తెలంగాణలోని దళితుల సంక్షేమం కోసమంటూ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. దళిత జాతిని దేశానికి ఆదర్శంగా నిలబెడుతామని ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు హుజూరాబాద్ ను వేదికగా చేసుకున్నారు. ప్రతిష్టాత్మక రైతు బంధు స్కీమ్ ను కూడా హుజూరాబాద్ నుంచి అమలు చేయడమే ఇందుకు కారణం. కానీ ఉన్నట్టుండి తన నిర్ణయం మార్చుకున్నారు కేసీఆర్. హుజూరాబాద్ నుంచి కాకుండా వాసాలమర్రి నుంచే దళిత బంధును ప్రారంభించేశారు. సడన్ గా కేసీఆర్ రూట్ మార్చడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
బైపోల్ నోటిఫికేషన్ వస్తే అమలు కుదరదని..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం ఖాళీ అయింది. నిబంధనల ప్రకారం అసెంబ్లీ లేదా లోక్ సభ సీటు ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వాయిదా వేసే అవకాశం లేదు. త్వరలోనే హూజూరాబాద్ లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. నోటిఫికేషన్ రాబోతోందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో పథకం అమలు లేట్ అయినా.. హుజూరాబాద్ లో అమలు చేయాలనుకున్నా చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే చోట్ల కొత్త పథకాలను అమలు చేయడానికి వీలు లేదు.
ఈ నేపథ్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. అక్కడి నుంచే దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించేశారు. వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలు ఉన్నాయని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 7.6 కోట్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. గురువారమే ఇందుకు సంబంధించిన జీవో కూడా జారీ చేశారు. జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాలో నిధులు జమయ్యాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. పథకం అమలుకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు.
విమర్శలను తిప్పికొట్టేందుకు..
తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ హామీలు కురిపిస్తారని విమర్శలున్నాయి. గతంలో హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ బైపోల్స్ సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇప్పుడు హుజూరాబాద్ లో ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత మరిచిపోతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అంటున్నాయి. తనపై ప్రతిపక్షాలు వేస్తున్న అపవాదును తొలగించుకునేందుకు వాసాలమర్రిని దళిత బంధు పథకం అమలుకు వేదికగా ఎంచుకున్నారు కేసీఆర్. అది తన దత్తత గ్రామం కావడంతో.. పాజిటివ్ గానే ఫీడ్ బ్యాక్ వస్తోంది. అంతకుముందు నాగార్జున సాగర్ లో కూడా హామీలు ఇచ్చారు కేసీఆర్. మొన్నటి ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.
ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్
దళిత బంధు ప్రారంభిస్తామని ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. ‘మా నియోజకవర్గానికి ప్యాకేజీలు ప్రకటిస్తే.. మేం రాజీనామా చేస్తాం’ అంటే ఒకరిద్దరు ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే హుజూరాబాద్ లో మాత్రమే కాదని.. రాష్ట్రమంతటా దళితబంధును అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్.. లక్ష కోట్లు ఖర్చు అయినా వెనుకాడబోమన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు పథకం అమలును వాసాలమర్రి నుంచి మొదలుపెట్టి ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. విమర్శలకు మాటలతో కాకుండా చేతలతో చెక్ పెట్టారు. సైలెంట్ గా.. సమాచారం బయటికి పొక్కుకుండా.. వాసాలమర్రిలోనే దళితబంధు అమలు గురించి ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు. ప్రతిపక్షాలు ఇంకా అదే షాక్ లో ఉన్నాయి.