ఎవరి ప్రయోజనాల కోసం కొత్తగా జిల్లాలు పెంచుతున్నారని టీడీపీ నేత బోండా ఉమమహేశ్వరరావు ఆశ్చర్యకరమైన ప్రశ్నను సంధించారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ విభజన వల్ల ఎవరికైనా ప్రయోజనాలు చేకూరుతాయా?. ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతాయో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం విడిపోయిన తరువాత గతంలో తెలంగాణలో కూడా ఇదే విధంగా జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల సంఖ్య పెంపు నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. పైగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
బాబు మెప్పు పొందడానికా?
ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడాన్ని పార్టీలకు అతీతంగా చాలామంది ప్రముఖులు మెచ్చుకున్నారు కూడా. ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టెది ఒక దారి అన్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రమే జిల్లాల సంఖ్య పెంచడంపై చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మెప్పు పొందడానికా అన్నట్టు బోండా ఉమమహేశ్వరరావు ఎవరి ప్రయోజనాల కోసం కొత్తగా జిల్లాలు అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు తెలంగాణ ప్రభుత్వమైనా, నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా కొత్త జిల్లాలు పెంచింది అంటే ప్రజా ప్రయోజనం కోసమే గాని ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. జగన్మోహన్రెడ్డి పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల సంఖ్య పెంచారు కాని, ఇప్పుడు అర్థాంతరంగా తెరపైకి వచ్చిన అంశం కాదన్న సంగతి టీడీపీ నాయకులు గమనించాలని సూచిస్తున్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేది టీడీపీ వారే..
తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల ప్రయోజనం కోసం చంద్రబాబునాయుడు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తమ పార్టీ ప్రభుత్వం అలాంటిది కాదని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు చంద్రబాబుకు ఏటీఎం సెంటర్లా పోలవరం ప్రాజెక్టు, టీడీపీ కార్యకర్తలకు కలెక్షన్ సెంటర్లుగా జన్మభూమి కమిటీలు, నాయకులు దండుకోవడానికి బినామీ పేర్లతో ప్రభుత్వ కాంట్రాక్టులు.. ఇదీ టీడీపీ చరిత్ర అని అంటున్నారు. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి ఒక్క అభివృద్ది పని కూడా జరగలేదని, ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్న ఉమ ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏమిటి? నాలుగు రోడ్లు, వీధి లైట్లు, ఉద్యాన వనాలునా? దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నట్టు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధించినట్టే? ఆ విషయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తిరుగులేని ప్రగతి సాధించింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యుల జీవన ప్రమాణాలు పడిపోకుండా అనేక సంక్షేమ పథకాలతో వారి ఖాతాల్లో రూ.లక్షా 21 వేల కోట్ల రూపాయలను జమ చేసిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ అభివృద్ధి బోండా ఉమకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : సక్రమంగా స్పందిస్తే చంద్రబాబు ఎందుకవుతారు?