ఆయన్ను క్షత్రియుడని అంటారు ప్రత్యర్థులు. కాదు తాను కొండదొర వర్గానికి చెందినవాడినన్నది ఆయన వాదన. ఈ వివాదం సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. ఈ కారణంతోనే ఒకసారి ఆయన ఎమ్మెల్యే పదవినీ కోల్పోవలసి వచ్చింది. వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి జిల్లా స్క్రుటినీ కమిటీ చెంతకు చేరింది. అధికార బలంతో తాను ఎస్టీనే అనిపించుకున్న ఆయనకు మారిన రాజకీయ పరిణామాలు.. సొంత పార్టీలో మరో వర్గం బలపడటం సెగ పెడుతున్నాయి. దాంతో మళ్లీ ఎమ్మెల్యే అవ్వాలన్న ఆయన అసలు గల్లంతు అవుతున్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజదేవ్ ఇప్పుడు అధికార వైఎస్సార్సీపీ నుంచే కాకుండా సొంత పార్టీలోనూ సవాళ్లతో సతమతం అవుతున్నారు.
తప్పుడు కులం ఆరోపణలతో అనర్హత
గతంలో టీడీపీ బలంగా ఉన్న సాలూరు నియోజకవర్గంలో రాజేంద్ర ప్రతాప్ భంజదేవ్ ఆ పార్టీ నేతగా చక్రం తిప్పేవారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచి తిరుగులేని ఎమ్మెల్యేగా పేరుపొందారు. ఆ తర్వాత ఆయన కుల వివాదంలో చిక్కుకున్నారు. మొదట 2002లో రేగు మహేశ్వర రావు అనే న్యాయవాది భంజదేవ్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఎస్టీ నియోజకవర్గమైన సాలూరులో పోటీ చేస్తున్నారని ఆరోపిస్తూ కోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 2004 ఎన్నికల్లో భంజదేవ్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పీడిక రాజన్నదొర కూడా భంజదేవ్ కులాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్షత్రియుడైన భంజదేవ్ కొండదొర అని నకిలీ పత్రాలు సృష్టించి పోటీ చేసినందున ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ ఎన్నికల పిటిషన్లను విచారించిన హైకోర్టు భంజదేవ్ ఎస్టీ కాదని తేల్చింది. ఆయన ఎన్నిక చెల్లదని స్పష్టం చేస్తూ.. సమీప ప్రత్యర్థిగా ఉన్న రాజన్నదొరను ఎమ్మెల్యేగా ప్రకటించాలని 2006 మార్చి పదో తేదీన తీర్పు ఇచ్చింది. దాంతో భంజదేవ్ పదవి కోల్పోయారు. అదే ఏడాది ఏప్రిల్ 16న రాజన్నదొర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ ఇదే కారణంతో భంజదేవ్ పోటీ చేయలేక పోవడంతో..
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గుమ్మడి సంధ్యారాణిని పార్టీ బరిలోకి దించింది.
రాజకీయ సవాళ్లు
తాను ఎస్టీని కాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భంజదేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించింది. దాంతో 2014 ఎన్నికల్లో మళ్లీ సాలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భంజదేవ్ కు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో దిగిన పీడిక రాజన్నదొర చేతిలో ఓటమి ఎదురైంది. అదే సమయంలో భంజదేవ్ కుల వివాదాన్ని జిల్లా స్క్రుటిని కమిటీ వద్దే తేల్చుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు కేసును మూసేసింది. దాంతో గత ఎన్నికలకు ముందు భంజదేవ్ జిల్లా స్క్రుటినీ కమిటీని ఆశ్రయించగా భంజదేవ్ అసలైన ఎస్టీ అని కమిటీ ప్రకటించింది. దాంతో ఈ వివాదానికి తెరపడినా.. భంజదేవ్ రాజకీయ ప్రభ మాత్రం వెలగలేదు. గుమ్మడి సంధ్యారాణిని టీడీపీ ఎమ్మెల్సీని చేయడంతో నియోజకవర్గంలో ఆమె హవా పెరిగింది. మరోవైపు
గత ఎన్నికల్లో మళ్లీ ఆయన రాజన్నదొర చేతిలో ఓడిపోయారు. ఇటీవల సంధ్యారాణిని అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలిగా నియమించడంతో పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరిగింది. నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నప్పటికీ భంజదేవ్ పెద్దగా పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం లేదు. అటు వైఎస్సార్సీపీ జోరు.. ఇటు పార్టీలో సంధ్యారాణి వర్గం అధిపత్యంతో భంజదేవ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
మంత్రి పదవిపై రాజన్న ఆశలు
ఎస్టీ ఎమ్మెల్యేల్లో సీనియర్ అయిన రాజన్న దొర మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి ఇదే వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న మంత్రులను మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు నవంబర్, డిసెంబర్ నెలల్లో మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు తనకు అవకాశం లభించవచ్చని రాజన్న భావిస్తున్నారు. కానీ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా సీనియరే ఆయన్నుంచి రాజన్నదొరకు పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పుష్ప శ్రీవాణిని మారుస్తారా.. మారిస్తే ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరం. విశాఖ జిల్లాలో ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నా వారు మొదటిసారి ఎన్నికైనవారు కనుక రాజన్న, బాలరాజు, కళావతి మధ్యే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.