ఆడలేక మద్దెల ఓడె అన్నట్టు ఉంది భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైఖరి. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని తట్టుకొని బీజేపీని జనంలోకి తీసుకెళ్లడం చేతకాక అధికార పార్టీపై వింత ఆరోపణలు చేస్తున్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ నేతలపై దాడులు చేసి, అనంతరం వారిని భయపెట్టి వైఎస్సార్ సీపీలోకి చేర్చుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సర కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త పోకడ మొదలైందని ఆరోపించారు. పార్టీలో చేరిన వారికి పప్పులు.. బెల్లాలు పంచి పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అన్న వాళ్లే.. నేడు పోవాలి జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు.
అంత అవసరం ఏముంది?
ప్రజలు తిరస్కరించిన తెలుగుదేశం పార్టీ నేతలను, నోటా కన్న తక్కువ ఓట్లు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ నేతలను భయపెట్టి మరీ తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముంటుందని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు పార్టీలకు భవిష్యత్తు లేదని అర్థం చేసుకున్న నాయకులు వైఎస్సార్ సీపీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని జనం నమ్ముతున్నారని చెబుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, రోజురోజుకి ఆదరణ పెరుగుతోందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.
Also Read : ఉద్యమకారుల చూపు బీజేపీపైనే ఎందుకు?
అప్పుడెందుకు ప్రశ్నించలేదు?
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు విష్ణుకుమార్ రాజు ఎందుకు ప్రశ్నించలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా చెరబట్టినప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఏ కారణం వల్ల అడ్డుకోలేదు. ఇప్పుడు వైఎస్సార్ సీపీలో చేరుతున్న వారందరూ ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ సాధిస్తున్న విజయాలను చూసి ఆకర్షితులవుతున్నవారేనని అంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోనని, విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తానని ముఖ్యమంత్రిగా తొలి అసెంబ్లీ సమావేశంలోనే జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అదే పంథాలో ఇప్పటి వరకు పార్టీని నడిపారు. వైఎస్సార్ సీపీ కనుక గేట్లు తెరిస్తే తెలుగుదేశం, బీజేపీల నుంచి మెజార్టీ నాయకులు వచ్చి చేరుతారని అంటున్నారు. కులం, మతం, వర్గం, పార్టీ అనే భేదం పాటించకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నందునే వైఎస్సార్ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా నాయకులు ఇష్టపడుతున్నారు. అందుకే అన్ని పార్టీల నాయకులు తమ పార్టీ వైపు చూస్తున్నారని, వేరే పార్టీ నాయకులపై దాడులు చేసి, బెదిరించి, బతిమాలి తమ పార్టీలో చేర్చుకునే అగత్యం తమకు పట్టలేదని వైఎస్సార్ సీపీ నాయకులు విస్పష్టంగా చెబుతున్నారు.
ఎవరు అనుకుంటున్నారట..
రావాలి జగన్.. కావాలి జగన్ అన్న వాళ్లే.. నేడు పోవాలి జగన్ అంటున్నారని వ్యాఖ్యానిస్తున్న విష్ణుకుమార్ రాజు అందుకు ఒక ఉదాహరణ అయినా చెప్పగలరా? ఫలానా ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీని తిరస్కరించారు కనుక జగన్పై వ్యతిరేకత ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ అధికార పార్టీ దూసుకుపోతుంటే పోవాలి జగన్ అని ఎవరు అనుకుంటున్నట్టు? సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు అయినా పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోకుండా, అధికార పార్టీని విమర్శించడానికే బీజేపీ నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల మీడియాలో ప్రచారం దక్కుతుందేమో గాని ప్రజల్లో పాపులారిటీ పెరగదన్న సంగతి గ్రహిస్తే బీజేపీకే మంచిది.
Also Read : ఆ నేతల బలం అధికారమనే గొడుగు,అది లేకుంటే…