– నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
తిండి కలిగితే కండ గలుగునోయ్.. కండ గలవాడోయ్ మనిషోయ్.. అనేవారు. ఇప్పుడు శారీరక బలం కన్నా మానసిక బలం ముఖ్యం అంటున్నారు వైద్యులు. ఉద్యోగ వత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులూ.. కారణ మేదైనా గుప్పెడంత గుండె గాబరా పడుతోంది. ఆ గాబరా చేటు చేయకుండా ఉండాలంటే.. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని అంటున్నారు వైద్యులు. మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. ఒకటే టెన్షన్.. ఉరుకులపరుగల జీవితం. కనీసం కుటుంబ సభ్యులతో సైతం గపడలేని దయనీయత. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 10న జరుపుకోవాలని ప్రకటించింది. ఈ ఏడాది మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ.. ప్రతి చోటా అనే నినాదాన్ని ఇస్తోంది.
ఒకదానిపై ఒకటి ఆధారం
మానసిక ఆనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్సను మధ్యలోనే ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం శారీరక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. కనుక అటు శారీరకంగానూ, ఇటు మానసికంగానూ దృఢంగా ఉండేలా చూసుకోవాలి. అప్రమత్తంగా ఉండేందుకు వసరమైన అంశాలను తెలుసుకోవాలి. మానసిక రోగం పేరుచెబితే చాలు మనందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా భయం వల్లనే వణికిపోతాం. మానసిక వైద్యనిపుణుల అంచనా ప్రకారం 40 శాతం మంది పిచ్చివాళ్లే అంటారు. ఇది మెడికల్ అనాలసిస్ మాత్రమే. వాస్తవంగా చెప్పాలంటే సమాజంలో ఏ రెండు శాతం మందే మానసికంగా పూర్తిగా ఫిట్‌గా ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో వింత పోకడలు ఉన్న వారు కనిపిస్తుంటారు. ఒకరికి తిండి పిచ్చి, నగల పిచ్చి, డబ్బు సంపాదించాలనే పిచ్చి, సినిమాలు విపరీతంగా చూడటం, గొప్పలు చెప్పుకునేపిచ్చి, ఆడంబరాలకు పోయే పిచ్చి ఇలా ఎన్నో రకాల మానసిక రుగ్మతలు ఉన్న వారు మన చుట్టూనే కనిపిస్తుంటారు. ఏ లక్షణమైన అవధులు దాటితే అవి పిచ్చి చేష్టలే అవుతాయి.
మానసిక వైకల్యాలు అనేక విధాలు..
వైద్య పరిభాషలో మానసిక వైకల్యాలను పలు రకాలుగా చెప్పారు. డిప్రెషన్, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ డిజార్దర్, పానిక్ డిజార్డర్, అబ్సెసిస్ కంపల్సెవ్ డిజార్డర్, పోస్టు ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్దర్, ఫోబియా, మానియా, స్కిజోప్రినియా, డిల్యూషన్ డిజార్డర్, స్లిప్ డిజార్డర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వైకల్యాలు ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేక పోవడమే రుగ్మతలను తెచ్చిపెడుతోంది. కష్ట సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగి పోకుండా బ్యాలెన్సుగా ఉండగలిగితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. ఒత్తిడికి గురికాకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలనే గాని ఆందోళనకు గురికాకూడదు అంటారు మానసిక వైద్య నిపుణులు.
మానసిక ప్రశాంతత ముఖ్యం..
మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఉండేలా చూసుకోవాలి. తగుమోతాదులో పౌష్టికాహారం, రోజులో కసనం గంట సేపు వ్యాయామం, రిలాక్సేషన్ ఎక్స్ర్సైజులు, తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా ఉండాలి. ఎంతటి పెద్ద సమస్యల అయినా కుంగి పోకుండా ఉండేలా మనసును దృఢంగా ఉంచుకోగలగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందనే విషయాన్ని బలంగా నమ్మాలి. ఇలా ఆలోచితస్తే ఆందోళన దూరం అవుతుంది. ఈ పాటి జాగ్రత్తలు పాటిస్తే మానసిక రుగ్మతలు మన దరి చేరవని సైక్రియాటిస్టులు అంటున్నారు. క్లిష్టతరమైన సమస్యలు వచ్చినప్పుడు తలమునకలు కాకుండా ఉండటం, వాటిని ధైర్యంగా పరిష్కరించుకోగలగటం, అందనివాటికి అర్రులు చాచి ఆందోళన చెందకుండా మనసును పదిలంగా ఉంచుకోగలి దృఢంగా ఉండాలి.
వృద్ధులు మరింత జాగ్రత్త
ఇటీవల కాలంలో మానసిక వ్యాధులతో ఎక్కువగా ఆసుపత్రులకు వస్తున్న వారిలో వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారనేది ఒక సర్వే తేల్చిన నిజం. వృద్ధులతో పాటు మధ్యవయస్కులు కూడా మానసిక వ్యాధులకు గురవుతున్నారు. మానసిక చికిత్స కేంద్రాలకు వచ్చే ప్రతి వంద మందిలో వృద్ధులు 25 మంది ఉంటున్నారనే సర్వేలో తేలింది. వీరిలో అత్యధికులు డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన, డిమెన్షియా వంటి ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. వృద్ధాప్యంలో మానసిన రుగ్మతలు దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు మానసిక వైద్యులు. వృద్ధుల పట్ల కుటుంబంలోని ఇతర సభ్యులు వారి పట్ల ప్రేమతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ వయస్సు వారిలో అయినా మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తే వారిని వెంటనే సైక్రియాటిస్టు వద్దకు తీసుకెళ్లాలి.
ఇది గుర్తుంచుకోండి..
సమాజం వేగంగా పరిగెడుతోంది. అందరి కంటే నేనే ముందుండాలి. రేపటిని ఈ రోజే చూడాలి. ప్రపంచాన్ని గెలవాలనే టార్గెట్‌తో అనేక మంది జీవితంలో నిరంతరం పరుగులు పెడుతున్నారు. ఆ వేగంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయిన వాళ్లను కూడా పట్టించుకోవడం లేదు. బంధాలను మరిచిపోతున్నారు. జీవితంలో వేగం ఉండాలే కాని వేగమే జీవితం కాకుడదు. బాధల్లో , కష్టాల్లో ఉన్నప్పుడు మన వాళ్లు తోడుంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ బంధువులు, బాంధవ్యాలను తెంచుకుంటే తిరిగి రావు. అందుకే వ్యసనాలకు, ఆందోళనకు స్వస్తి చెప్పి ప్రశాంతంగా నవ్వూతూ ఉంటే మానసిన ప్రశాంతత మీ సొంతం అవుతుంది. కష్టాలు, బాధలు, లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. వాటిని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే మనకే నష్టం. మనసు బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటేందనే విషయాన్ని గుర్తించాలి.