జీవితమే ఒక పాట అంటారు. దాంట్లో అపస్వరాలే ఎక్కువుంటాయి. పాటలు పాడని వాళ్లు , ఇష్టపడని వాళ్లు అసలు ఉండరేమో! ప్రతి వాడూ చిన్నప్పుడు పాటగాడే. మా రాయదుర్గం స్కూల్లో పెంచల్రావు అని ఒకడుండేవాడు. SI కొడుకని గర్వం. పాటలు అద్భుతంగా పాడతానని విశ్వాసం. స్కూల్ సమావేశాల్లో తగులుకునే వాడు. మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం… అని ఉతికేవాడు. ఒకసారి మదువు ఒలకబోసే అని ఎత్తుకుంటే ప్రిన్సిపాల్ చెడామడా తిట్టాడు. ఆయన పేరు నారాయణస్వామి. నెత్తి మీద గడ్డిపరకల్లా నాలుగు వెంట్రుకలుండేవి. ఆయనకి బర్మా కోడి అని నిక్ నేమ్. ఆయనంటే భయం. కోపం వస్తే పిచ్చిపిచ్చిగా తన్నేవాడు.
ఒకసారి జ్ఞానమూర్తి అనే వాన్ని ఇలాగే తన్నాడు. వాడికి చదువు తప్ప మిగతా జ్ఞానమంతా వుండేది. ఒకసారి నాకు బైక్ నేర్పిస్తానని నమ్మించి పెట్రోల్‌కి డబ్బులు కొట్టుకెళ్లాడు. జ్ఞానం అంటే జేబు కొట్టడమని తొలిసారి తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాకు ఎవరైనా టోకరా ఇస్తే ముద్దుగా జ్ఞానమూర్తి అని పిలుచుకుంటాను.
మా క్లాస్‌లో రామాంజి అని ఇంకో పాటగాడు. శ్రోతల వేటగాడు. ఎపుడూ జేబులో పాటల పుస్తకం రెడీగా వుండేది. నలుగురు కలిసి నవ్వే వేళ పాట ఎత్తుకునే వాడు. ముగింపు వాడి చేతుల్లో కూడా వుండేది కాదు. పాటల పుస్తకం అయిపోవాల్సిందే.
చెన్నవీర కన్నడ పాటలు పాడేవాడు. వీడికి కొంచెం సంగీతం వాసన వుండేది. బుల్బుల్ తార , డ్రమ్స్ వాయించేవాడు. తొలిసారిగా సంగీత వాయిద్యాలు పరిచయం చేసిన వాడు. డిగ్రీలో నవాబ్ అనేవాడు రఫీ, ముకేష్ విషాద గీతాలు పాడేవాడు. అనంతపురం గుల్జార్‌పేటలో ఒకమ్మాయిని లవ్ చేసి రోజూ సైకిల్‌పై ఆ రూట్లో పాటలు పాడుతూ తిరిగేవాడు. ఆ అమ్మాయికి పెళ్లయ్యాక సైగల్ పాటలు కూడా స్టార్ట్ చేశాడు. పాడిపాడి అలసిపోయి దుబాయ్‌లో ఉద్యోగం చూసుకుని పిల్లాపాపలతో సెటిలైపోయాడు.
జయరాజ్ అని అపర జేసుదాసు. వీడి స్పెషాల్టీ ఏమంటే తానే పాటలు రాసి ట్యూన్ కట్టుకుని పాడేవాడు. సూర్యరాయంధ్ర నిఘంటువు కొని ఎవడికీ అర్థం కాని పదాలతో పాట రాసేవాడు. సంగీతం నేర్చుకోలేదు కానీ, కుక్కలు దొంగని వాసన పట్టినట్టు జన్మతా వీడికి ఏదో రాగజ్ఞానం వుండేది. పాటని కెరీర్‌గా మార్చుకున్న ఏకైక మిత్రుడు. వృత్తిరీత్యా క్రైస్తవ గీతాల గాయకుడు.
Also Read : రఘురామరాజు రెండో కోణం ఆలోచించలేదా..?
SK యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ చదువుతున్నప్పుడు నా రూమ్మేట్తో హార్మోనియం వుండేది. చికెన్ ఫుల్‌గా తిన్నప్పుడు దాంట్లో వేలు పెట్టేవాడు. బ్లాక్‌ని మొత్తం భయపెట్టేవాడు. జర్నలిజంలో రాతకోతలే తప్ప పెద్దగా పాటగాళ్లు తగల్లేదు.
చిన్నప్పటి నుంచి పాట ఇష్టం. పాటల కోసం కార్మికుల కార్యక్రమం అనే సుత్తిని రేడియోలో ఓపిగ్గా వినేవాన్ని. సిలోన్లో ఉదయం హిందీ, మధ్యాహ్నం మీనాక్షి పొన్నుదురై గొంతు. టీవీలో చిత్రలహరి కోసం పడిగాపులు.
రాయదుర్గంలో దొంతి అనే ఇంటి పేరుతో పెద్ద కుటుంబం వుండేది. వాళ్ల ఇంట్లో ఎపుడూ ఏదో ఒక ఫంక్షన్. చిన్నప్పుడు ఆ ఇంట్లో విన్న పేరంటం పాటలు ఇంకా గుర్తే, రేడియో నుంచి టేప్ రికార్డర్, వాక్‌మన్, ఇప్పుడు యూట్యూబ్.
సంగీతంలో మన పరిధి పెరిగేకొద్ది అద్భుతాలు వినిపిస్తాయి. గుడ్బాడ్ అగ్గీ సంగీత కర్త ఎన్నోమోరికన్ నా ఆల్‌టైం ఫేవరెట్. సెకండ్ వాల్జ్ (సిస్టకోవిచ్) వినకుండా ఒక్కరోజు కూడా నిద్రపోను. ఈ మధ్య US వెళ్లినప్పుడు న్యూయార్క్ బ్రాడ్వేలో సంగీత రూపకాలు, జేబు పర్మిట్ చేస్తే ఆండ్రీ రీయో (Andre Rieu) ప్రోగ్రాం చూద్దామనుకున్నా, కరోనా వల్ల వీలుకాలేదు.
మైకెల్ జాక్సన్ , బోనీఎం (ముఖ్యంగా రస్పుతిన్) ఆర్డి బర్మన్ (45 ఏళ్లుగా షోలే మౌత్ ఆర్గాన్) శంకర్ జైకిషన్, రెహమాన్, ఇళయరాజా ఎన్ని చెప్పినా, ఎందరి గురించి చెప్పినా తక్కువే. ఈ మధ్య బాండ్ గర్ల్స్ వయోలిన్ పిచ్చి పట్టుకుంది. పాట ఒక పిచ్చి, సంగీతం ఒక పిచ్చి. ఆ పిచ్చే లేకపోతే కరోనాకి నిజం పిచ్చి పట్టేది. ఇపుడు ఇదంతా ఎందుకంటే జూన్ 21 సంగీత ప్రపంచ దినోత్సవం.
వినే చెవులు ఉండాలి కానీ, సృష్టిలోని ప్రతి శబ్దమూ సంగీతం. మాటలు రాని పసిపిల్లలు అద్భుత సంగీత సృష్టికర్తలు.
Also Read : ‘ఫ్లైయింగ్ సిక్’ కన్నుమూత, దిగ్గజ అథ్లెట్ కి పలువురి నివాళి