రాయలసీమలో వైఎస్సార్సీపీ హవా మరోసారి స్పష్టం అవుతోంది. సీమ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ దూకుడును ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. కడప జిల్లా కమలాపురం, రాజంపేట, కర్నూలు జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ భారీ విజయాలు సొంతం చేసుకుంది. ఉదయం 11 గంటల సమయానికి ఫలితాల సరళి ఇలా ఉంది.
-కమలాపురంలో అధికార వైఎస్సార్సీపీ తన పట్టు నిరూపించుకుంది. ఈ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 76.59 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. వైఎస్సార్సీపీ 15 వార్డుల్లో విజయం సాధించింది. మరో 5 వార్డుల్లో విజయం సాధించగా.. టీడీపీ 5 వార్డులకే పరిమితం అయ్యింది. 9లో 42 ఓట్లు, 10లో 81 ఓట్లు, 11లో 83 ఓట్లు, 15లో 129 ఓట్లు, 14లో 87 ఓట్లు, 17లో 27 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు 1, 19 వార్డుల్లో కేవలం ఆరేసి ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు.
-కడప జిల్లా రాజంపేటను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 29 వార్డులు ఉండగా 67.32 శాతం పోలింగ్ నమోదైంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే 24 వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఇంతవరకు ఖాతా తెరవలేదు. మిగతా ఐదు వార్డుల కౌంటింగ్ జరుగుతోంది. ఒకటో వార్డులో షేక్ సుమియా, రెండో వార్డులో దాసరి మౌనిక గెలుపొందారు. కౌంటింగ్ జరుగుతున్న ఐదు వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది.
-బద్వేలు మున్సిపాలిటీ 11వ వార్డులో కూడా వైఎస్సార్సీపీ గెలుపొందింది.
-అనంతపురం జిల్లాలో ఎన్నిక జరిగిన పెనుకొండ నగర పంచాయతీపై వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా 82.63 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి అయ్యింది. 19 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. టీడీపీ ఒక్క వార్డులోనే గెలవగలిగింది.
-అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 17వ డివిజన్ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
-కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ కూడా అధికార పార్టీ ఖాతాలో చేరింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా 72.95 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. అధికార వైఎస్సార్సీపీ 16 వార్డుల్లో విజయకేతనం ఎగురవేయగా.. టీడీపీ 4 స్థానాలకే పరిమితం అయ్యింది. ఆ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి బుగ్గన ప్రసన్న లక్ష్మి కూడా ఓటమిపాలు కావడం విశేషం.