కష్టం వస్తే కాపాడతారనే నమ్మకాన్ని… తమకు ఏ నష్టం రానివ్వరనే భరోసాని… ఆపదొస్తే అండగా ఉంటారనే ధైర్యాన్ని…ఇచ్చేవాడే అసలు సిసలైన నాయకుడు. అలాంటి నాయకులు జిల్లా టిడిపిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తరుణంలోనూ వారి ఆచూకీ లేదు. నేతల తీరుతో సొంత పార్టీ కార్యకర్తలు సైతం దిక్కుతోచక, జనానికి ముఖం చూపించలేక చెల్లాచెదురవుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లా రాజకీయాలు ప్రత్యేకమనే చెప్పాలి. ఇక్కడ అధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంటుందనేది వాస్తవం. అయితే ఆ కుటుంబాల్లోని వారు ప్రజలను పాలించే విధానాన్ని బట్టి ప్రజాదరణ పొందడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి..తరతరాలుగా జిల్లా ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలతో నిమిత్తం లేకుండా కొన్ని కుటుంబాల వారికే పట్టంగడుతూ వస్తున్నారు. అదే రాజకుటుంబం. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కురుపాం ప్రాంతాల్లోని ఈ రాజకుటుంబాల సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలుగా పదవులు పొంది, అనుభవించారు.
ముఖ్యంగా వీరిలో 99 శాతం మంది టిడిపిలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజ్యం సంక్షోభంలో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు రాజ్యాన్ని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాజుపై ఉంటుంది. కానీ జిల్లా రాజులు మాత్రం పేరుకే రాజులు తప్ప, రాచబిడ్డకు ఉండాల్సిన లక్షణాలేవీ వారిలో కనిపించడం లేదని ఎంతోమంది విమర్శలు చేస్తున్నా వారిచెవికి ఎక్కడం లేదు. చెవులుండీ వినలేని, కళ్లుండీ చూడలేని వారి అసమర్థతే వారి పతనానికి కారణమయ్యింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని తెచ్చిపెట్టింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టిడిపికి భారీ షాక్ ఇచ్చాయి. అప్పటి నుండి ఇంకా తేరుకోలేదు. జిల్లాలో టిడిపి దాదాపు చతికిలపడింది. తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను, విజయనగరం ఎంపి, అరుకు ఎంపి స్థానంతో సహా వైసిపి చేజిక్కించుకున్నప్పుడే జిల్లా టిడిపి చావుదెబ్బతగిలింది. అయితే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిపోయినంత మాత్రాన ప్రజలను, కార్యకర్తలను పూర్తిగా టిడిపి నేతలు విస్మరించడం వారి స్వార్థానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.
టిడిపి నాయకులెవరూ ఈ అపవాదును తుడిచే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఫలితంగా జిల్లాలో టిడిపిని జనం పూర్తిగా మర్చిపోతున్నారు. టిడిపినే నమ్ముకున్న సామాన్య కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారికి నాయకుడు లేడు. ప్రజల్లో పార్టీకి ఆదరణ లేదు. మరోవైపు కరోనా కష్టాలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది టిడిపిని వీడి వైసిపిలో చేరారు. మిగిలిన కొద్దిమంది టిడిపికి దూరంగా ఉంటున్నారు.
ఇక కరోనా సమయంలోనైనా టిడిపి నేతల్లో మార్పు వచ్చిందా..? అంటే అదీలేదు. గతంలో అనేక సార్లు తమకు పదవులు కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకుందామనే ఆలోచన ఆ పార్టీ నాయకులకు రాలేదు. నెలల తరబడి లాక్ డౌన్ అమలు జరుగుతున్న వేళ వ్యాపారాలు లేక, పనులు దొరక్క, ఉపాధి కరువై బతుకు బరువై అనేక ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలను ఆదుకునే ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టలేదు.
పైగా తమ సొంత ప్రాబల్యం కోసం మాత్రమే పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడారు. ఆస్తి కోసం అస్తిత్వం కోసం మాత్రమే అప్పుడప్పుడూ తళుక్కున మెరిశారు. ఆ చర్యల వల్ల వారి ప్రతిష్ఠను మరింతగా దిగజార్చుకున్నారు. అధిష్టానం ఆదేశించినపుడు తప్పనిసరై నోరువిప్పుతున్నారు. అది కూడా చేయలేని కొందరు పత్రికా ప్రకటనలతో సరిపెడుతున్నారు. జిల్లాలో ఒకరిద్దరిని మినహా ప్రజలు టిడిపి నాయకులను చూసి కొన్ని నెలలవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. టిడిపి హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కనీసం జనం కోసం ఒక్క సాయం కూడా చేయడం లేదు.
కానీ ఇంకా ప్రజలను అమాయకులుగా భావించి వారిని నమ్మించడం కోసం అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వాట్సప్‌లలో విమర్శలు చేస్తున్నారు. సొంతపార్టీ నాయకులు చనిపోతేనే సంతాపం తెలపనివారు, ఆ కుటుంబానికి సానుభూతి తెలపడానికి ఒక్కమాట మాట్లాడనివారు ఇక జనాన్ని ఏం పట్టించుకుంటారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
విజయనగరంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, టిడిపి నేత ఐవిపి రాజు, బొబ్బిలిలో మాజీ రాష్ట్ర మంత్రి సుజన కృష్ణ రంగారావు, ఆయన తమ్ముడు బేబినాయన, సాలూరులో ఆర్పీ భంజదేవ్, కురుపాంలో చత్రుచర్ల విజయరామరాజు కుటుంబం, వైరచర్ల కిషోర్ చంద్రదేవ్ లు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు. అలాగే అధికారాన్ని చెలాయించారు. అలాగే విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీతా, నెలిమర్లలో పతివాడ నారాయణ స్వామి, చీపురుపల్లిలో మాజీ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, ఎస్. కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, సాలూరులో ఎమ్మెల్సీ సంధ్యారాణి, పార్వతీపురంలో ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, కురుపాంలో మాజీ ఎమ్మెల్యే థాట్రాజ్ కుటుంబం టిడిపి నేతలు పత్తా లేకుండా పోయారు. టిడిపి పాలనలో అధికారాన్ని చెలాయించిన నేతలంతా ఇప్పుడు మౌనంగా ఉండటం..టిడిపి కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఈ నేతలు ఏ వారానికో, నెలకో ఒక సారి మీడియా ప్రకటనలతో సరిపెడుతున్నారు.
దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అధికారంలో లేకపోవడం, రెండు అంతర్గత పోరు. జిల్లాలో సాలూరు అంతర్గత పోరుకు కేంద్ర బిందువు. మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మధ్య పోరు రచ్చకెక్కింది. సాలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో టిడిపి కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు. వీరిద్దరి అంతర్గత పోరులో బలైన టిడిపి రాష్ట్ర నేత శోభా హైమవతి కుమార్తె, మాజీ జిల్లా చైర్మన్ పర్సన్ స్వాతిరాణి ఇటివలి టిడిపికి గుడ్ బై చెప్పి…వైసిపి ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు.