ఒకప్పుడు నందమూరి తారకరామారావు గారి హయాంలో రాజ్యమేలిన భక్తి సినిమాలు తర్వాతి కాలంలో మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా బ్యాక్ టర్న్ తీసుకోక తప్పలేదు. చిన్న ఆర్టిస్టులు మీడియం రేంజ్ హీరోలు తప్ప వీటి జోలికి ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు. 1996లో దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు అన్నమయ్యతో బ్లాక్ బస్టర్ సాధించాక ఒక్కసారిగా వీటికి మార్కెట్ ఊపందుకుంది. అందరు హీరోలు ఇదే బాట పట్టారు. చిరంజీవి శ్రీమంజునాథతో మొదలుకుని అసలు ఇమేజే లేని తారకరత్న లాంటి వాళ్ళు కూడా వీటిని ట్రై చేశారు. కానీ ఫలితం దక్కింది తక్కువే. నాగ్ సైతం షిరిడి సాయితో ప్రేక్షకులు ఇక చాలు ప్రభో అనేదాకా చేస్తూ వచ్చారు.
అసలు విషయానికి వస్తే అఖండ సూపర్ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ త్వరలో ఓ ఆధ్యాత్మిక చిత్రం చేస్తారన్న ప్రచారం ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. శ్రీ రామానుజాచార్య జీవిత కథ ఆధారంగా రాఘవేంద్రరావు డైరెక్షన్లోనే ఇది తీసేందుకు ఓ నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రచయిత జేకే భారవి ఈ పని మీదే ఉన్నారని వినికిడి. గతంలో బాలయ్య దర్శకేంద్రుల కాంబినేషన్ లో పాండురంగడు వచ్చించి. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆల్ టైం క్లాసిక్ పాండురంగ మహత్యాన్ని రీమేక్ చేస్తూ న్యూ జెనరేషన్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు తీర్చిదిద్దడంలో విఫలం కావడంతో ఫైనల్ గా ఫ్లాప్ అనిపించుకుంది.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ ఆలోచన చేయడం ఒకరకంగా సాహసమే. ఇన్ని డిజాస్టర్ల తర్వాత బాలయ్య రియల్ స్టామినా అఖండ ఋజువు చేసిన మాట వాస్తవమే కానీ ఆయన్ని మాస్ హీరోయిజం ఎలివేట్ చేసే కమర్షియల్ సినిమాల్లో చూసేందుకే ఇష్టపడతారు. ఇప్పుడు రామానుజచార్యా అంటూ ప్రవచనాల బాట పడితే రిస్క్ ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఈ జానర్ బాలకృష్ణకు గతంలోనూ అంతగా అచ్చిబాటు రాలేదు. పైగా గోపిచంద్ మలినేని-అనిల్ రావిపూడి సినిమాల తర్వాత ఎంటర్ టైన్మెంట్ లేని సబ్జెక్టులు ఎంచుకుంటే ఇబ్బందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా చెప్పలేం కానీ ఈ ఆలోచన మాత్రం రిస్కే
Also Read : RRR & Valimai : రాజమౌళితో బోనీ ఢీ కొట్టేది ఇందుకేనా ?