టెంపర్ తర్వాత సరైన హిట్ లేక బాగా ఇబ్బంది పడిన దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ కిక్కు అంతా ఇంతా కాదు. ఊహించని స్థాయిలో హీరో రామ్ కు మాస్ ఇమేజ్ రావడంలో అది చాలా హెల్ప్ అయ్యింది. మాస్ ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మసాలా కంటెంట్ ని సరైన మోతాదులో ఇవ్వడంతో రికార్డులు కూడా బద్దలయ్యాయి. తాజాగా పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ (ప్రచారంలో ఉన్న టైటిల్)చేస్తున్న సంగతి తెలిసిందే. కీలకమైన ముంబై షెడ్యూల్ జరుగుతుండగా లాక్ డౌన్ వచ్చి ఆగిపోయాక మళ్ళీ రీ స్టార్ట్ చేయనే లేదు. త్వరలోనే మొదలుపెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఫ్రెష్ అప్ డేట్ విషయానికి వస్తే కెజిఎఫ్ తో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న యష్ దాని తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదు. ఆచి తూచి కథలను వింటున్నాడే తప్ప ఏ దర్శకుడికీ ఖరారుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ పూరి చెప్పిన ఒక లైన్ నచ్చడంతో దాని ఫైనల్ వెర్షన్ విన్నాక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. హాలిడేస్ లో పూరి దీని మీదే వర్క్ చేసినట్టు వినికిడి. యష్ మూవీ అంటేనే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్. కెజిఎఫ్ దెబ్బకు ఇకపై వచ్చే ఏ సినిమా అయినా సరే ఆ స్థాయిలో అంతకు మించిన బడ్జెట్ తో రూపొందాల్సిందే. మరి పూరి ఎలాంటి కథ చెప్పాడో.
మరో సమాచారం ప్రకారం మహేష్ కు పోకిరి, రవితేజ ఇడియట్ రేంజ్ లో కోట్ల రూపాయల ఖర్చు లేకుండానే ఇమేజ్ అమాంతం పెరిగేలా ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు సిద్ధం చేసినట్టు టాక్. కెజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అభిమానులు చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అనేది చెప్పలేదు కానీ సమ్మర్ రిలీజ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. అప్పుడు రాధే శ్యామ్, ఆచార్య, వకీల్ సాబ్ డేట్లను బట్టి దీన్ని లాక్ చేయబోతున్నారు. సో టీజర్ లో డేట్ చెప్పడం అనుమానమే. దీని తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేయబోతున్న సంగతి తెలిసిందే.