ఏపీలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలను అటు అధికార వైసీపీ సహా ప్రతిపక్ష టీడీపీ సీరియస్ గా తీసుకున్నాయి. అయితే మాట మెదిలితే నేనున్నానని ముందుకొచ్చే లోకేష్ ను ఈ సారి పక్కన పెట్టారు. సమాధాన భేద దండోపాయాలు అన్నీ వాడైనా సరే గెలుచుకు రమ్మని చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా కొన్ని మునిసిపాలిటీలకు ఇన్చార్జిలను నియమించారు. ఇందులో ఏ మున్సిపాలిటీకి కాదు కదా ఏపీ మొత్తం మీద జరుగుతున్న ఏకైక నెల్లూరు కార్పొరేషన్ కు కానీ లోకేష్ ను ఇన్చార్జిగా నియమించలేదు. విచిత్రమేమిటంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా లోకేష్ ను దించడం లేదు. ఎక్కడో గోదావరి జిల్లాకు చెందిన పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడుని నమ్మిన చంద్రబాబు ఇక్కడ లోకేష్ ను నమ్మకపోవడం గమనార్హం.
ఎందుకంటే అధికారంలో ఉన్నంత కాలం కుప్పంలో అధికార పార్టీ వ్యవహారాలను చూసింది లోకేష్, బాబు పీఏ మనోహర్. నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు పూర్తిగా కొడుకు, పీఏలకు వదిలేసిన కారణంగా అక్కడ పార్టీ దాదాపు నాశనం అయ్యే పరిస్థితి. గతంలో లోకేష్ చేసిన వ్యవహారాల వల్ల ఇబ్బంది పడిన చంద్రబాబు చివర్లో భువనేశ్వరిని అక్కడ రంగంలోకి దించారు. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా లైన్లోకి తీసుకొస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్న పిక్చర్ కనపడడంతోనే లోకేష్ ను చంద్రబాబు పూర్తిగా దూరంగా పెట్టేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పెద్దగా అంగబలం అర్ధం బలం లేని రామానాయుడికి అప్పగించారు కానీ లోకేష్ కు అక్కడి బాధ్యతలే కాదు, అసలు ఎక్కడి బాద్యతలు ఎందుకు అప్పగించరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే ఆయన స్థాయి తగ్గించినట్టు ఫీలవ్వచ్చేమో కానీ ఆయన్ని కనీసం ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి కూడా వాడచ్చు. కానీ లోకేష్ కి ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే.. ఆయన పనితనం ఏంటో మరోసారి బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు లోకేష్ ను ఇంట్లోనే కూర్చోబెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో మంగళగిరిలో దిగుతాడో, ఎక్కడ దిగుతాడో తెలియదు కానీ ఇలాంటి చిన్న చిన్న ఎన్నికలను కూడా లీడ్ తీసుకోలేకపోతే బాబు తర్వాత లీడర్ గా టీడీపీ శ్రేణులు భావిస్తున్న లోకేష్ ను శ్రేణులు ఎలా నమ్ముతాయో? ఇక తాజాగా అనంతపురంలో జరిగిన వివాదానికి సంబంధించి అక్కడికి వెళ్లి రచ్చ చేయాలని చూస్తున్న లోకేష్ ఎన్నికల విషయంలో మాత్రం సైలెన్స్ పాటిస్తుండడం విశేషం.