరాత్ లో ముంద్రా పోర్ట్ వద్ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఆధ్వర్యంలో భారీగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ వేల కోట్లు ఉంటుందని అంచనా. దానిని చెన్నైకి చెందిన వారి పేరుతో రవాణా చేస్తున్నట్టు ఆధారాలు దొరికాయి. అయితే చెన్నై సంస్థ గోవిందరాజు పూర్ణ వైశాలి అనే మహిళ పేరుతో విజయవాడ అడ్రస్ ఆధారంగా జీఎస్టీ సర్టిఫికెట్ సంపాదించింది. దానిని ఉపయోగించి టాల్క్ పౌడర్ ముసుగులో హెరాయిన్ తరలించే యత్నం చేసింది. విజయవాడ నగరంలోని సత్యన్నారాయణ పురం గడియారం వారి స్ట్రీట్ కి చెందిన ఆ అడ్రస్ లో భవనం వైశాలి తల్లి తారకం పేరుతో ఉంది. అయితే చెన్నైలో ఉంటున్న వైశాలి భర్త మాచవరపు సుధాకర్ ఈ అడ్రస్ ని అడ్డంపెట్టుకుని గత ఏడాది ఆగష్టులో జీఎస్టీ సర్టిఫికెట్ సంపాదించారు. దాని ఆధారంతో అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు అధికారులు తేల్చిచెప్పారు.
Also Read : అభ్యర్థులకు ఉన్న ధైర్యం అధినేతకు లేదా…?
అయినప్పటికీ ఏపీలో హెరాయిన్ పట్టుబడిందని, వేల కోట్ల మాదకద్రవ్యాలు ఏకంగా ఆప్ఘనిస్తాన్ నుంచి ఏపీకి వస్తున్నాయని ఓ సెక్షన్ మీడియా వీరంగం చేస్తోంది. అసలు హెరాయిన్ వచ్చింది ఎక్కడి నుంచన్నది అధికారికంగా ప్రకటించకపోయినా చెన్నైకి చెందిన వారు దానిని ఢిల్లీ తరలించే యత్నం చేస్తున్నట్టు కనిపెట్టారు. కానీ పచ్చ మీడియా మాత్రం పేట్రేగిపోతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అంటే గిట్టని సెక్షన్ ఇష్టారాజ్యంగా రాతలు రాస్తోంది. నోటికొచ్చింది కూస్తూ ఏపీ ప్రజలను మభ్యపెట్టవచ్చని భ్రమిస్తోంది. ఏపీ అడ్రస్ తో ఉన్న జీఎస్టీ సర్టిఫికెట్ మినహా రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేని విషయాన్ని పట్టుకుని వీరంగం చేస్తున్న తీరు విచిత్రంగా కనిపిస్తోంది.
చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు జరిగిన నేరాలను చిన్నవి చేసేందుకు ప్రయత్నించే మీడియా ప్రస్తుతం ఏపీకి సంబంధం లేని అంశాన్ని రాష్ట్రాన్ని ముడపెట్టేసి ఆంధ్రప్రదేశ్ పరువు తీసేందుకు యత్నించడం విస్మయకరం. ఇటీవల కూడా ఎన్సీఆర్బీ నివేదికను ఇదే రీతిలో వక్రీకరించారు. ఇప్పుడు హెరాయిన్ వ్యవహారంల విచ్చలవిడి కథనాలు అల్లేస్తున్నారన్నది సామాన్యులు సైతం ఆశ్చర్యం వేసే రీతిలో ఉంది.
Also Read : మా గెలుపును వారు జీర్ణించుకోలేకపోతున్నారు – సీఎం జగన్